మహబూబ్‌నగర్, వెలుగు : కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్రకు’ మహిళలను సమీకరించేందుకు మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని పార్టీ ఆఫీసులో సోమవారం నిర్వహించిన సమావేశం రసాభాసగా మారింది. మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు, ఉపాధ్యక్షురాలు మాధవి అనుచరుడికి మధ్య వాగ్వాదం జరిగింది. గొడవ కాస్త స్థానిక పోలీస్‌స్టేషన్‌లో కంప్లైంట్ చేసుకునేదాక వెళ్లింది.
వివరాల్లోకి వెళ్తే.. సమావేశానికి చీఫ్ గెస్ట్‌గా హాజరైన సునీతా రావు మాట్లాడుతూ.. త్వరలో రాహుల్‌గాంధీ యాత్ర ఉమ్మడి పాలమూరుకు రానుందని, మహిళలను సమీకరించాలని ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్అధ్యక్షురాలు నీతా డిసౌజ ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పారు. మండలాల వారీగా ఇచ్చిన లిస్ట్ప్రకారం సమీకరణ చేయాలన్నారు. గతంలో నిర్వహించిన పార్టీ రాష్ట్ర స్థాయి మీటింగులకు జిల్లా అధ్యక్షురాలు బెక్కరి అనిత రాలేదని, పని తీరు మార్చుకోవాలని సూచించారు. తన పనితీరు బాగులోకపోతే పదవికి రాజీనామా చేస్తానని బెక్కరి అనిత ఏడ్చుకుంటూ సమావేశం నుంచి వెళ్లిపోయారు. ఈ విషయంపై జోక్యం చేసుకున్న పాలమూరు డీసీసీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్ సునీతారావుకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. మహిళల సమావేశంలో మగవాళ్లు వివరణ ఇవ్వడం ఏమిటని ఆమె ప్రశ్నించారు. దీంతో వివాదం మరింత ముదిరింది. మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మాధవి అనుచరుడు సునీతారావుకు ఎదురు మాట్లాడారు. ‘నువ్వు మాకు డిక్టేట్చేయాల్సిన అవసరం లేదు. ఇది కాలేజీ కాదు. నువ్వు ప్రిన్సిపాల్కాదు. మేం స్టూడెంట్లం కాదు’ అని అన్నారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ సునీతారావు సమావేశం ముగించి బయటికి వెళ్లారు. మహిళా లీడర్లతో కలిసి టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో కంప్లైంట్ చేశారు. అనంతరం తిరిగి పార్టీ ఆఫీసుకు రాగా, లీడర్లు సర్ది చెప్పడంతో సమస్య సద్దుమణిగింది.