
- రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఫలితాల్లో రూలింగ్ పార్టీలదే హవా
- అరుణాచల్‌లో 60 సీట్లకు 46 గెలిచి.. మూడోసారి పవర్లోకి కమలం
- ఇందులో 10 సీట్లు ఏకగ్రీవం
- ఎన్పీపీకి 5, ఎన్‌సీపీకి 3, పీపీఏకు 2, కాంగ్రెస్‌కు 1, స్వతంత్రులకు 3
- సిక్కింలో 32 సీట్లకు 31 చోట్ల ఎస్కేఎం జయకేతనం
- ఒక్క సీటుకే పరిమితమైన సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్
- పోటీచేసిన రెండు చోట్లా ఓడిన మాజీ సీఎం పీకే చామ్లింగ్
ఇటానగర్/గాంగ్ టక్: అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల్లో రూలింగ్ పార్టీలే ఘన విజయం సాధించాయి. ఆదివారం రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్లను లెక్కించి, ఫలితాలను ఎన్నికల సంఘం ప్రకటించింది. అరుణాచల్ లో మరోసారి బీజేపీ అధికారం చేజిక్కుంచుకున్నది. 60 అసెంబ్లీ స్థానాలకుగాను 46 సీట్లు దక్కించుకుని విజయకేతనం ఎగురవేసింది. దీంతో రాష్ట్రంలో మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నది. రాష్ట్రంలోని 60 స్థానాలకుగాను 10 అసెంబ్లీ స్థానాలు ఇప్పటికే కమలం పార్టీకి ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 50 స్థానాలకు ఏప్రిల్19న పోలింగ్ జరిగింది. ఆదివారం ఓట్లను లెక్కించారు.
బీజేపీ 36 సీట్లలో గెలిచినట్టు ఈసీ ప్రకటించింది. నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ) 5 సీట్లు గెలుపొందగా.. పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్(పీపీఏ) 2, ఎన్సీపీ (అజిత్ పవార్) 3, కాంగ్రెస్ ఒక స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. స్వంత్రులు మూడు చోట్ల గెలిచారు. 2019లో బీజేపీ 41 సీట్లు గెలుచుకొని అధికారం చేపట్టింది. అరుణాచల్ అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఒక్క స్థానంలోనే గెలిచిన కాంగ్రెస్.. ప్రజాతీర్పును గౌరవిస్తున్నట్టు ప్రకటించింది. ఈ ఎన్నికల్లో 19 చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులను నిలుపగా ఈస్ట్ కమెంగ్ జిల్లా బమెంగ్స్థానంలో మాత్రమే కాంగ్రెస్ గెలుపొందింది. కాగా, అజిత్‌పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ మూడు స్థానాలను గెలుచుకోవడంతో ఆ పార్టీ జాతీయ హోదా పొందే చాన్స్ దక్కించుకుంది.
సిక్కింలో ఎస్కేఎం జయకేతనం
సిక్కింలో సిక్కిం క్రాంతికారీ మోర్చా (ఎస్కేఎం) పార్టీ భారీ విజయం సాధించింది. మొత్తం 32 స్థానాలకుగాను 31 చోట్ల గెలుపొంది, దాదాపు క్లీన్‌స్వీప్ చేసింది. 58.38 శాతం ఓట్లతో సత్తాచాటింది. దీంతో ఆ పార్టీ రెండోసారి అధికారం చేజిక్కించుకున్నది. 2019 వరకు 25 ఏండ్లు పవర్ లో ఉన్న సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్(ఎస్డీఎఫ్) ఈసారి ఒక్క సీటుకే పరిమితమైంది. ఎస్డీఎఫ్ చీఫ్, మాజీ సీఎం పవన్ కుమార్ చామ్లింగ్ పోటీ చేసిన రెండుచోట్లా ఓడిపోయారు. సీఎం ప్రేమ్ సింగ్ తమాంగ్.. పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ గెలిచారు. 2019లో ఎస్‌కేఎంకు 17 సీట్లే రాగా, ఈ సారి ఓటర్లు ఏకపక్షంగా తీర్పు చెప్పారు. కాగా, సిక్కింలో బీజేపీ 31 చోట్ల పోటీ చేయగా.. ఒక్క సీటు కూడా గెలవలేదు. ఆ పార్టీకి 5.18 శాతం ఓట్లే వచ్చాయి. కాంగ్రెస్ కూడా ఖాతా తెరవలేదు. ఆ పార్టీకి నోటా (0.99 శాతం) కంటే తక్కువగా 0.32 శాతం ఓట్లే వచ్చాయి.
అరుణాచల్ ప్రజలకు థ్యాంక్స్: మోదీ
బీజేపీకి మూడోసారి అధికారం కట్టబెట్టిన అరుణాచల్ ప్రజలకు ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ‘‘రాష్ట్ర ప్రజలు అభివృద్ధి రాజకీయాలకు పట్టం కట్టారు. రాష్ట్రాభివృద్ధికి మా పార్టీ మరింత బాగా పనిచేస్తుంది. పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు కూడా కంగ్రాట్స్” అని ట్వీట్ చేశారు. అలాగే, సిక్కింలో ఘన విజయం సాధించిన ఎస్ కేఎం, సీఎం తమాంగ్ కు మోదీ అభినందనలు తెలిపారు. సిక్కిం అభివృద్ధికి సహకరిస్తామని పేర్కొన్నారు.