భద్రాచలం, వెలుగు: సీతమ్మసాగర్ బ్యారేజీ నిర్మాణం వల్ల బ్యాక్‌వాటర్‌తో ముంపును తగ్గించేందుకు ప్రభుత్వం చేపట్టిన కరకట్టల నిర్మాణాల్లో నిబంధనలు పాటించడం లేదనే ఆరోపణలున్నాయి. అనుమతులు లేకుండానే మన్యంలో మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. ఏజెన్సీ చట్టాలకు తిలోదకాలు ఇస్తున్నా రెవెన్యూ, మైనింగ్ ఆఫీసర్లు పట్టించుకోవడం లేదు. రూ.5500 కోట్లతో సీతమ్మసాగర్ బ్యారేజీని దుమ్ముగూడెం-, అశ్వాపురం మధ్య గోదావరిపై నిర్మిస్తున్నారు. బ్యారేజీకి కుడి వైపు 49 కిలోమీటర్లు, ఎడమ వైపు 57 కి.మీలు కరకట్టలు నిర్మిస్తున్నారు. కరకట్టలకు అవసరమైన మట్టిని అప్రూవల్ క్వారీ నుంచి తీసుకురావాలి. కానీ మన్యంలోనే ఈ మట్టి దొరుకుతుండడంతో నిబంధనలు పాటించకుండా పని కానిచ్చేస్తున్నారు.
అనుమతుల్లేకుండానే..
గోదావరికి ఇరువైపులా నిర్మిస్తున్న కరకట్టలకు స్థానికంగా దొరికే మట్టినే వినియోగిస్తున్నారు. ఈ మట్టి తవ్వకాలకు ఎలాంటి అనుమతులు తీసుకోవడం లేదు. సాధారణంగా మన్యంలో మట్టి, గ్రావెల్, మెటల్, ఇసుక వంటి ఖనిజాలు తవ్వుకోవాలంటే మైనింగ్ శాఖ నుంచి అనుమతి తీసుకోవాలి. పట్టా భూముల్లో తీయాలన్నా అనుమతి తప్పనిసరి. అయితే స్థానికంగా ఉండే రెవెన్యూ ఆఫీసర్ల నుంచి ఎన్వోసీలు తీసుకుని మట్టి తవ్వకాలు జరుపుతున్నారు. ఇది పీసా చట్టానికి పూర్తి విరుద్ధం. అలాగే ఐదు హెక్టార్లు దాటితే పర్యావరణ అనుమతులు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ పక్కన పెట్టి చెరువులు, గుట్టలు, ప్రైవేటు ల్యాండ్స్ లలో మట్టి తవ్వుతున్నారు.
నాణ్యతపైనా అనుమానాలు..
కరకట్టల నిర్మాణంలో నాణ్యతపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంజనీర్లు సూచించిన విధంగా నల్ల, ఎర్రమట్టి కలిపి కట్ట నిర్మాణం చేపట్టాలి. కొన్ని పొరలు నల్లమట్టి పోసి నీటితో క్యూరింగ్ చేసుకుంటూ, మిగిలిన పొరలు ఎర్రమట్టితో చేపట్టాలి. ఇలా చేయడం వల్ల కట్ట పటిష్టంగా ఉంటుంది. దుమ్ముగూడెం, చర్ల మండలాల వైపు కరకట్టల నిర్మాణం ఇప్పుడు కొనసాగుతోంది. గోదావరి బ్యాక్ వాటర్ వాగుల ద్వారా ఊళ్లు, పొలాలను ముంచెత్తే అవకాశం ఉండడంతో, వాగుల వెంబడి కూడా కరకట్టలు నిర్మిస్తున్నారు. అయితే నలుపు, ఎర్ర రంగు మట్టి కలిపి నిర్మిస్తున్న దాఖలాలు కన్పించడం లేదు. నాసిరకంగా నిర్మిస్తే కట్టలు తెగే ప్రమాదం ఉందని అంటున్నారు.
చట్టాలు అమలు కావట్లే..
మట్టి, గ్రావెల్ తవ్వకాల విషయంలో ఏజన్సీలో గిరిజన చట్టాలను అమలు చేయడం లేదు. కరకట్టలకు చెరువులు, గుట్టల నుంచి మట్టి తవ్వి తీసుకొస్తు న్నారు. గ్రామసభ పెట్టి వారి అనుమతి తీసుకున్నాకే తవ్వకాలు చేపట్టాలి.
- కె రమేశ్ బాబు, రేలా ఫౌండేషన్
ఎలాంటి అనుమతులివ్వలే..
కరకట్టలకు మట్టి, గ్రావెల్ రైతుల పొలాల్లో నుంచి తీసుకుంటున్నారు. 3 ఫీట్ల లోపు తవ్వుకుంటే ఎన్వోసీలు అవసరం లేదు. మట్టి తవ్వకాలకు ఎటువంటి అనుమతులు ఇవ్వలేదు. మట్టి తవ్వకాలను పరిశీలిస్తాం.
చంద్రశేఖర్, తహసీల్దార్, దుమ్ముగూడెం