కేటీఆర్‌‌కు స్టూడెంట్ వెండి రాఖీ

కేటీఆర్‌‌కు స్టూడెంట్ వెండి రాఖీ

హైదరాబాద్‌‌, వెలుగు : తన చదువుకు ఫీజులు చెల్లించిన మంత్రి కేటీఆర్‌‌కు ఆ విద్యార్థిని వెండి రాఖీ కట్టి కృతజ్ఞతలు తెలిపింది. జగిత్యాల జిల్లా కథలాపూర్‌‌ మండలం తాండ్రియాలకు చెందిన రుద్ర రచన తల్లిదండ్రులు ఆమె చిన్నప్పుడే చనిపోయారు. జగిత్యాల బాలసదనంలో ఉంటూ పదో తరగతి వరకు చదివిన రచన.. హైదరాబాద్ యూసుఫ్‌‌గూడలోని స్టేట్‌‌ హోంలో ఉంటూ పాలిటెక్నిక్‌‌ పూర్తి చేసింది. ఈ–సెట్‌‌లో మెరుగైన ర్యాంకు సాధించి సీబీఐటీలో కంప్యూటర్‌‌ సైన్స్‌‌ బ్రాంచ్‌‌లో సీటు సాధించింది. ఆమె ఫీజులు చెల్లించలేని దుస్థితిని సోషల్‌‌ మీడియా ద్వారా తెలుసుకున్న మంత్రి కేటీఆర్‌‌ 2019లో ఆమెను ప్రగతి భవన్‌‌కు పిలిపించి ఇంజినీరింగ్‌‌ ఫీజులన్నీ చెల్లిస్తానని హామీ ఇచ్చారు.

తన సొంత ఖర్చులతో కాలేజీ ఫీజుతో పాటు హాస్టల్‌‌ ఫీజు కూడా చెల్లించారు. బీటెక్‌‌ ఫైనలియర్‌‌ చదువుతున్న రచన ఇటీవలే క్యాంపస్‌‌ ప్లేస్‌‌మెంట్‌‌లో 4 ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగం పొందింది. సోమవారం ప్రగతి భవన్‌‌లో ఆమె మంత్రి కేటీఆర్‌‌ను కలిసి ఈ విషయం చెప్పింది. తన సేవింగ్స్​తో కేటీఆర్‌‌కు కట్టేందుకు వెండి రాఖీ చేయించానని తెలిపింది. ఎవరూలేని తనకు కేటీఆర్‌‌ అన్నగా, తండ్రిగా వెన్నంటి నిలిచారని చెప్పింది. ఆమె మాటలతో భావోద్వేగానికి గురైన కేటీఆర్‌‌.. రచనకు అండగా నిలుస్తానని భరోసా ఇచ్చారు. సివిల్స్​ రాసేందుకు ఆమెకు తోడ్పాటు అందిస్తానని తెలిపారు. రచన ఫైనలియర్‌‌ ఇంజినీరింగ్‌‌ ఫీజు, హాస్టల్‌‌ ఫీజుకు అవసరమైన మొత్తాన్ని ఈ సందర్భంగా మంత్రి ఆమెకు అందజేశారు.