
ప్రజా ప్రాతినిధ్యం చట్టం(1951) ప్రకారం సెక్షన్ 29ఏ ప్రకారం రాజకీయ పార్టీలు ఎన్నికల సంఘం వద్ద నమోదు చేయించుకోవాలి. లోక్‌సభ, రాష్ట్ర శాసనసభకు సాధారణ ఎన్నికలు జరిగిన తర్వాత పార్టీలు తమ పూర్వ హోదాను కలిగి ఉండటం లేదా కోల్పోతాయి. దేశంలో అధ్యయన సౌలభ్యం కోసం రాజకీయ పార్టీలను మూడు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి.. జాతీయ పార్టీలు, ప్రాంతీయ/ రాష్ట్రీయ పార్టీలు, నమోదై గుర్తింపు పొందని పార్టీలు.
జాతీయ పార్టీగా గుర్తించాలంటే
1. చివరి సాధారణ ఎన్నికల్లో లోక్‌సభ స్థానాలకు గానీ రాష్ట్ర అసెంబ్లీ స్థానాలకు గానీ 4 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో అభ్యర్థులు నిలబడి, పోలై చెల్లిన ఓట్లలో 6శాతం కంటే తక్కువ కాకుండా ఓట్లను సాధించి, కనీసం నలుగురు అభ్యర్థులు లోక్‌సభకు ఎన్నికై ఉండాలి.
లేదా
2. చివరి సాధారణ ఎన్నికల్లో లోక్‌సభలోని మొత్తం సీట్లలో కనీసం 2 శాతం సీట్లను అంటే 543 సీట్లలో 11 సీట్లు గెలుచుకొని ఉండాలి. వీరు కనీసం మూడు రాష్ట్రాల నుంచి ఎన్నికై ఉండాలి.
లేదా
3. కనీసం నాలుగు రాష్ట్రాల్లో రాష్ట్ర పార్టీగా గుర్తింపు పొంది ఉండాలి.
కొత్త నిబంధనలు
- ఒక సార్వత్రిక ఎన్నిక కాకుండా వరుసగా రెండు ఎన్నికల్లో కూడా హోదాకు నిర్దేశించిన ఓట్లు, సీట్లు సాధించలేకపోతే జాతీయ హోదా రద్దు చేస్తారు. ఈ నిబంధనలను 2014, జనవరి 1 నుంచి అమలులోకి వచ్చాయి. కొత్త నిబంధనల ప్రకారం 2014 లోక్‌సభ ఎన్నికలకు ముందు జాతీయ హోదా కలిగి ఉన్న ఎన్సీపీ, బీఎస్పీ, సీపీఐలకు ఆ హోదా కొనసాగించారు.
రాష్ట్రస్థాయి పార్టీగా గుర్తించాలంటే
1. రాష్ట్ర శాసనసభకు జరిగిన చివరి ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థులకు రాష్ట్రంలో పోలై చెల్లిన మొత్తం ఓట్లలో కనీసం 6 శాతం ఓట్లు రావాలి. దాంతోపాటు కనీసం ఇద్దరు అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా గెలవాలి
లేదా
2. చివరి శాసనసభ ఎన్నికల్లో రాష్ట్ర శాసనసభ మొత్తం సీట్లలో కనీసం 3 శాతం సీట్లను గెలుపొంది ఉండాలి. కనీసం 3 సీట్లను గెలుపొంది ఉండాలి. వీటిలో ఏది ఎక్కువైతే దానిని పరిగణనలోకి తీసుకుంటారు.
లేదా
3. లోక్‌సభకు జరిగిన చివరి సాధారణ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థులకు రాష్ట్రంలో పోలై చెల్లిన మొత్తం ఓట్లలో కనీసం 6శాతం ఓట్లు రావాలి. దాంతోపాటు కనీసం ఒక అభ్యర్థి లోక్‌సభ సభ్యునిగా ఎన్నిక కావాలి.
లేదా
4. చివరి లోక్‌సభ ఎన్నికల్లో సాధారణ రాష్ట్రానికి కేటాయించిన మొత్తం లోక్‌సభ సీట్లలో ప్రతి 25 సీట్లకు కనీసం ఒక అభ్యర్థి చొప్పున లోక్‌సభకు ఎన్నికై ఉండాలి.
లేదా
5. లోక్‌సభకు గాని రాష్ట్ర శాసనసభకు గాని జరిగిన గత చివరి ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి నిలబడిన అభ్యర్థులకు రాష్ట్రంలో పోలై చెల్లిన ఓట్లలో కనీసం 8శాతం ఓట్లు వచ్చి ఉండాలి.
నమోదై గుర్తింపు పొందని పార్టీలు
జాతీయ పార్టీలు గానీ ప్రాంతీయ పార్టీలు గానీ గుర్తింపు పొందకుండా కేవలం ఎన్నికల కమిషన్ వద్ద నమోదు అయిన పార్టీలు.
పార్టీల సంఖ్య
భారతదేశంలో 1885లో ఏఓ హ్యూమ్ నేతృత్వంలో ఏర్పాటైన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (ఐఎన్‌సీ) మొదటి పార్టీగా అవతరించింది. ఆ తర్వాత 1906లో ముస్లింలీగ్, 1913లో గదర్ పార్టీ, 1920లో శిరోమణి అకాళీదల్, 1925లో కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా, 1932లో నేషనల్ కాన్ఫరెన్స్, 1933లో అఖిల భారత హిందూ మహాసభ తదితర పార్టీల ఏర్పాటు స్వాతంత్ర్యానికి పూర్వం జరిగింది. స్వాతంత్ర్యం తర్వాత అనేక రాజకీయ పార్టీలను పరిస్థితులను అనుసరించి ఏర్పాటు చేశారు. 2019 సాధారణ ఎన్నికల సమయంలో ఎన్నికల సంఘం వద్ద నమోదైన మొత్తం రిజిస్టర్ పార్టీలు 2698 కాగా వాటిలో 7 జాతీయ పార్టీలు, 52 రాష్ట్రీయ పార్టీలు, 2638 గుర్తింపు పొందని పార్టీలు ఉన్నాయి. 2024, మార్చి 23 నాటికి దేశంలో మొత్తం 6 జాతీయ పార్టీలు, 58 ప్రాంతీయ లేదా రాష్ట్రీయ పార్టీలు, 2763 గుర్తింపు పొందని పార్టీలు ఉన్నాయి.
జాతీయ పార్టీలు
ఆమ్ ఆద్మీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ, భారతీయ జనతా పార్టీ, సీపీఐ(ఎం), ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, నేషనల్ పీపుల్స్ పార్టీ.