ఇది రూల్ ఆఫ్ లా వైఫల్యమా?

రాజ్యం అనేది పాలకులు చెప్పినట్లు కాకుండా శాసనం చెప్పినట్టు నడవాలి. దానినే మనం న్యాయపాలన, రూల్​ ఆఫ్​ లా అంటూ ఉంటాం. ప్రజాస్వామ్యానికి ఇదే పునాది. కానీ ప్రస్తుతం బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన, మాట్లాడాల్సిన వ్యక్తులు బాధ్యత మరిచి మాట్లాడుతున్నారు. పాలకపక్షం, ప్రతిపక్ష నేతలే కాదు సినిమావాళ్లు, జర్నలిస్టులు ఇదే రకంగా మాట్లాడుతున్నారు. కానీ కంటికి కన్ను.. పంటికి పన్ను సిద్ధాంతం ఒక్క బలహీనులపైనేనా? ఆర్థిక నేరాలు చేసిన వ్యక్తులను, మాదక ద్రవ్యాల కేసులో అనుమానితులకు వర్తించదా? పాలకులు చట్టానికి లోబడి ఉండాలి. ఎవరూ చట్టాన్ని అతిక్రమించకూడదు.

ప్రజాస్వామ్యానికి పునాది న్యాయపాలన. దాన్ని మనం ఇంగ్లిష్​లో ‘రూల్ ఆఫ్ లా’ అంటున్నాం. స్వతంత్రమైన న్యాయ వ్యవస్థ, రాజకీయాలతో సంబంధం లేకుండా, వాటితో ప్రభావితం కాకుండా తీర్పులు చెప్పే న్యాయమూర్తులను కలిగి ఉండటాన్ని మనం రూల్ ఆఫ్ లా అని పిలుస్తాం. ఈ విషయాన్ని సింపుల్ గా చెప్పాలంటే రాజ్యం అనేది పాలకులు కానీ, వారి ప్రతినిధులు కానీ చెప్పినట్లు కాకుండా.. శాసనం చెప్పిన విధంగా నడిస్తే న్యాయపాలన ఉన్నట్లుగా భావించవచ్చు. ఈ రూల్ ఆఫ్ లా గురించి మన రాజ్యాంగంలో నిర్వచించలేదు కానీ.. మన న్యాయవ్యవస్థ ఈ పదబంధాన్ని తన తీర్పుల్లో తరచూ ఉపయోగిస్తోంది. ఇది మన రాజ్యాంగ మౌలిక లక్షణమని సుప్రీంకోర్టు చాలా తీర్పులో స్పష్టంచేసింది. అందుకని దీన్ని రాజ్యాంగ సవరణల ద్వారా మార్చడానికి అవకాశం లేదు. రూల్ ఆఫ్ లా ప్రకారం ప్రజలు అమల్లో ఉన్న శాసనాల ప్రకారం పాలించబడాలి. అంతే కాని పాలకులు చెప్పినట్టుగా కాదు. అధికారులు అందరినీ సమానంగా చూడాల్సి ఉంటుంది. పాలకులు కూడా చట్టానికి లోబడి ఉండాలి. అంతేగాని ఎంతటివారైనా కూడా చట్టాన్ని అతిక్రమించ కూడదు. 

