నిరసన తెలిపితే ఎగవడి కొట్టుడే !

ఆదిలాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రతిపక్షాలపై రూలింగ్​పార్టీ దూకుడుగా వెళ్తోంది. అపోజిషన్​ లీడర్ల పర్యటనలను ఎక్కడికక్కడ అడ్డుకొని రచ్చ చేస్తున్న అధికారపార్టీ  లీడర్లు, కార్యకర్తలు.. తమ ఎమ్మెల్యేలు, మంత్రుల పర్యటనలకు మాత్రం ముందుండి రక్షణ కల్పిస్తున్నారు. వివిధ సమస్యలపై నిరసన తెలిపేందుకు ఎమ్మెల్యేలు, మంత్రులకు అపోజిషన్​ లీడర్లు ఎదురెళ్లడమే ఆలస్యం రంగంలోకి దిగుతున్నారు. పోలీసులను పక్కనపెట్టి మరీ పిడిగుద్దులు కురిపిస్తున్నారు. చేతికి ఏది దొరికితే దానితో అటాక్​ చేస్తున్నారు. వడ్ల కొనుగోళ్లలో జాప్యాన్ని నిరసిస్తూ ఉమ్మడి నల్గొండ జిల్లాలో గత నవంబర్​లో బీజేపీ స్టేట్​ చీఫ్​ ఎంపీ బండి సంజయ్​ పర్యటించినప్పటి నుంచి ఈ తరహా దాడులు పెరిగాయి. అప్పట్లో టీఆర్ఎస్​ ఎమ్మెల్యేలు, వాళ్ల అనుచరులు ఎక్కడికక్కడ బండి సంజయ్​ని అడ్డుకొని బీజేపీ  నేతలు, కార్యకర్తలపై దాడులకు దిగారు. ఆ తర్వాత  జనవరిలో ఎంపీ అర్వింద్​ ఆర్మూర్​ పర్యటన సందర్భంగా లోకల్​ ఎమ్మెల్యే అనుచరులు, టీఆర్ఎస్​ కార్యకర్తలు ఇదే తరహాలో అటాక్​ చేశారు. రోడ్డు పొడువునా ఎక్కడికక్కడ కట్టెలతో మోహరించిన రూలింగ్​పార్టీ కార్యకర్తలు.. బీజేపీ లీడర్లు, కార్యకర్తలపై పిడిగుద్దులు కురిపించారు. ఓ కార్యకర్త ఏకంగా కత్తితో దాడి చేయడం కలకలం రేపింది. ఈ రెండు ఘటనల్లోనూ ప్రత్యక్ష సాక్షులుగా ఉన్న  పోలీసులు నిందితులపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. తాజాగా మంత్రి హరీశ్​రావు పర్యటన సందర్భంగా రిమ్స్ లోని సమస్యలు పరిష్కరించాలనే డిమాండ్​తో కాన్వాయ్​కు అడ్డుతగిలిన యూత్ కాంగ్రెస్ లీడర్లపై పోలీసుల సమక్షంలోనే రూలింగ్​ పార్టీ కార్యకర్తలు దాడి చేయడం వివాదాస్పదమైంది. 

మంత్రుల పర్యటన ఉంటే నిర్బంధమే.. 
స్టేట్​లో ఎక్కడ ఏ మంత్రి పర్యటన ఉన్నా ఆరోజు ఉదయమో, ముందురోజు రాత్రో అపోజిషన్​ లీడర్లు, కార్యకర్తలను ముందస్తుగా అదుపులోకి తీసుకోవడం మామూలైపోయింది. ఆయా జిల్లాల్లో బీజేపీ, కాంగ్రెస్ ముఖ్య లీడర్లను, ఆ పార్టీ అనుబంధ సంఘాల నేతలను ఇండ్ల వద్దే పోలీసులు హౌస్​అరెస్ట్​ చేస్తున్నారు. ఇతర లీడర్లను, యాక్టివ్ ​కార్యకర్తలను ముందుస్తుగా అదుపులోకి తీసుకొని స్టేషన్లకు తరలిస్తున్నారు. మంత్రుల పర్యటనలు ముగిశాకే వీళ్లందరినీ విడిచి పెడుతున్నారు. గతంలో ఈ తరహా ముందస్తు అరెస్టులు జిల్లాల్లో సీఎం కేసీఆర్, కేటీఆర్​ పర్యటనలు ఉన్నప్పుడు మాత్రమే జరిగేవి. తాజాగా మిగిలిన మంత్రుల టూర్లలోనూ పోలీసులు ఇదే పాలసీ పాటిస్తున్నారు. సిరిసిల్ల లాంటి నియోజకవర్గాల్లో మంత్రి కేటీఆర్ పర్యటించినప్పుడు వందలాది మందిని రోజంతా నిర్బంధిస్తున్నారు. 

