కొంతమంది న్యాయమూర్తులు పదవిలో ఉండగానే మాట్లాడతారు. మరికొంతమంది న్యాయమూర్తులు పదవీ విరమణ చేసిన తరువాత మాట్లాడతారు. ఈ విషయం గురించి రాజ్యాంగంలో ఏమీ చెప్పలేదు. రాజ్యాంగం హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు చాలా రక్షణలను కల్పించింది. ఈ రక్షణలు శాశ్వత న్యాయమూర్తులకు ఎక్కువగా ఉన్నాయి. హైకోర్టుల్లో రెండు రకాల న్యాయమూర్తుల నియామకం జరుగుతుంది.
శాశ్వత న్యాయమూర్తులు, అదనపు న్యాయమూర్తులు. ఈ అదనపు న్యాయమూర్తులకు ఓ నిర్ణీత కాలం తర్వాత వారి ప్రవర్తనను, వాళ్ల తీర్పులను చూసి వారిని శాశ్వత న్యాయమూర్తులుగా నియమిస్తారు. వీళ్ల తీర్పులో ఏవైనా పొరపాట్లు జరిగితే వాళ్లని అదేవిధంగా మరి కొంతకాలం కొనసాగించవచ్చు. లేదా ఆ పదవి నుంచి తొలగించవచ్చు.
ఆ విధంగా పదవి కోల్పోయిన న్యాయమూర్తి పుష్ప వి గనేడివాలా. సతీశ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర కేసులో ఆమె ముద్దాయిని పోక్సో చట్టంలోని 7 రెడ్ విత్ 8 ప్రకారం శిక్షించకుండా, భారతీయ శిక్షాస్మృతిలోని సె.359 ప్రకారం శిక్షను విధించింది. శరీరంతో శరీరం తాకలేదన్న కారణాన్ని ఆమె తన తీర్పులో పేర్కొంది. ఆ తీర్పు మీద దేశవ్యాప్తంగా మేధావులు గగ్గోలు చేశారు. చివరికి సుప్రీంకోర్టు ఆమెను శాశ్వత న్యాయమూర్తిగా నియమించడానికి నిరాకరించింది. ఫలితంగా ఆమె రాజీనామా చేయాల్సి వచ్చింది.
శాశ్వత న్యాయమూర్తులు ఇంతకన్నా ఘోర తప్పిదమైన తీర్పును ప్రకటించినా సుప్రీంకోర్టు ఏమీ చేయలేదు. ఎక్కువలో ఎక్కువ ఒక హైకోర్టు నుంచి మరో హైకోర్టుకు బదిలీ చేస్తుంది. పార్లమెంటు సభ్యులు ఈ తప్పిదాన్ని సీరియస్‌గా తీసుకుంటే అభిశంసన తీర్మానాన్ని పార్లమెంటులో ప్రవేశపెట్టవచ్చు. అది మన దేశంలో కష్టసాధ్యమైన పని. న్యాయమూర్తులు ఇంటర్వ్యూలని ఇవ్వవచ్చా?. రాజ్యాంగ వ్యతిరేకంగా, వివాదాస్పదంగా మాట్లాడవచ్చా అన్నది ప్రధాన ప్రశ్న. రాజ్యాంగం ఈ విషయం గురించి ఏమీ చెప్పలేదు. కానీ వాళ్లు తమకి తాము న్యాయ ప్రవర్తన ప్రమాణాలను ఏర్పరుచుకున్నారు.
న్యాయవ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని పెంపొందించాలి
బెంగళూరు న్యాయ ప్రవర్తనా నియమావళిలో ఈ విధంగా చెప్పారు. ‘న్యాయవ్యవస్థపై అదేవిధంగా న్యాయవ్యవస్థ సమగ్రతపై ప్రజలకు విశ్వాసం ఉండేవిధంగా ఉండటమనేది ఈ ఆధునిక ప్రజాస్వామ్యంలో అత్యంత ముఖ్యమైనది. న్యాయమూర్తులు వ్యక్తిగతంగా, సమష్టిగా న్యాయవ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని పెంపొందించడానికి, అదేవిధంగా కొనసాగించడానికి కృషి చేయాలి. ఈ విలువల పత్రంలో ఆరు నైతిక సూత్రాలు నిర్దేశించబడ్డాయి. అందులో ముఖ్యమైనవి. మొదటిది.. న్యాయపాలన అనేది నిష్పాక్షిక విచారణకి ప్రాథమిక హామీ లాంటిది. అందుకోసం న్యాయ స్వాతంత్రాన్ని దాన్ని వ్యక్తిగత స్థాయిలో సంస్థాగతంగా సమర్థించాలి.
రెండవది.. న్యాయమూర్తి నడవడిక అనేది నిందలు రాకుండా ఉండేవిధంగా ఉండాలి. అతని ప్రవర్తన ద్వారా న్యాయవ్యవస్థ సమగ్రతపై ప్రజల విశ్వాసాన్ని పునరుద్ఘాటించాలి. న్యాయం జరగడం మాత్రమే కాదు జరిగినట్లు అనిపించాలి. మూడవది.. న్యాయమూర్తి ఇతర పౌరుల మాదిరిగా భావ ప్రకటన, సంఘం, సమావేశ స్వేచ్ఛ కలిగి ఉండడు. అయనే తన ఆఫీసు గౌరవానికి భంగం కలిగేవిధంగా ఉండకూడదు. న్యాయవ్యవస్థ నిష్పాక్షికత స్వతంత్రత కాపాడే విధంగా ఉండాలి. ఈ సూత్రాలకి అనుగుణంగా న్యాయమూర్తుల ప్రవర్తన ఉండాలి.