కొన్ని విషయాలపైనే ఎందుకు స్పందిస్తున్నరు

ఆరేండ్ల పసిపాప మీద అత్యాచారం చేసి హత్య చేసి నిందితుడు పారిపోయాడు. నేరాన్ని ఎవరూ చూడలేదు. అతని గదిలో ఆ పాప శవం దొరకడం వల్ల అతను నేరం చేసాడని అంటున్నారు. కనీసం దర్యాప్తు కూడా పూర్తి కాలేదు. ఈ దశలో శాసనాలు తయారు చేసే వ్యక్తులు శాసనాలకు వ్యతిరేకంగా మాట్లాడతారు. వాళ్లకు శాసనాలంటే గౌరవం లేదు. శాసనాల ద్వారా ఉద్యోగాలు చేస్తున్న వ్యక్తులకు కూడా శాసనాలంటే గౌరవం ఉన్నట్టు కనిపించడం లేదు. బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన, బాధ్యతాయుతంగా మాట్లాడాల్సిన వ్యక్తులు.. బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారు. అనుమానితుడిని పోలీసులు అరెస్టు చేశారని ఒకసారి.. తనకు తప్పుడు సమాచారం వచ్చిందని ఓ మంత్రి ప్రకటిస్తారు. మరో మంత్రి మరింత బాధ్యతారహితంగా మాట్లాడతాడు. రెండు రోజుల్లో బాధితురాలికి న్యాయం జరుగుతుందని, అనుమానితుడు ఎన్ కౌంటర్ అవుతాడని మీడియా ముందు స్పష్టంగా ప్రకటిస్తారు. పాలకపక్షం, ప్రతిపక్షానికి చెందిన ఎమ్మెల్యేలు కూడా ఇదే రకంగా మాట్లాడతారు. ఎంపీలూ ఇదే రకంగా మాట్లాడతారు. ఒకరేమిటి సినిమా డైరెక్టర్లు, జర్నలిస్టులు అందరూ అనుమానితుడిని అరెస్టు చేయాలని అంటారు. ఇలా మాట్లాడుతున్న వ్యక్తులు ఎవరూ కూడా ఆర్థిక నేరాలు చేసిన వ్యక్తులను, మాదక ద్రవ్యాల కేసులో అనుమానితులను ఎన్​కౌంటర్​ చేయాలని అనరు. అలా అనాలన్నది నా ఉద్దేశం కాదు. అలా అనడం కూడా సరైంది కాదు. కొన్ని విషయాల్లోనే ఇలా ఎందుకు మాట్లాడుతారన్నదే నా ప్రశ్న. ఇలా మాట్లాడిన వ్యక్తుల మీద చట్టం ఎలాంటి చర్య తీసుకోదు. కోర్టులు మౌనముద్ర వహిస్తాయి. పోలీసులు ఏమీ మాట్లాడరు. అందువల్ల వారిని ప్రోత్సహిస్తున్నట్టుగా అనిపిస్తోంది.

పోలీసు వ్యవస్థ వైఫల్యం ఉందా?

రాజుది ఆత్మహత్య కాదు.. ఎన్​కౌంటర్ అని కొంతమంది సోషల్​ మీడియాలో ఘోషిస్తున్నారు. మంత్రుల ట్వీట్లు, మాటలు వాళ్లు అలా మాట్లాడటానికి అవకాశం ఇస్తున్నాయి. ఎలాగైనా దొరికిపోతాడని భయపడి అతడు ఆత్మహత్య చేసుకున్నాడని కొంత మంది పోలీసులు మీడియాకు చెప్పారు. ఈ రెండు కథనాల్లో ఏది నిజం ఏది అబద్ధం అన్న విషయాన్ని నేను చర్చించ దలుచుకోలేదు. కానీ నిందితుడిని సజీవంగా పట్టుకోకపోవడంలో పోలీసు వ్యవస్థ వైఫల్యం ఉందా? అన్న విషయాన్ని చర్చించదలుచుకున్నాను. ఈ విషయాన్ని చర్చించే ముందు రాజ్యం అంటే ఏమిటో తెలుసుకోవాలి. రాజ్యాంగంలోని పార్ట్ 3లో రాజ్యం అంటే ఏమిటి? అన్న విషయాన్ని చెప్పారు. ఆర్టికల్ 12లో రాజ్యం అంటే ఏమిటో చెప్పారు. రాజ్యం అంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పార్లమెంటు, శాసన వ్యవస్థలు, స్థానిక సంస్థలు వాటి అధీనంలో ఉన్న సంస్థలు, కోర్టులు, పోలీసులు మొదలైనవి.

