- గత ప్రభుత్వ నిర్లక్ష్యం ఉద్యోగులకు శాపం
- ఆర్ అండ్‌బీ అధికారులు, ఉద్యోగ సంఘాలతో సమావేశం
హైదరాబాద్, వెలుగు: ఆర్అండ్బీ శాఖలో గత పదేండ్లుగా పెండింగ్ లో ఉన్న ఉద్యోగులు, అధికారుల సర్వీస్ రూల్స్ సమస్యను పరిష్కరిస్తామని ఆ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఈ అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లి, ఏపీ ప్రభుత్వం తో మాట్లాడుతామని తెలిపారు. శుక్రవారం ఎర్రమంజిల్ లోని ఆర్ అండ్‌బీ ఆఫీస్ లో అధికారులు, ఉద్యోగ సంఘాలతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యం ఉద్యోగుల పాలిట శాపంగా మారిందని మండిపడ్డారు. గత ప్రభుత్వం లో నచ్చిన వారికి నజరానాలు అన్నట్టు వారికి అనుకూలంగా ఉన్నవారికే ప్రమోషన్లు, ట్రాన్స్ ఫర్లు చేసి, ఉద్యోగుల మధ్య ఐక్యతకు విఘాతం కలిగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుటుంబంలా కలిసి పనిచేయాల్సిన డిపార్ట్ మెంట్ లో రిక్రూట్ మెంట్ కు ఒక యూనియన్ ఏర్పడేలా చేయడం బాధాకరమని పేర్కొన్నారు.
జోనల్ సమస్యలు, సీనియారిటీ ఇబ్బందులు, సర్వీస్ రూల్స్ అమెండ్ మెంట్ వంటి అంశాలపై ఒక క్లారిటీ తీసుకువచ్చి ప్రమోషన్స్, ట్రాన్స్ ఫర్ల పై ఒక నిర్ణయం తీసుకుందామని చెప్పారు.
కష్టపడి పనిచేయండి
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఆసుపత్రి భవనాలు, కలెక్టరేట్లు, ఎమ్మెల్యేలు, మంత్రుల నివాస భవనాలతోపాటు తెలంగాణను ప్రపంచ పటంలో నిలబెట్టే ఆర్ఆర్ఆర్ (రీజినల్ రింగ్ రోడ్డు) నిర్మాణం చేపడుతున్నదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. ఆర్అండ్ బీ అధికారులందరూ రోజుకో గంట ఎక్కువ కష్టపడి పనిచేస్తే ప్రజల మన్ననలు పొందవచ్చని సూచించారు.
ఇప్పటికే నాలుగైదు మండలాలకో ఏఈ ఉన్నారని, రిక్రూట్ మెంట్ పెంచితే క్షేత్రస్థాయిలో పనుల్లో నాణ్యత పెరుగుతుందని అన్నారు. ఇప్పటికే కొనసాగుతున్న 196 మంది ఏఈఈ/ఏఈల నియామక ప్రక్రియ కొద్దిరోజుల్లో పూర్తవుతుందని, మిగితా ఖాళీలను గుర్తించి టీజీపీఎస్సీకి పంపేవిధంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.