వరద సాయం సగం బుక్కేసిన్రు

‘‘ప్రతిపక్షాలది బురద రాజకీయం”మున్సిపల్ ​మంత్రి కేటీఆర్​ చేసిన కామెంట్​ ఇది. అధికార మదంతో ఇష్టారాజ్యంగా నోటికొచ్చినట్టు మాట్లాడటం విజ్ఞత అనిపించుకోదు. అసలు.. బురద రాజకీయాలు ఎవరు చేస్తున్నారో ఒక్కసారి గ్రౌండ్​ లెవల్​కు వెళ్లి పరిశీలిస్తే.. టీఆర్ఎస్​ పార్టీ కార్పొరేటర్లేనని స్పష్టమవుతోంది. గ్రేటర్ పరిధిలో వరద సాయం కింద రూ.550 కోట్లు కేటాయించారు. ఆ సొమ్ము నిజమైన లబ్ధిదారులకు చేరిందా? అంటే లేదనే చెప్పాలి. చాలా చోట్ల వరద సాయం కింద ఉదయం రూ.10 వేలు ఇచ్చి.. సాయంత్రం లోకల్​ కార్పొరేటర్ అనుచరులు వచ్చి దౌర్జన్యంగా అందులో రూ.ఐదు వేలను లాక్కెళ్లిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న ఆందోళనలే ఇందుకు నిదర్శనం. అన్ని చోట్లా విమర్శలు వస్తుంటే ఒక్క కార్పొరేటర్ కూడా ఎందుకు నోరు మెదపడం లేదు. ఆ ఆరోపణలను ఎందుకు ఖండించడం లేదు. మొత్తంగా గ్రేటర్ పరిధిలో రూ.550 కోట్లలో రూ.200 కోట్ల వరద సాయాన్ని టీఆర్ఎస్​ నేతలు స్వాహా చేసినట్లు తెలుస్తోంది. వీటన్నింటినీ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పంచేందుకు ప్లాన్​ చేశారు.

ఇటీవల ప్రకటించిన ఆస్తి పన్నులో రాయితీ, కార్మికులకు జీతాల పెంపు వంటివి గ్రేటర్ ఎన్నికల స్టంట్లే. అసెంబ్లీ ఎలక్షన్స్ టైమ్​లో పెన్షన్లు, రైతుబంధు రిలీజ్ చేయడం.. మొన్న హుజూర్ నగర్ ఉపఎన్నికలో ఒకరోజు ముందు ఆ నియోజవర్గ ప్రజల ఖాతాలో రైతుబంధు డబ్బులు జమ చేయడం టీఆర్ఎస్ ఎలక్షన్ స్టంట్లే. ప్రజలు ఇప్పుడిప్పుడే ఈ విషయాన్ని గమనిస్తున్నారు. కేసీఆర్ భ్రమల్లోంచి బయటకు వస్తున్నారు. అంతేకాదు.. రూ.10 వేల పరిహారం ముఖ్యమా? లేక మళ్లీ వరదలు తలెత్తకుండా శాశ్వత పరిష్కారం ముఖ్యమా? అనేది కూడా హైదరాబాదీలు ఆలోచన చేస్తున్నారు. హైదరాబాద్ ను డల్లాస్ గా మారుస్తం, ఇస్తాంబుల్ చేస్తమని తండ్రీకొడుకులు కోయని కోతలు లేవు. రోడ్లపై గుంతలు చూపిస్తే వెయ్యి రూపాయలు ఇస్తామని ప్రగల్భాలు పలికారు. కానీ అలా చేయడంలో అట్టర్ ఫ్లాప్ అయ్యారు. జీహెచ్ఎంసీ వంద రోజుల ప్రణాళికకు ఐదేండ్లు గడుస్తున్నా అతీగతీ లేదు. ట్యాంక్ బండ్ చుట్టూ ఆకాశ హర్మ్యాలు, గ్రేటర్ లోని ప్రధాన కూడళ్లలో స్కైవేల నిర్మాణం, పేదలకు లక్ష డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, బస్ బేలు, మోడల్ మార్కెట్లు ఏమయ్యాయో తెలియదు.

