కూరగాయలు వంటిమామిడిలనే కొనాలంట!

సీఎం కేసీఆర్​ సొంత జిల్లా సిద్దిపేటలోని వంటిమామిడి కూరగాయల మార్కెట్​ను డెవలప్ ​చేయనీకి సర్కారు మస్తు ఆలోచన చేసింది. రాష్ట్రంలోని అన్ని రెసిడెన్షియల్​ హాస్టళ్లకు అవసరమైన కూరగాయలను ఈ మార్కెట్లనే కొనాలని ఆన్ ​ఆఫీషియల్​గా ఆర్డరేసింది. ఆదిలాబాద్, ఖమ్మం నుంచి వంటిమామిడి మార్కెట్​కు పోవాల్నంటే 220 కిలోమీటర్లకు పైగా జర్నీ చేయాలె. ఇక వరంగల్, నల్గొండ, నిజామాబాద్, మహబూబ్​నగర్ నుంచి 150 కిలోమీటర్లు, కరీంనగర్ ​నుంచి 120 కిలోమీటర్లు, పక్కనే ఉన్న మెదక్, సంగారెడ్డి వాళ్లకు కూడా 70 కిలోమీటర్లకు పైగా దూరం అయితాంది. అంత దూరం పోతే కూరగాయల రేటు కంటే ట్రాన్స్​పోర్ట్​ ఖర్సే మస్తు అవుతదని, మా వల్ల కాదని కాంట్రాక్టర్లు ఆఫీసర్లతో చెబుతున్నరు.

జయశంకర్‌‌ భూపాలపల్లి, వెలుగుగవర్నమెంట్‌‌ రెసిడెన్షియల్‌‌ స్కూళ్లలో కూరగాయలు సప్లయ్‌‌ చేయడానికి ప్రభుత్వం టెండర్లు నిర్వహిస్తుంది. టెండర్‌‌ దక్కించుకున్న కాంట్రాక్టర్‌‌ ప్రభుత్వ మెనూ ప్రకారం కూరగాయలు సప్లయ్‌‌ చేయాలి. తనకు నచ్చిన చోట కూరగాయలు కొనే ఫ్రీడమ్​ కాంట్రాక్టర్‌‌దే. ఇలా సప్లయ్‌‌ చేసిన కూరగాయలకు స్కూల్‌‌ ప్రిన్సిపల్స్‌‌ బిల్లులు చెల్లిస్తారు. ఏడాది పాటు ప్రభుత్వం ఒకే ధర చెల్లిస్తుంది. ఇది చాలా యేళ్లుగా వస్తున్న పద్ధతి. కానీ ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం కొత్త రూల్​ తీసుకొచ్చింది. కూరగాయలు సిద్దిపేట జిల్లాలోని వంటిమామిడి మార్కెట్‌‌ నుంచే కొనాలని గవర్నమెంట్‌‌ ఆఫీసర్లు ఆదేశించారు. అన్ని జిల్లాలకు ఇలాంటి ఆదేశాలు అందాయి. ఇప్పటికే ఒకటి రెండు జిల్లాలకు చెందిన కాంట్రాక్టర్లు వంటిమామిడికి వెళ్లి కూరగాయలు కొన్నారు. కూరగాయల ధర రూ.3 వేల నుంచి రూ.4 వేల వరకు ఉంటే.. వెహికల్​ ఖర్చు రూ.6 వేల నుంచి రూ.8 వేల వరకు అవుతున్నదని కాంట్రాక్టర్లు వాపోతున్నారు. ఈ మొత్తాన్ని సర్కారు భరించాలని ప్రపోజల్​ పెడుతున్నారు. మరోవైపు ఆయా జిల్లాల్లోని లోకల్‌‌ రైతుల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత వస్తున్నది.  రెసిడెన్షియల్‌‌ స్కూల్స్‌‌ ను నమ్ముకొని ఇన్నేళ్లుగా చేసిన వ్యాపారం ఇప్పుడు లేకుండా పోతుందని  ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తెరుచుకున్న స్కూళ్లు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలతో సోమవారం తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌‌ హై స్కూళ్లు, కాలేజీలు తెరిచారు. ప్రభుత్వ ఆధీనంలో జనరల్‌‌, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ, కేజీబీవీ రెసిడెన్షియల్‌‌ స్కూళ్లు తెరిచారు. రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యికి పైగా ఈ స్కూల్స్‌‌ ఉన్నాయి. 9, 10వ తరగతులు, ఇంటర్మీడియట్‌‌తో కలిపి సుమారు 12 వేల మందికి పైగా స్టూడెంట్లు చదువుకుంటున్నారు. ఈ స్టూడెంట్లకు ఉదయం టిఫిన్‌‌, మధ్యాహ్నం, రాత్రి భోజనానికి అవసరమైన కూరగాయలు సప్లయ్‌‌ చేయడానికి ప్రతీ యేటా టెండర్లు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది కూరగాయల సప్లయ్‌‌ టెండర్లు జనవరి చివరి వారంలోనే  ముగిశాయి. అన్నిరకాల కూరగాయలు కలిపి ఒకే ధర ఇవ్వడానికి కలెక్టర్ల ఆధ్వర్యంలో టెండర్లు నిర్వహించారు. ఒక్కో రెసిడెన్షియల్‌‌కు ఒక్కో ధర చొప్పున టెండర్లు ఖరారు చేశారు. కేజీకి రూ.14.5 నుంచి రూ.18 వరకు టెండర్లు ఫైనల్​ చేశారు. ఈ విద్యా సంవత్సరంలో స్కూల్స్​మూసేవరకు ఇవే ధరలు చెల్లిస్తారు.

