జీహెచ్​ఎంసీ కౌన్సిల్​ మీటింగ్​ రచ్చ రచ్చ

జీహెచ్​ఎంసీ కౌన్సిల్​ మీటింగ్​ రచ్చ రచ్చ
  • ప్లకార్డులతో పోడియం వద్దకు దూసుకెళ్లిన బీఆర్ఎస్​ కార్పొరేటర్లు
  • అడ్డుకున్న కాంగ్రెస్​ కార్పొరేటర్లు
  • బిచ్చగాళ్ల వేషంలో వచ్చిన కొందరు బీజేపీ కార్పొరేటర్లు
  • చర్చ లేకుండానే ఆందోళనల మధ్య బడ్జెట్​కు ఆమోదం

హైదరాబాద్ సిటీ, వెలుగు:  గ్రేటర్​హైదరాబాద్​మున్సిపల్​కార్పొరేషన్​కౌన్సిల్​మీటింగ్​ రచ్చ రచ్చ అయింది. బీఆర్ఎస్​కార్పొరేటర్లు ప్లకార్డులతో పోడియం వద్దకు దూసుకురావడం.. వారిని కాంగ్రెస్​కార్పొరేటర్లు అడ్డుకోవడం.. ఉద్రిక్తతకు దారితీసింది. బీఆర్ఎస్​లీడర్లు ఎంతకూ వినకపోవడంతో మార్షల్స్​ఎంటరయ్యారు. లొల్లి చేస్తున్న నలుగురు బీఆర్ఎస్​కార్పొరేటర్లను బయటకు తీసుకువెళ్లారు. వారిని లోపలకు అనుమతించాలని మిగతా వాళ్లు మరింత ఆందోళనకు దిగారు. దీంతో బీఆర్​ఎస్​ కార్పొరేటర్లు అందరినీ మేయర్​విజయలక్ష్మి బయటకు పంపించేశారు. 

బడ్జెట్​పై జరగని చర్చ

జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీసులో మేయర్ విజయలక్ష్మి అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం గురువారం ఉదయం 10:36 గంటలకు ప్రారంభమైంది. దావోస్​లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణకు రూ.1,78  లక్షల కోట్లు పెట్టుబడులను తెచ్చినందున సీఎంను అభినందిస్తూ తీర్మానాన్ని ఆమోదించారు. తర్వాత మేయర్ ప్రసంగించడంతో పాటు  2025–-26 ఆర్థిక సంవత్సరానికి జీహెచ్ఎంసీ అంచనా బడ్జెట్ రూ.8,440 కోట్లు, 2024–-25 ఆర్థిక సంవత్సరానికి రూ.8,118 కోట్లతో రివైజ్డ్ బడ్జెట్​ను ప్రవేశపెట్టారు. 

తర్వాత బడ్జెట్ పై చర్చించాలని సభ్యులను కోరారు. ముందుగా కాంగ్రెస్​ కార్పొరేటర్ రజితారెడ్డికి మాట్లాడేందుకు అవకాశమిచ్చారు.  చర్చ కొనసాగుతుండగానే ఆరు గ్యారంటీల అమలుపై బీఆర్ఎస్ కార్పొరేటర్లు ప్లకార్డులతో పోడియం వద్దకు చొచ్చుకువచ్చి నిరసన తెలిపారు. దీంతో బడ్జెట్‌పై చర్చ చేపట్టాలంటూ కాంగ్రెస్‌ కార్పొరేటర్లు ప్రతిగా ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో బీఆర్ఎస్‌, కాంగ్రెస్‌ కార్పొరేటర్ల మధ్య తోపులాట జరిగింది. దీంతో మేయర్ సమావేశాన్ని వాయిదా వేసి రెండు నిమిషాల తర్వాత ప్రారంభించారు. అయినా ఆందోళన కొనసాగడంతో చర్చలేకుండానే బడ్జెట్​కు ఆమోదం తెలిపినట్లు మేయర్ ప్రకటించారు. తర్వాత మళ్లీ సభను ప్రారంభించారు. క్వశ్చన్​అవర్​లో పాల్గొనాలని మేయర్ ప్రకటించినా.. బీఆర్​ఎస్​ కార్పొరేటర్లు శాంతించలేదు.  ప్లకార్డులను కాంగ్రెస్ కార్పొరేటర్లు చించేశారు. దీంతొ బీఆర్‌ఎస్‌కు చెందిన నలుగురు కార్పొరేటర్లను మార్షల్స్​ బయటకు తీసుకెళ్లారు. 

అనంతరం 20 నిమిషాలు సభకు బ్రేక్​ఇచ్చి మళ్లీ  ప్రారంభించగా.. బయటకు పంపిన తమ కార్పొరేటర్లను లోపలికి అనుమతించాలని మిగతా బీఆర్ఎస్ సభ్యులు పోడియం వద్ద ఆందోళనకు దిగారు. వినకపోవడంతో వారందరినీ సెక్షన్89(1) ప్రకారం సమావేశం నుంచి బయటికి పంపించేస్తున్నట్లు మేయర్ ప్రకటించారు. దీంతో మార్షల్స్ బీఆర్ ఎస్ కార్పొరేటర్లందరినీ బయటకు ఎత్తుకెళ్లారు. తర్వాత పోలీసులు రాంగోపాల్ పేట్ పోలీస్​స్టేషన్​కు తరలించారు. ఆ సమయంలో మళ్లీ సభ వాయిదా పడింది. తిరిగి మధ్యాహ్నం 12.38 గంటలకు ప్రారంభం కాగా, ఈసారి కాంగ్రెస్​, బీజేపీ సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. లంచ్ బ్రేక్ తర్వాత 2 గంటలకు సమావేశం ప్రారంభం కాగా.. 8 ప్రశ్నలపై సభ్యులు చర్చించారు. సభకు నిరవధిక వాయిదా వేస్తున్నట్లు సాయంత్రం 4.20 గంటలకు మేయర్ ప్రకటించడంతో సమావేశం ముగిసింది. కాగా.. బల్దియా అప్పులపాలైందని, పనులు జరగడం లేదంటూ కొందరు బీజేపీ కార్పొరేటర్లు బిచ్చగాళ్ల వేషంలో నిరసన తెలిపారు.