Vinesh Phogat: పతకం ఇవ్వడం కుదరదు.. రూల్స్ ఎవరికైనా రూల్సే: UWW చీఫ్

Vinesh Phogat: పతకం ఇవ్వడం కుదరదు.. రూల్స్ ఎవరికైనా రూల్సే: UWW చీఫ్

పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫోగాట్‌పై అనర్హత వేటు పడిన విషయం తెలిసిందే. ఫోగాట్‌ 50 కిలోల ప్రీ స్టైల్ విభాగంలో పోటీ పడగా.. ఆమె ఉండాల్సిన బరువు కంటే 100 గ్రాముల అధిక బరువు ఉందన్న కారణంగా అనర్హత వేటు వేశారు. ఈ అంశంపై యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ (యుడబ్ల్యుడబ్ల్యు) చీఫ్ నెనాద్ లాలోవిచ్ స్పందించారు. 

ఫోగాట్‌పై అనర్హత వేటు పడటం దురదృష్టకరమన్న యుడబ్ల్యుడబ్ల్యు చీఫ్.. ఆమెకు జరిగిన దాని పట్ల విచారం వ్యక్తం చేశాడు. అయితే, ఈ విషయంలో తాను న్యాయం చేయలేనని చెప్పాడు. నియమాలు అందరికీ ఒకేలా ఉంటాయని, భారత రెజ్లర్‌కు రజత పతకాన్ని అందించడం అసాధ్యమని తెలిపాడు. అంతేకాదు, ఆమె లేకుండానే పోటీ కొనసాగుతుందని కూడా అన్నారు.

"మేము నిబంధనలను గౌరవించాలి. ఆమెకు జరిగిన దాని పట్ల నాకు చాలా బాధగా ఉంది. కానీ నియమ నిబంధనలు ప్రతిదీ పబ్లిక్. అథ్లెట్లందరూ అక్కడ ఉన్నారు. బరువు పెరిగిన వ్యక్తిని ఎవరితోనైనా పోటీ చేయడానికి అనుమతించడం అసాధ్యం. ఆమె లేకుండానే పోటీ కొనసాగుతుంది. అథ్లెట్లు వారి సహజ బరువుతో పోటీపడాలని మేము కోరుకుంటున్నాము. అదే మా ఆలోచన.  ఒకవేళ ఈ 100 గ్రాములను అనుమతిస్తే, 200 గ్రాములకు అనుమతించాలి. దీనికి అంతం ఉండదు.." అని నెనాద్ లాలోవిక్ అన్నారు.

మరోవైపు, అమెరికాకు చెందిన సారా హిల్డెబ్రాండ్‌తో జరిగే ఫైనల్ మ్యాచ్‌లో తలపడేందుకు క్యూబా రెజ్లర్ యుస్నీలిస్ గుజ్మాన్ లోపెజ్‌కు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఆటోమేటిక్ క్వాలిఫికేషన్ ఇచ్చింది.