ఖర్చుపై శ్వేతపత్రం రిలీజ్​ చేయాలి

ఆరేండ్లలో హైదరాబాద్​లో రూ.67 వేల కోట్లు ఖర్చు చేసినట్లు మంత్రి కేటీఆర్ స్వయంగా చెప్పారు. కానీ, ఆర్టీఐ ద్వారా సేకరించిన సమాచారం మేరకు హైదరాబాద్ కోసం రూ.78,98,49,906 మాత్రమే ఖర్చు చేసినట్టు తెలిసింది. మీరు గొప్పగా చెబుతున్న సేఫ్ హైదరాబాద్, శాంత హైదరాబాద్ సాధించారా? ఇంత భారీ మొత్తాన్ని ఏయే కార్యక్రమాలకు.. ఎప్పుడెప్పుడు.. ఎంతెంత ఖర్చు చేశారో శ్వేతపత్రం రిలీజ్​ చేయాలి. మజ్లిస్ సోదరులను ఇంటికి పిలిపించుకుని మాట్లాడినంత మాత్రాన.. గ్రేటర్ లో గెలుపు మీదే అనుకుంటే అంతకంటే అమాయకత్వం ఉండదు. ఎన్నికల వేళ మీరిచ్చే తాయిలాలు తీసుకుని.. జనం ఇవేమీ ఆలోచించకుండా ఓట్లేస్తారనుకోవడం అవివేకం. కరోనా వల్ల తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న చిరు వ్యాపారులు, ప్రైవేట్ టీచర్లు, లెక్చరర్లు, చిన్నపాటి ఉద్యోగాలు కోల్పోయిన వారు లక్షల్లో ఉన్నారు. మీకు, మీ ప్రభుత్వానికి వీళ్లు కనబడటం లేదు. వారిని ఆదుకునే ఆలోచన ఎందుకు చేయడం లేదు. గ్రేటర్ పరిధిలో వందలాది నాలాలు, చెరువు కబ్జాలకు గురయ్యాయి. నాలాలపై 28 వేల ఆక్రమణలు ఉన్నాయని కిర్లోస్కర్ కమిటీ తేల్చింది. వీటిని తొలగించాలని డిమాండ్​ చేస్తే ఉమ్మడి రాష్ట్రంలోనే కబ్జాలు జరిగాయని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ వచ్చి ఆరున్నరేండ్లవుతోంది. ఇంతకాలంగా మీరేం చేస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలి

టీఆర్ఎస్​కు గుణపాఠం తప్పదు

హైదరాబాద్ అభివృద్ధి అంతా కాంగ్రెస్ హయాంలో జరిగిందే. అప్పట్లో మొదలు పెట్టిన ప్రాజెక్టుల ముందు ఫొటోలకు పోజులిచ్చి.. అది టీఆర్ఎస్ ఘనతగా చెప్పుకోవడం మీకే చెల్లింది. చరిత్రను వక్రీకరించినంత మాత్రాన ప్రజలు నిజాలు మర్చిపోతారనుకోవడం మీ మూర్ఖత్వం. హైదరాబాద్ కు ఐఐటీ, బిట్స్​ పిలానీ, ట్రిపుల్​ ఐటీ వంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు, బీహెచ్ఈఎల్, ఈసీఐఎల్, హెచ్ఎంటీ, ఐడీపీఎల్, మిథాని, సీసీఎంబీ, ఎన్ఎమ్డీసీ, డీఆర్డీవో లాంటి ప్రభుత్వ రంగ సంస్థలు కాంగ్రెస్ టైమ్​లోనే వచ్చాయి. హైదరాబాద్ దాహార్తిని తీర్చేందుకు కృష్ణా నుంచి 16.5 టీఎంసీలు, శ్రీపాద ఎల్లంపల్లి ద్వారా రూ.1,700 కోట్ల వ్యయంతో గోదావరి జలాలు, మంజీరా నదీ జలాలు తీసుకువచ్చిన ఘనత కాంగ్రెస్ దే. ప్రతిష్టాత్మకమైన శంషాబాద్ ఎయిర్ పోర్ట్, పీవీ ఎక్స్ ప్రెస్ వే, ఔటర్ రింగ్ రోడ్డు కూడా కాంగ్రెస్ హయాంలో నిర్మించినవే. మహానగరానికి మణిహారమైన మెట్రోరైలు కాంగ్రెస్ ఘనతనే. హైదరాబాద్ అభివృద్ధికి ఇన్ని చేసినా.. టీఆర్ఎస్​ ప్రభుత్వానికి అవేవీ కనిపించడం లేదు. కనీసం ఆడబిడ్డల మానప్రాణాలకు రక్షణ కల్పించలేని దౌర్భాగ్య స్థితిలో ఈ సర్కార్ ఉన్నది. గ్రేటర్​ ఎన్నికల్లో పేదలు, మహిళలు, యువత, ప్రైవేట్ ఉద్యోగులు టీఆర్ఎస్​కు తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. – ఇందిరాశోభన్ పోశాల, పీసీసీ అధికార ప్రతినిధి.

Read more news

షుగర్ ఉంటే తేనె వాడొచ్చా..?

కళ్ల ముందే అద్భుతాలు.. త్వరలో అందుబాటులోకి ఏఆర్ టెక్నాలజీ

ఫ్లిప్ కార్ట్ యూజర్లు ఆల్ టైమ్ హై

కరోనా టెస్ట్.. జస్ట్ రూ.850

పేకాటలో టెక్నాలజీ.. తండ్రీ కొడుకుల ఛీటింగ్