ఘాట్ రోడ్డులో రూల్స్ బ్రేక్

ఘాట్ రోడ్డులో రూల్స్ బ్రేక్
  • కొండగట్టులో  పరిమితికి మించి ప్యాసింజర్లతో ఆటోలు, ట్యాక్సీలు ప్రయాణం
  • నవంబర్ లో 12 మందితో వెళుతున్న ఆటో బోల్తా.. ప్రయాణికులకు గాయాలు
  • బస్సు యాక్సిడెంట్ జరిగిన చోటే ప్రమాదం.. సైడ్ వాల్ ఢీకొని బోల్తా పడ్డ ఆటో
  • 2018లో  ఆర్టీసీ బస్సు యాక్సిడెంట్ లో 65 మంది మృతి 
  • 2022 లో లైట్ వెహికల్స్ కు షరతులతో కూడిన  అనుమతి ఇచ్చిన కమిటీ

జగిత్యాల, వెలుగు : కొండగట్టులో ఘాట్ రోడ్డులో ఆటోలు, ట్యాక్సీలు పరిమితికి మించి ప్రయాణికులను తీసుకెళుతుండటంతో మళ్లీ  ప్రమాదాలు జరుగుతున్నాయి.  2018లో కొండగట్టు ఘాట్ రోడ్డు పై బస్సు యాక్సిడెంట్ లో 65 మంది చనిపోగా..  పదుల సంఖ్య లో క్షతగాత్రులయ్యారు.  దీంతో అప్పటి సర్కార్ ఘాట్ రోడ్డు పై రాకపోకలను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేస్తూ కమిటీ వేసింది.  భారీ వెహికిల్స్, బస్సులు, ఇతర ట్రావెల్స్ వెహికిల్స్ కోసం దొంగలమర్రి క్రాసింగ్ నుంచి నాచుపెల్లి జేఎన్టీయూ మీదుగా గుట్ట పైకి వెళ్లే రోడ్డును వినియోగంలోకి తీసుకువచ్చారు.

ఈ కమిటీ కేవలం లైట్ మోటార్ వెహికిల్స్ మాత్రమే ఘాట్ రోడ్డు నుంచి  అనుమతించాలని ఆదేశాలిస్తూ జీవో జారీ చేశారు.  యాక్సిడెంట్‌‌‌‌‌‌‌‌కు గురయ్యే మలుపుల్లో  రెయిలింగ్, ప్రహరీలు నిర్మించి 2022 లో  ఘాట్ రోడ్డును తిరిగి ప్రారంభించారు.  ఘాట్ రోడ్డు మరమ్మతులతో పాటు కొత్తగా రోడ్డు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలు పెండింగ్ లోనే ఉన్నాయి.   కమిటీ చేసిన రూల్స్ ను ఆటోలు, ట్యాక్సీలు బ్రేక్ చేయడం తో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటుండంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు. 

కమిటీ సూచనలు గాలికి..

బస్సు యాక్సిడెంట్ ఘటన నేపథ్యంలో అధికారులు ఘాట్ రోడ్డును మూసి వేసినప్పటికీ,  కొందరి ఒత్తిళ్ల  మేరకు 2022 న జూన్ నెలలో కొన్ని నిబంధనలు విధిస్తూ ఘాట్ రోడ్డును తిరిగి ప్రారంభించారు.  కేవలం కారు, జీప్, టూ వీలర్ మాత్రమే అనుమతి ఉండగా, ట్రాలీ ఆటో, ట్రాక్టర్, ఇతర భారీ వాహనాలను నిషేధించారు.  వెహికిల్స్ 20  కిలో మీటర్ల స్పీడ్ మించకూడదని,  న్యూట్రల్ గేర్ లో వెహికిల్స్ నడపకూడదని ఆదేశాలు ఉన్నాయి.  

ఈ నిబంధనలన్నీ క్షేత్ర స్థాయిలో అమలుకు కావడం  లేదు.  దీంతో వాహనాలు ఇష్టం వచ్చినట్లుగా ఓవర్ లోడ్ తో ప్రయాణించడంతో తరచూ యాక్సిడెంట్స్ అవుతున్నాయి.  ఇప్పటికైనా ఆఫీసర్లు స్పందించి ఓవర్ లోడ్ తో వెళ్లే వాహనాలను అరికట్టి భారీ వాహనాలు గుట్టపైకి వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని  కోరుతున్నారు.