రాజ్యం చాలా శక్తివంతమైనది

ఈ ప్రపంచంలో రాజ్యం అనేది చాలా శక్తివంతమైనది. విజయ్ మాల్యా, నీరవ్ మోడీ లాంటి వ్యక్తులు కూడా రాజ్యం ముందు దిగదుడుపే. వాళ్లు దొంగలు కావచ్చు.. ఖూనీకోర్లు కావచ్చు.. వాళ్లు ఎవరైనా ఎంత శక్తివంతులైనా.. వాళ్లు రాజ్యంతో సరితూగలేరు. రాజ్యం దగ్గర కోర్టులున్నాయి.. రాజ్యం దగ్గర పోలీసులున్నారు. గూడచారి వ్యవస్థలున్నాయి. ఫోరెన్సిక్ సంస్థలూ ఉన్నాయి. రాజ్యం మన మాటలు వింటుంది. అన్నీ చూస్తుంది. సీసీ కెమెరాలతో రికార్డ్ కూడా చేస్తుంది. రాజ్యం ఓ అనిమిష. ఎప్పుడూ కన్ను మూయదు. ఎప్పుడూ కన్ను తెరిచి అందర్నీ పర్యవేక్షిస్తుంది. అంతటి శక్తివంతమైన రాజ్యం.. అనుమానితుడు రాజును సజీవంగా పట్టుకోలేకపోయింది. సంఘటన జరిగింది సెప్టెంబర్ 9న. హైదరాబాద్  సైదాబాద్ కాలనీలో. పత్రికల్లోని వార్తల ప్రకారం రాజు చనిపోయింది.. అదే ఆత్మహత్య చేసుకుంది 16వ తేదీన వరంగల్ దగ్గరలోని స్టేషన్ ఘన్ పూర్  వద్ద. 14వ తేదీన రాజు ఆచూకీ తెలిపిన వారికి పది లక్షల రూపాయల రివార్డు ఇస్తామని పోలీసులు ప్రకటించారు. అలా ప్రకటించిన రెండు రోజులకు రాజు ఆత్మహత్య చేసుకున్నాడు. అంటే దాదాపు వారం తర్వాత పోలీసులకు రాజు ఆచూకీ దొరికింది. అది అతను చనిపోయిన తర్వాత. అతని ఆత్మహత్యను చూసిన రైల్వే సిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరించి రాజు చనిపోయిన సంగతిని పోలీసులకు తెలియజేశారు. పోలీసులు కూడా అంతే బాధ్యతాయుతంగా వ్యవహరించి మీడియాకు తెలియజేసారు. 

కొత్త టెక్నిక్​లు మొదలయ్యాయా?

పోలీసులు చెప్పినట్టు రాజుది ఆత్మహత్య అయితే వారం రోజుల దాకా ఇంత బలమైన రాజ్యం అతడిని పట్టుకోలేకపోవడం, ఆచూకీ తెలుసుకోలేకపోవడం రాజ్యం వైఫల్యం కాదా? ఒకవేళ కొంతమంది ఆరోపిస్తున్నట్లు లేదా భావిస్తున్నట్టు అది పోలీసులే రైల్వే కౌంటర్ చేసినట్లయితే అది రూల్ ఆఫ్ లాకు విరుద్ధం కాదా? ఎన్​కౌంటర్ కు బదులుగా మన రాష్ట్రంలో కూడా కొత్త టెక్నిక్ లు మొదలయ్యాయి. ఈ రైల్వే కౌంటర్లతో ఇవి ఆగిపోతాయా? కంటికి కన్ను.. పంటికి పన్ను సిద్ధాంతం ఒక్క బలహీనులపైనేనా? ఇంకా కొత్త కొత్త కౌంటర్లు మనకు దర్శనం ఇస్తాయా? ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెబుతుంది.

- మంగారి రాజేందర్,
రిటైర్డ్​ జిల్లా జడ్జి, జ్యుడీషియల్‌  అకాడమీ మాజీ డైరెక్టర్‌‌