పెద్దసంఖ్యలో ప్రైవేట్​ సైన్యం.. 
రాష్ట్రంలో మూడు ప్రధాన పార్టీల నేతలు, కార్యకర్తల మధ్య కొద్దిరోజులుగా ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో చాలామంది ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు తమ వెంట ప్రైవేట్​సైన్యాన్ని మెయింటెయిన్​ చేస్తున్నారు. రూలింగ్​పార్టీ లీడర్లతో పాటు కొందరు ప్రతిపక్ష పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు కూడా వీరిలో ఉన్నారు. గతంలో ఎమ్మెల్యేలు, మంత్రుల వెంట ఇద్దరు, ముగ్గురు మాత్రమే కనిపించేవాళ్లు. ప్రస్తుతం పదుల సంఖ్యలో అనుచరులను వెంటేసుకొని తిరుగుతున్నారు. మంత్రుల పర్యటనలున్నప్పుడు వాళ్ల మెప్పు పొందేందుకు కొందరు ఎమ్మెల్యేలు తమ మందీమార్బలాన్ని  రంగంలోకి దింపుతున్నారు.  వాళ్ల పర్యటనలో ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలు ఎవరైనా నిరసన తెలిపేందుకు ప్రయత్నిస్తే పోలీసుల కంటే ముందు వీళ్లే చుట్టుముట్టి అటాక్​ చేస్తున్నారు. నిజామాబాద్​ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే వెంట.. అనుచరుల పేరుతో ఏం తక్కువ 10 మంది ప్రైవేట్​ వ్యక్తులు ఉంటున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే నియోజకవర్గంలో పర్యటనకు వస్తే 20 మంది పక్కన ఉండాల్సిందే. సమస్యలపై పబ్లిక్​ నిలదీసినా సరే పక్కకు తీసుకెళ్లి వార్నింగులు ఇస్తున్నారు. ఇదే ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మరో ఎమ్మెల్యే తన అక్రమ వసూళ్లకు, తనను విమర్శించే వాళ్లపై దాడుల కోసం ప్రైవేట్ వ్యక్తులను వినియోగిస్తున్నారు. ఇందుకోసం పది మందికి నెలనెలా వేతనాలు కూడా ఇస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లాలోని ముగ్గురు ఎమ్మెల్యేల వెంట ఇలాంటి ప్రైవేట్​ సైన్యం ఉంటోంది. తమ నేతలపై ఈగవాలకుండా చూసుకోవడమే వీళ్ల డ్యూటీ. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్రవ్యాప్తంగా మెజారిటీ ప్రజాప్రతినిధులు ఇలా అనుచరుల పేరుతో గూండాగిరీ పెంచిపోషిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

ఆదిలాబాద్ లో శుక్రవారం మంత్రి హరీశ్​రావు పర్యటించారు. కాన్వాయ్​ ముందు టీఆర్ఎస్​ కార్యకర్తలు బైక్​ర్యాలీగా వచ్చారు. మావల నుంచి ఆదిలాబాద్ రిమ్స్ వరకు ఈ ర్యాలీ సాగింది. ఈలోగా కాంగ్రెస్ కార్యకర్తలు కొందరు రిమ్స్​లో సమస్యలపై మంత్రి ఎదుట నిరసన తెలిపే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులకంటే ముందే టీఆర్ఎస్ కార్యకర్తలు రంగప్రవేశం చేశారు. బైకులు పక్కనపెట్టి దొరికినవాళ్లను దొరికినట్లు కొట్టారు. పోలీసుల కండ్ల ముందే రూలింగ్​ పార్టీ కార్యకర్తలు ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలను అటాక్​ చేస్తున్నా చోద్యం చూశారు. రాష్ట్రంలో ఈ మధ్య ఇలాంటి ఘటనలు పెరిగిపోతున్నాయి. 

టీఆర్ఎస్ కార్యకర్తలు రౌడీల్లా దాడి చేశారు
కాంగ్రెస్ నేతలపై టీఆర్ఎస్ కార్యకర్తలు రౌడీల్లా దాడి చేశారని ఏఐసీసీ సభ్యురాలు గండ్ర సుజాత ఆరోపించారు. టీఆర్ఎస్ కార్యకర్తల చేతుల్లో దాడికి గురైన ఎన్ఎస్ యూఐ లీడర్​శాంతన్ రావు తో కలిసి శుక్రవారం ఆమె ఆదిలాబాద్​లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రిమ్స్ లోని సమస్యలు, వైద్య పోస్టుల ఖాళీల విషయమై వినతి పత్రాన్ని ఇచ్చేందుకు వచ్చిన యూత్ కాంగ్రెస్ నాయకులపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజలు ఎమ్మెల్యే జోగు రామన్న కు అధికారం ఇస్తే దాన్ని అడ్డు పెట్టుకుని ఇష్టమున్నట్టు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రతిపక్షం అనేదే ఉండకూడదనేలా వ్యవహరిస్తున్నారన్నారు. కాంగ్రెస్ లీడర్లు నర్సింగ్ రావు, వెంకట్ రెడ్డి, నగేష్, చరణ్ గౌడ్, శేఖర్, పోచ్చన్న, అశోక్ రెడ్డి, రూపేష్ రెడ్డి, అశోక్, నహిద్ పాల్గొన్నారు.

For more news..

 

షేన్ వార్న్ కెరీర్ హైలైట్స్: ఐపీఎల్‌‌‌‌ ఫస్ట్‌‌‌‌ టైటిల్‌‌‌‌ అతనిదే..!

లక్కీడ్రాలో కారు వచ్చిందని 28 లక్షలు కాజేసిండు