- మంత్రుల చుట్టూ తిరుగుతున్న నేతలు
- సిద్దిపేట చైర్మన్ పదవిపైనే అందరి దృష్టి
సిద్దిపేట, వెలుగు: సిద్దిపేట నియోజకవర్గంలోని మూడు అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవులకు అధికార పార్టీ నేతలు పోటా పోటీగా ప్రయత్నాలు చేస్తున్నారు. నిన్న మొన్నటి వరకు సిద్దిపేట అర్బన్ డెవలప్మెంట్అథారిటీ (సుడా) చైర్మన్ పదవి కోసం ప్రయత్నించగా అది జిల్లా మొత్తం విస్తరించడంతో వారి ఆశలపై నీళ్లు చల్లినట్టయింది. దీంతో పలువురు నేతలు రూట్ మార్చి మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
కొందరు చైర్మన్ పదవి కోసం పోటీ పడుతుంటే మరికొందరు డైరెక్టర్ పోస్టు దొరికినా చాలని రాజధానికి పరుగులు తీస్తూ ముఖ్య నేతలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. దశాబ్ద కాలంగా బీఆర్ఎస్ ను ఎదుర్కొంటూ సిద్దిపేటలో పార్టీ కోసం పనిచేశాం ఇప్పుడైనా అవకాశాలు కల్పించాలని ముఖ్య నేతలు కొందరు మంత్రుల వద్ద మొరపెట్టుకుంటున్నారు. కాగా మార్కెట్పదవుల విషయంలో మంత్రులు దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కీలక పాత్ర వహించే అవకాశం ఉన్నట్టు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
సిద్దిపేట చైర్మన్ పదవికి పోటాపోటీ
సిద్దిపేట మార్కెట్ కమిటీ పదవులకు తీవ్ర పోటీ నెలకొంది. చైర్మన్పదవి మహిళలకు రిజర్వ్ చేయడంతో కొందరు నేతలు సతుల కోసం ప్రయత్నిస్తుంటే మరికొందరు కుటుంబ సభ్యులకు ఈ పదవి దక్కేలా నేతలను ప్రసన్నం చేసుకుంటున్నారు. నియోజకవర్గ కేంద్రం కాబట్టి రాజకీయంగా మరింత బలోపేతానికి ఏఎంసీ చైర్మన్ పోస్టు ఉపయోగపడడమే కాకుండా ప్రొటోకాల్ సైతం వర్తించే అవకాశం ఉండడంతో పలువురు నేతలు ముమ్మరంగా ప్రయత్నాలు సాగిస్తున్నారు.
కాంగ్రెస్ లో క్రియాశీలకంగా పనిచేస్తున్న అత్తూ ఇమామ్, బొమ్మల యాదగిరి, పూజల గోపికృష్ణ, అంజిరెడ్డి, తిరుపతి రెడ్డి తమ సతీమణుల కోసం, నాయిని నరసింహారెడ్డి తమ కుటుంబ సభ్యురాలి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు ముద్దం లక్ష్మి తన సేవలను గుర్తించి ఏఎంసీ చైర్మన్ పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
చిన్నకోడూరు, నంగునూరు పదవులపై చర్చ
చిన్నకోడూరు, నంగునూరు ఏఎంసీ చైర్మన్ పదవుల విషయంలో పార్టీలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. నంగునూరు ఏఎంసీ పదవికి టీపీసీసీ కార్యదర్శి దేవులపల్లి యాదగిరి పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. చిన్నకోడూరు ఏఎంసీ చైర్మన్ పదవికి మీసం నాగరాజు పేరు వినిపిస్తున్నా ఆయన అభ్యర్థిత్వంపై భిన్న ప్రచారాలు జరుగుతున్నాయి.
నాడు సైలెంట్.. నేడు యాక్టివ్
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్న కొందరు నేతలు ఇప్పుడు పార్టీ అధికారంలోకి రాగానే యాక్టివై హడావిడి చేస్తుండడాన్ని కొంతమంది భరించలేకపోతున్నారు. దశాబ్దకాలం పార్టీకి అంటిముట్టనట్టు వ్యవహరించిన నేతలు పార్టీ అధికారంలోకి రాగానే పాత పదవులను ముందు పెట్టుకుని మంత్రులు, పీసీసీ ముఖ్యులను కలుస్తుండడంపై పెదవి విరుస్తున్నారు. ఇలాంటి నేతలకు నామినేటెడ్ పోస్టులు అప్పగిస్తే సిద్దిపేటలో కాంగ్రెస్ జెండా కనుమరుగవుతుందని, పనిచేసే కార్యకర్తలు పార్టీకి దూరమవుతారని బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు.