లోకల్ ఇష్యూస్​ పైనే పార్టీల ఫోకస్​ .. ప్రచారంలో ఎక్కువ ప్రస్తావన వాటిపైనే

లోకల్ ఇష్యూస్​ పైనే  పార్టీల ఫోకస్​ .. ప్రచారంలో ఎక్కువ ప్రస్తావన వాటిపైనే
  • అభివృద్ధి గురించి చెబుతున్న అధికార నాయకులు
  • నెరవేరని హామీల గురించి చెబుతున్న ప్రత్యర్థులు

మెదక్, వెలుగు:  మెదక్​ జిల్లాలోని మెదక్, నర్సాపూర్ సెగ్మెంట్లలో పోటీ చేస్తున్న ప్రధాన పొలిటికల్​ పార్టీల అభ్యర్థులు తమ పార్టీ మేనిఫెస్టోలతో పాటు, ప్రధానంగా నియోజకవర్గ పరిధిలోని లోకల్​ ఇష్యూస్​ గురించి ఎక్కువగా ప్రస్తావిస్తున్నారు. అధికార పార్టీ అభ్యర్థులు గడచిన పదేళ్లలో జరిగిన అభివృద్ధి పనుల గురించి చెబుతుండగా, ప్రత్యర్థులు నెరవేరని హామీలు, పెండింగ్, అసంపూర్తి పనుల గురించి ఎక్కువగా ప్రస్తావిస్తున్నారు. అభ్యర్థుల తరపున ప్రచారానికి వస్తున్న బడా నేతలు సైతం లోకల్​ ఇష్యూస్​ గురించి మాట్లాడుతుండటం గమనార్హం.

బీఆర్‌‌ఎస్‌‌ 

బీఆర్‌‌ఎస్​ మెదక్‌‌ అభ్యర్థి పద్మాదేవేందర్‌‌రెడ్డి ఎన్నికల ప్రచారంలో మెదక్​ పట్టణ ప్రాంత వాసుల చిరకాల కోరికైన జిల్లా కేంద్రం సాధించడం, అన్ని ప్రభుత్వ కార్యాలయాల  ఏర్పాటు, ఇంటిగ్రేటెడ్​ కలెక్టరేట్, ఎస్పీ ఆఫీస్​ బిల్డింగ్​ నిర్మాణం, అలాగే ఎన్నో దశాబ్దాల కల అయిన అక్కన్నపేట ‒ మెదక్  రైల్వేలైన్‌, మాతా శిశు సంరక్షణ కేంద్రం ఏర్పాటు, జిల్లా గవర్నమెంట్​ హాస్పిటల్​లో ఐసీయూ, డయాలసిస్​ సెంటర్​, ఆక్సిజన్​ ప్లాంట్​, డయగ్నోసిస్​ హబ్ ఏర్పాటు, పట్టణంలో మెయిన్​ రోడ్డు విస్తరణ, ఘనపూర్ ఆనకట్ట కాల్వల సిమెంట్​ లైనింగ్,​ రామాయంపేట రెవెన్యూ డివిజన్​ ఏర్పాటు, గవర్నమెంట్​​డిగ్రీ కాలేజీ మంజూరు, ఏడుపాయల అభివృద్దికి రూ.100 కోట్ల మంజూరు విషయాలను ప్రస్తావిస్తున్నారు. బీఆర్‌‌ఎస్‌ నర్సాపూర్‌ ‌అభ్యర్థి సునీతారెడ్డి ఎన్నో దశాబ్దాలుగా పెండింగ్‌‌లో ఉన్న నర్సాపూర్‌‌ ఆర్టీసీ బస్‌‌డిపో ఏర్పాటు, మంజీరా నది, హల్దీ వాగుమీద 14 చెక్‌‌డ్యాంల మంజూరు, బాలానగర్ నుంచి నర్సాపూర్‌‌ మీదుగా నేషనల్‌‌ హైవే పనులు, మాసాయిపేట మండలం ఏర్పాటు గురించి ప్రచారంలో చెబుతున్నారు. 

బీజేపీ

మెదక్, నర్సాపూర్​ స్థానాల్లో పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థులు పంజా విజయ్​ కుమార్, మురళీ యాదవ్​ కేంద్రంలో అధికారంలో ఉన్న తమ పార్టీ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతోపాటు, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్​ఎస్​ పార్టీ ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యేల వైఫల్యాలను ప్రస్తావిస్తున్నారు. గ్రామాల్లో చేపట్టిన రైతు వేదికలు, సెగ్రిగేషన్​ షెడ్​లు, వైకుంఠ ధామాలు, క్రీడాప్రాంగణాల వంటి వాటి నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వ నిధులు ఉన్న విషయాన్ని గుర్తుచేస్తున్నారు. మున్సిపాలిటీలు, మండలాల్లో డబుల్​ బెడ్​ రూమ్​ ఇండ్లు కేవలం కొన్ని మాత్రమే మంజూరు కాగా అవి కూడా చాలా చోట్ల పూర్తి కాని విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. పూర్తయిన చోట సైతం అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నవారికే ఇండ్లు కేటాయించారని విమర్శిస్తున్నారు. 

కాంగ్రెస్

కాంగ్రెస్​ మెదక్ అభ్యర్థి మైనంపల్లి రోహిత్​ మెదక్​ పట్టణం నుంచి వివిధ ప్రభుత్వ కార్యాలయాలు సిద్దిపేటకు తరలిపోవడం గురించి పదే పదే ప్రస్తావిస్తున్నారు. మెదక్​  పట్టణంలో మినీ ట్యాంక్ బండ్​, రైతు బజార్​, ఇంటిగ్రేటెడ్​ మార్కెట్, వైకుంఠధామం పనులు అసంపూర్తిగా ఉన్నవిషయాన్ని గుర్తు చేస్తున్నారు. అధికారంలోకి వస్తే వంద రోజుల్లో మంబోజిపల్లిలోని నిజాం దక్కన్​ షుగర్​ ఫ్యాక్టరీని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని నడిపిస్తుందని గతంలో  సీఎం కేసీఆర్​ చెప్పారు. ఫ్యాక్టరీ మూత పడి ఎనమిదేళ్లయినా పట్టించుకోని విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళుతున్నారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల, మెదక్ ఖిల్లా, చర్చి, పోచారం అభయారణ్యం, ప్రాజెక్ట్​లను కలిపి టూరిజం సర్క్యూట్​గా డెవలప్​ చేస్తామని మాటతప్పారని విమర్శిస్తున్నారు.  

కాంగ్రెస్​ నర్సాపూర్​ అభ్యర్థి ఆవుల రాజిరెడ్డి నియోజకవర్గ పరిధిలోని వివిధ మండలాల్లో రైతులకు కొత్త పట్టా పాసు పుస్తకాలు రాక పడుతున్న ఇబ్బందులు, జరుగుతున్న నష్టం, గిరిజనేతర రైతులకు పోడు పట్టాలు రాకపోవడం, ట్రిబుల్​ ఆర్​కు అలైన్​మెంట్​ మార్పు, కొత్త మండలాల్లో ప్రభుత్వ కార్యాలయాలకు ఆఫీస్​లు సమకూర్చకపోవడం, అనేక గ్రామాలకు, తండాలకు రోడ్డు సౌకర్యం మెరుగుపడని విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. బీఆర్​ఎస్ నాయకుల భూకబ్జాలు, ఇసుక అక్రమ రవాణా చేసి కోట్లు దండుకున్నారని ఆరో​పిస్తున్నారు.