- ఆఫీసర్ల కంటే ముందే లబ్ధిదారులను ఎంపిక చేస్తున్న లీడర్లు
- ఒక్కో నియోజకవర్గం నుంచి సగటున 13 వేల అప్లికేషన్లు
- ఇచ్చేది మాత్రం 3 వేల మందికేఈ లెక్కన ఒక్కో ఊరిలో
- 20 మందికే అవకాశం ఫైనల్ లిస్టు పెట్టకముందే పనులు
- అంతా ముందే ఫిక్స్అయిపోయిందన్న విమర్శలు
వరంగల్, వెలుగు : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గృహలక్ష్మి పథకంలో అర్హుల జాబితా బయటకు రాకముందే అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఊళ్లల్లో పలువురితో ఇండ్లకు ముగ్గులు పోయిస్తున్నారు. గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు స్వయంగా హాజరై దగ్గరుండి మరీ ముగ్గుపోయించి కొబ్బరికాయలు కొడుతున్నారు. ముగ్గు పోసే ఫొటోలు, వీడియోలను వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేస్తున్నారు. ఎమ్మెల్యే ఆదేశానుసారం ఫలానా వారికి గృహలక్ష్మి ఇల్లు మంజూరైందని ప్రచారం చేస్తున్నారు.
ఒక్కో ఊరి నుంచి వందల్లో అప్లికేషన్లు పెట్టుకుంటే పదుల సంఖ్యలో ముగ్గులు పోయిస్తుండడంతో మిగిలినవాళ్లు పరేషాన్అవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గైడ్‍లైన్స్ ప్రకారం ఇంకా ఫైనల్లిస్టు రాకముందే బీఆర్‍ఎస్ లీడర్లు ముగ్గులు పోయించడాన్ని బట్టి చూస్తే అర్హుల ఎంపికలో పారదర్శకత ఉట్టిమాటే అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఊరికి 20 మందికే..
రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గానికి13 వేల చొప్పున అప్లికేషన్లు రాగా, ప్రభుత్వం మాత్రం 3 వేల మందికి మాత్రమే ఇవ్వనున్నట్లు చెప్పింది. ఈ లెక్కన ఒక్కో ఊరికి 20 నుంచి 25 మందికంటే ఎక్కువ మందికి ఇచ్చే అవకాశం లేదు. సగటున ఒక్కో నియోజకవర్గంలో 6 మండలాలు.. ఒక్కో మండలంలో 25 గ్రామాల చొప్పున లెక్క వేసుకున్నా ఒక ఎమ్మెల్యే పరిధిలో సుమారు 150 గ్రామాలు వస్తాయి. ప్రభుత్వం చెప్పినట్లు మొదటి విడతలో నియోజకవర్గానికి 3 వేల మందికి ఇచ్చినా ఒక్కో గ్రామానికి 20 మందికి మాత్రమే గృహలక్ష్మి పథకంలో రూ.3 లక్షల సాయం అందుతుంది.
లోకల్ లీడర్లు చెప్పినోళ్లకేనా?
రాష్ట్ర ప్రభుత్వం గృహలక్ష్మి పథకంలో అర్హుల ఎంపిక పారదర్శకంగా చేయనున్నట్లు చెప్పింది. ఎట్టి పరిస్థితుల్లో పైరవీలకు తావుండదని ప్రకటించింది. అట్టడుగు పేదలనే ఎంపిక చేయాలని ఆర్డర్ వేసింది. తీరాచూస్తే..గృహలక్ష్మి అర్హుల ఎంపిక జిల్లా ఉన్నతాధికారుల చేతుల్లో కాకుండా మళ్లీ ఎమ్మెల్యేల చేతుల్లోనే ఉందనే విషయాన్ని స్పష్టం చేసింది.
ఒక్కో గ్రామం నుంచి గృహలక్ష్మి కోసం అప్లై చేసుకున్నవారి లిస్టులను అధికారులు ఆఫీసుల్లో అంటించారు. పూర్తి వెరిఫికేషన్ అయ్యాక ఫైనల్ లిస్ట్ ఇస్తామని అంటున్నారు. కానీ ఫీల్డ్లెవెల్లో విషయం మరోలా ఉంది. ఉమ్మడి ఓరుగల్లుతో పాటు వివిధ జిల్లాల్లోని వందలాది గ్రామాల్లో గృహలక్ష్మి పథకంలో ఎమ్మెల్యే చెప్పాడని బీఆర్‍ఎస్ లీడర్లు దగ్గరుండి మరీ పలువురితో ఇంటి నిర్మాణానికి ముగ్గు పోయిస్తున్నారు. గ్రామ, మండల స్థాయి లీడర్లు అక్కడకు వచ్చి కొబ్బరికాయలు కొడుతున్నారు. లబ్ధిదారులతో ఫొటోలు దిగి వీడియోలు తీసుకుని మండలంలోని అన్ని వాట్సాప్ గ్రూపుల్లో షేర్చేస్తున్నారు.
ఎమ్మెల్యే ఆదేశానుసారం 15 నుంచి 20 మందికి గృహలక్ష్మి పథకం కింద లబ్ధిదారుల ఇంటికి ముగ్గుపోసినట్లు సమాచారం ఇస్తున్నారు. అధికారులు ఫైనల్లిస్ట్ప్రకటించకుముందే ఎమ్మెల్యే ఓకే చేశాడనే పేరుతో బీఆర్‍ఎస్ లీడర్లు ఇంటి నిర్మాణాలకు ముగ్గు పోస్తుండడంతో ముందే ఫిక్స్అయిపోయినట్టు ఆరోపణలు వస్తున్నాయి.