అయోధ్యపై సమష్టి తీర్పు
దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న వివాదానికి తుది తీర్పును వాళ్లు వెలువరించారు. ప్రతి ఉత్తర్వు న్యాయమూర్తికి వాళ్ల న్యాయపరమైన చతురతకు సంబంధించిన వేడుకే. అయోధ్య తీర్పు కొందరికి రాజకీయంగా ప్రాముఖ్యం ఉండవచ్చు. కానీ, న్యాయమూర్తులకు కాదు కదా?. దాన్ని మరో తీర్పుగానే భావించాలి. మరో ముఖ్యమైన విషయం.. అయోధ్య తీర్పును ఐదుగురు న్యాయమూర్తుల బెంచి ప్రకటించినప్పటికీ అది ఎవరు రాశారన్నది తెలియదు. అందరూ సమష్టిగా రాశారని అంటున్నారు. బహుశా అలాంటి తీర్పు మొదటిది ఇదేనేమో?. బెంగళూరు న్యాయ నియమావళిని అప్పుడపుడు న్యాయమూర్తులు చదవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాన్ని పాటించాల్సిన అవసరం ఎప్పుడూ ఉంది. మనకు రాజ్యాంగం ఉంది. మనది సెక్యులర్ దేశం. ఈ విషయాన్ని ఎవరూ విస్మరించరాదు.
న్యాయ ప్రవర్తనా ప్రమాణాలు
మే 7, 1997 రోజున సుప్రీంకోర్టు పూర్తి న్యాయమూర్తులతో కూడిన సమావేశంలో ‘న్యాయ జీవితపు విలువల పున:స్థాపన’ అనేదాన్ని ఆమోదించారు. 1999లో జరిగిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల సదస్సులో దాన్ని ఆమోదించారు. ఆ తరువాత దేశంలోని అన్ని హైకోర్టులు కూడా తమతమ ఫుల్ కోర్టుల్లో దీన్ని ఆమోదించాయి. ఈ పున:స్థాపన పత్రం ఈ వాక్యంతో ముగుస్తుంది. ‘ఇవి న్యాయ జీవిత విలువల పునరుద్ధరణ’ మాత్రమే. అంతేకానీ న్యాయమూర్తి నుంచి ఏమి ఆశిస్తున్నామో వాటిని సమగ్రంగా ఉద్దేశించినవి కావు.
ఈ పున:స్థాపన పత్రం కాలపరిమితి దాటిపోయిందని భావించి న్యాయవ్యవస్థను బలోపేతం చేయడం కోసం ప్రధాన న్యాయమూర్తుల సమావేశంలో ‘బెంగళూరు న్యాయప్రవర్తన సూత్రాలు 2002’ని ఆమోదించినారు. ఇది 11 పేజీల వివరణాత్మక పత్రం. ఇది ఆరు విలువలను అందిస్తుంది. ‘పున:స్థాపన’ అనేది మూడుపేజీల పత్రం. ఇందులో న్యాయ జీవితానికి సంబంధించిన 16 ‘విలువలను’ చెబుతుంది. అందులోని 9వ అంశంలో ఇలా ఉంటుంది. ‘న్యాయమూర్తి తన తీర్పు ద్వారా మాత్రమే సంభాషిస్తాడు తప్ప ఇంటర్వ్యూల ద్వారా సంభాషించడు’. కానీ, చాలామంది న్యాయమూర్తులు ఇంటర్వ్యూలు ఇస్తూనే ఉన్నారు.
ప్రజల విశ్వాసమే న్యాయ వ్యవస్థ బలం
మన రాజ్యాంగం సెక్యులర్ రాజ్యాంగం. అందుకని న్యాయమూర్తులు గుడులు, గోపురాలకి వెళ్లినపుడు అవి ప్రైవేట్ సందర్శనగా ఉండాలి. వాటికి ప్రచారం కలిగేవిధంగా ప్రవర్తించకూడదు. ఇపుడు ఏ న్యాయమూర్తి తిరుమలకి వెళ్లినా వారి చిత్రం తెల్లవారితే పత్రికల్లో దర్శనం ఇస్తుంది. ఆ న్యాయమూర్తి విశ్వాస సమస్యల మీద తీర్పుని ప్రకటించాల్సి వచ్చినపుడు, ఆ న్యాయమూర్తి విశ్వాసాలు న్యాయవ్యవస్థకి భంగం కలిగించే పరిస్థితి ఏర్పడుతుంది. అంజనా ప్రకాశ్ అనే ఆవిడ సుప్రీంకోర్టు న్యాయవాది. గతంలో ఆమె బిహార్ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసి పదవీ విరమణ చేశారు.
ఆమె ఇటీవల ఒక వ్యాసంలో ఇలా అభిప్రాయపడ్డారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అప్పటి ప్రధాన న్యాయమూర్తి రంజన్‌గొగోయ్, అశోక్‌భూషణ్, శరద్ అరవింద్ బాబ్డె, ధనంజయ్ చంద్రచూడ్, అబ్దుల్ నజీర్‌లు అయోధ్య తీర్పుని వెలువరించారు. ఆ తర్వాత దాన్ని ఒక సంబరాల మాదిరిగా జరుపుకున్నారు. అందరూ విజయం సాధించినట్టు ఫొటో దిగినారు. ఆ చిత్రం ఈ మధ్య ఎక్కువగా కన్పిస్తుంది. సంబరాలు చేసుకోవడానికి ఏముంది అందులో? అది వాళ్ల వ్యక్తిగత విజయం కాదు కదా! ఆ విషయానికి వస్తే ప్రతి తీర్పు న్యాయమూర్తికి విజయంలాంటిదే.
- మంగారి రాజేందర్,
జిల్లా జడ్జి (రిటైర్డ్)