వంటిమామిడి వెళ్లాలని ఆదేశం

సిద్దిపేట జిల్లాలో సీఎం కేసీఆర్‌‌ ఎర్రవెల్లి ఫాం హౌజ్‌‌కు పక్కన వంటి మామిడి మార్కెట్‌‌ ఉన్నది. ఫాం హౌజ్‌‌కు కేవలం 15 కిలోమీటర్ల దూరంలో నిత్యం సీఎం వెళ్లే దారిలోనే ఇది ఉంటుంది. ఇటీవల కేసీఆర్‌‌ ఈ మార్కెట్‌‌ను సందర్శించారు. అక్కడ ఉన్న రైతులతో మాట్లాడారు. కూరగాయల మార్కెట్‌‌ హబ్‌‌గా దీనిని మారుస్తానని హామీ ఇచ్చారు. సీఎం వెళ్లి వచ్చిన తర్వాత చీఫ్‌‌ సెక్రటరీ సోమేశ్‌‌ కుమార్‌‌ జిల్లా కలెక్టర్లతో మాట్లాడి అన్ని గవర్నమెంట్‌‌ స్కూళ్లకు కూరగాయల సప్లయ్‌‌ వంటిమామిడి మార్కెట్‌‌ నుంచి జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇక్కడ తక్కువ ధరకు కూరగాయలు దొరుకుతాయని సూచించారు. దీంతో జిల్లా కలెక్టర్లు ఆయా సంక్షేమ గురుకుల స్కూల్‌‌ రీజినల్‌‌ డైరెక్టర్లకు, ప్రిన్సిపల్స్​కు ఆర్డర్‌‌ వేశారు.

ప్రతీసారి అంటే అక్కడికి పోలేం

వంటిమామిడి మార్కెట్‌‌లో కూరగాయల ధరలు తక్కువగా ఉన్నాయని, అక్కడి నుంచే కొని రెసిడెన్షియల్‌‌ స్కూల్‌‌కు సప్లయ్‌‌ చేయాలని ఆఫీసర్ల నుంచి ఆదేశాలు వచ్చాయి. తీరా అక్కడికి వెళ్లి 5 రోజులకు సరిపడా కూరగాయలు కొంటే రూ.4 వేల ఖర్చయింది. వ్యాన్‌‌ కిరాయి రూ.6 వేలు దాటింది. ప్రతీసారి అక్కడికి వెళ్లి కూరగాయలు కొనాలంటే కష్టం.

‒ రమేశ్‌‌, రెసిడెన్షియల్‌‌ స్కూల్స్‌‌ కూరగాయల కాంట్రాక్టర్‌‌, వరంగల్‌‌మా కూరగాయలు ఎవరు కొనాలె

వంటిమామిడి కూరగాయల మార్కెట్‌‌ను పెంచడానికి సీఎం ప్రయత్నించుడు బానే ఉంది. మరి మా కూరగాయలు ఎవరు కొనాలె. ఇంతకుముందు హోల్‌‌సేల్‌‌ ధరలపై కూరగాయల కాంట్రాక్టర్లు మా దగ్గర కొనుక్కుపోయేటోళ్లు. స్కూల్స్‌‌ స్టార్టయినయ్. మా కొనుగోళ్లు బాగుంటాయని అనుకున్నాం. తీరా ప్రభుత్వ చర్యలతో లోకల్‌‌ రైతులంతా నష్టపోతున్నాం.  ‒ రాజేందర్‌‌, కొత్తగట్టు సింగారం రైతు, వరంగల్​

కలెక్టర్ల నుంచి ఓరల్ ఇన్స్ట్రక్షన్స్

సిద్దిపేట జిల్లా వంటిమామిడి నుంచి కూరగాయలు కొని తీసుకురావాలని జిల్లా కలెక్టర్ల నుంచి మాకు ఓరల్ ఇన్​స్ట్రక్షన్స్​వచ్చాయి. దాని ప్రకారమే వరంగల్ ఉమ్మడి జిల్లాలోని 9 మహాత్మా జ్యోతిబాపూలే రెసిడెన్షియల్ స్కూల్ కాంట్రాక్టర్లను ఆదేశించాం. 3 రోజులకు ఒకసారి కూరగాయలు హాస్టల్ కు సరఫరా చేయాల్సి ఉంటుంది. ప్రతిసారి వంటిమామిడికి వెళ్లి రావడం అంటే రవాణా ఖర్చులు భారీగా పెరుగుతాయని కాంట్రాక్టర్లు చెబుతున్నారు. విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా. కాంట్రాక్టర్లకు ట్రాన్స్​పోర్ట్ ఖర్చులు అదనంగా ఇవ్వం. టెండర్ ప్రకారమే బిల్లులు చెల్లిస్తాం.
– మనోహర్ రెడ్డి, రీజినల్ కోఆర్డినేటర్, మహాత్మ జ్యోతిబాపూలే రెసిడెన్షియల్ స్కూల్స్, వరంగల్