- రూ.30 కోట్ల పనిని మధ్యలో వదిలేసిన కాంట్రాక్టర్
- బురదమయంగా మారడంతో దిగబడుతున్న వెహికల్స్
- నిత్య నరకం చూస్తున్న ఏడు గ్రామాల ప్రజలు
నాగర్‌కర్నూల్, వెలుగు: ఆరేళ్ల క్రితం పనులు మొదలుపెట్టిన కొల్లాపూర్ నియోజకవర్గంలోని సింగోటం–-ఏదుట్ల డబుల్ లేన్రోడ్డు ముందుకు సాగడం లేదు. 28 కిలోమీటర్లు ఉండే ఈ రోడ్డు నిర్మాణాన్ని కాంట్రాక్టర్ మధ్యలోనే వదిలేయడంతో దీని పరిధిలోని ఏడు గ్రామాల ప్రజలు నిత్యం నరకం చూస్తున్నారు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు రోడ్డంతా గుంతలు పడి, బురదమయం కావడంతో వాహనాలు దిగబడుతున్నాయి. బస్సులు, అంబులెన్స్‌లు కూడా వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఈ విషయాన్ని స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజలు ఎన్నిసార్లు మంత్రి, ఎంపీ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లినా.. ఆర్‌అండ్‌బీ ఆఫీసర్లకు చుట్టూ తిరిగినా పట్టించుకోవడం లేదు. దీంతో విసిగిపోయిన అధికార పార్టీకి చెందిన కోడేరు మండలం ఎత్తం ఎంపీటీసీ శ్రీనివాసరావు, సర్పంచ్ సాయిని వరలక్ష్మి దంపతులు మంగళవారం గ్రామస్తులతో కలిసి రోడ్డుపై వరి నాట్లు వేసి నిరసన తెలిపారు. ఈ క్రమంలో అక్కడికి వచ్చిన ఆర్టీసీ బస్సు బురదలో దిగబడింది. గ్రామస్తులంతా కలిసి బస్సును బయటకు తోసి... అక్కడే బైఠాయించి వెంటనే పనులు చేపట్టాలని ధర్నా చేశారు.
కాంట్రాక్టర్‌ను మార్చి.. పనులు చేపట్టాలి
మధ్యలో పనులు వదిలేసిన కాంట్రాక్టర్‌ను మార్చి వెంటనే పనులు చేపట్టాలని ఎత్తం ఎంపీటీసీ శ్రీనివాసరావు, సర్పంచ్ సాయిని వరలక్ష్మి దంపతులు డిమాండ్ చేశారు. ధర్నా అనంతరం వారు మాట్లాడుతూ తాము ఎమ్మెల్యే, అధికారులను ఎన్నిసార్లు కలిసినా రేపుమాపు అంటున్నారే తప్ప పనులు మాత్రం ప్రారంభం కావడం లేదని వాపోయారు. రోడ్డు కోసం తాము ఎంత పోరాటం చేస్తున్నా.. అధికార పార్టీ కావడంతో లీడర్లు సపోర్ట్ చేయడం లేదని వాపోయారు. రోడ్డు బాగాలేక ఆర్టీసీ బస్సులు సరిగ్గా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంబులెన్స్‌కూడా వచ్చే పరిస్థితి లేదని, ఎవరికైనా ఎమర్జెన్సీ ఉంటే ప్రాణాలు పోవడమేనని ఆందోళన వ్యక్తం చేశారు.
2017లో మంజూరు
సింగోటం-ఏదుట్ల డబుల్ లేన్ రోడ్డుకు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు 2017లో రూ.30 కోట్లు మంజూరు చేశారు. సింగోటం నుంచి ఎత్తం, నాగులపల్లి, ముత్తిరెడ్డిపల్లి, తుర్కదిన్నే, సింగాయిపల్లి, రేమద్దుల, ఏదుట్ల వరకు 28 కిలో మీటర్లు రోడ్డు వేయాల్సి ఉంది. టెండర్ ప్రాసెస్ అనంతరం పనులు చేపట్టిన కాంట్రాక్టర్ నాగులపల్లి నుంచి ఎత్తం వైపు 3 కి.మీ. బీటీ వేసి పనులు ఆపేశాడు. కొద్దిదూరం రోడ్డును తవ్వి మెటల్ వేసి వదిలేశాడు. అప్పటి నుంచి ఏడు గ్రామాల ప్రజల కష్టాలు డబుల్అయ్యాయి. ఎండాకాలంలో దుమ్ము లేవడం, వర్షాకాలంలో గుంతలు, బురదమయంగా మారడం కామన్ అయిపోయింది.