- ఈనెల 27న ముగియనున్న పాలకవర్గాల టర్మ్
నిజామాబాద్, వెలుగు: ఇప్పటికే రూరల్ లోకల్ బాడీల పాలన స్పెషల్ ఆఫీసర్ల చేతిలోకి వెళ్లగా .. ఈ నెల 27 న మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ పాలకవర్గాల పదవీకాలం కూడా ముగుస్తోంది. ఈ పాలకవర్గాల గడువు ముగిసేలోగా ఎన్నికలు నిర్వహించనందున బల్దియాల్లో కూడా స్పెషల్ ఆఫీసర్లు పాలనాపగ్గాలు చేపట్టనున్నారు.
సత్తా చాటిన మహిళానేతలు
నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్ కార్పొరేషన్‌తో పాటు బోధన్, ఆర్మూర్, భీంగల్ మున్సిపాలిటీలు ఉన్నాయి. బల్దియాలకు 2020లో ఎన్నికలు జరిగాయి. నిజామాబాద్ మేయర్‌తోపాటు మూడు చోట్లా చైర్ పర్సన్ పదవులు బీసీ మహిళలకే రిజర్వు అయ్యాయి. ఐదేళ్లపాటు జిల్లాలో పురపాలన మహిళానేతల చేతుల్లో కొనసాగింది. రాజకీయాలకు కొత్త వారే అయినా వారంతా పాలనలో తమ సత్తా చాటుకున్నారు. నిజామాబాద్ కార్పొరేషన్‌లో 60 డివిజన్లకు గాను బీఆర్ఎస్ 13 చోట్ల మాత్రమే గెలిచినా 16 మంది మజ్లిస్, ఒక ఇండిపెండెంట్కార్పొరేటర్, ఐదుగురు ఎక్స్ అఫీషియో మెంబర్ల బలంతో సిటీలో జెండా ఎగరేసింది.
బీఆర్ఎస్ కార్పొరేటర్దండు నీతూకిరణ్ మేయర్‌గా ఎన్నికై ఐదేళ్లు పదవిలో కొనసాగారు. బీజేపీ సొంతంగా 28 చోట్లా గెలిచి అతిపెద్ద పార్టీగా నిలిచినా మేయర్ పదవిని దక్కించుకోలేకపోయింది. బోధన్‌లోనూ బీఆర్ఎస్మజ్లిస్ మద్దతుతో గద్దెనెక్కింది. తూము పద్మ చైర్ పర్సన్‌గా ఎన్నికయ్యారు. భీంగల్ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా బీఆర్ఎస్కు చెందిన మల్లెల రాజశ్రీ మూడేండ్లు కొనసాగారు. ముందుగా చేసుకున్న ఒప్పందంలో భాగంగా మూడేండ్ల తర్వాత ఆమె రాజీనామా చేయగా అదేపార్టీకి చెందిన కన్నె ప్రేమలత పదవి దక్కించుకున్నారు.
ఆర్మూర్ మున్సిపాలిటీని కూడా బీఆర్ఎస్కైవసం చేసుకుంది. చైర్‌పర్సన్‌గా పండిత్ వినీత ఎన్నికయ్యారు. ఏడాది కిందట ఆమెపై సొంతపార్టీ కౌన్సిలర్లు అవిశ్వాసం పెట్టి దింపేయగా వన్నెల్ దేవీ లావణ్య చైర్ పర్సన్‌గా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నిజామాబాద్ మినహా మిగిలిన మూడు మున్సిపాలిటీలు హస్తం ఖాతాలో చేరాయి.
స్పెషలాఫీసర్‌గా కలెక్టర్
పాలకవర్గాల గడువు తీరడంతో ప్రత్యేకాధికారుల పాలనకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ స్పెషల్ ఆఫీసర్‌గా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు వ్యవహరించనున్నారు. కార్పొరేషన్ బాధ్యతలు ఇదివరకు కలెక్టర్‌కే అప్పగించిన నేపథ్యంలో అదే ఆనవాయితీ కొనసాగనుంది. ఇప్పటికే ఆయన జిల్లా పరిషత్ స్పెషల్ ఆఫీసర్‌గా కూడా కొనసాగుతున్నారు. బోధన్ మున్సిపాలిటీ స్పెషల్ ఆఫీసర్‌గా సబ్ కలెక్టర్ వికాస్ మహతో, భీంగల్ మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్‌గా అదనపు కలెక్టర్ అంకిత్ వ్యవహరించబోతున్నారు. ఆర్మూర్ మున్సిపాలిటీ బాధ్యతలను ఆర్డీవో రాజాగౌడ్‌కు అప్పగించనున్నారు.