- పావులు కదుపుతున్న అధికార పార్టీ
- ఇప్పటికే కాంగ్రెస్‌లోకి 11 మంది కార్పొరేటర్లు
- ఇయ్యాలో, రేపో మరో ఐదుగురు అధికార పార్టీలో చేరే చాన్స్
- జూన్ ఫస్ట్ వీక్ లో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే అవకాశం
- ఎంఐఎం కార్పొరేటర్ల నిర్ణయం పై ఉత్కంఠ
కరీంనగర్, వెలుగు: కరీంనగర్ బల్దియా మేయర్ పీఠం దిశగా అధికార పార్టీ అడుగులు వేస్తోంది. ఆ దిశగా మంత్రి పొన్నం ప్రభాకర్ పావులు కదుపుతున్నట్లు సమాచారం. ఇప్పటికే బీఆర్ఎస్ కార్పొరేటర్లు పలువురు పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరుతున్నారు. ఇటీవల సిరిసిల్ల సభలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో 9 మంది కరీంనగర్ కార్పొరేటర్లు చేరగా.. తాజాగా మరో ఐదుగురు ఆ పార్టీని వీడేందుకు సిద్దమైనట్లు తెలిసింది. మంగళవారం కరీంనగర్ ఎస్సార్ఆర్ కాలేజీ గ్రౌండ్స్ లో జరగాల్సిన బహిరంగ సభలోనే సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో సదరు కార్పొరేటర్లు చేరేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నప్పటికీ.. చివరి నిమిషంలో సభ రద్దు కావడంతో వారి చేరిక వాయిదా పడినట్లు సమాచారం. వీరు ఒకటి, రెండు రోజుల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో సీఎం సమక్షంలోనే కాంగ్రెస్ చేరుతారనే ప్రచారం జరుగుతోంది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే జూన్ ఫస్ట్ వీక్‌లో కరీంనగర్ మేయర్‌పై అవిశ్వాసం పెట్టే అవకాశముందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
బల్దియాలో తగ్గుతున్న బీఆర్ఎస్ బలం
కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో 60 డివిజన్లు ఉన్నాయి. 2020 జనవరిలో జరిగిన ఎన్నికల్లో బీఆర్‌ఎస్ 33, బీజేపీ 13, ఎంఐఎం 6 స్థానాల్లో విజయం సాధించాయి. 8 స్థానాల్లో ఇండిపెండెంట్లు గెలిచారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక్కటీ గెలవలేదు. మేయర్ గా సునీల్ రావు ఎన్నికయ్యేనాటికే 8 మంది ఇండిపెండెంట్లు, ఆ తర్వాత కొన్నాళ్లకే ఇద్దరు బీజేపీ కార్పొరేటర్లు బీఆర్ఎస్ లో చేరారు. అసెంబ్లీ ఎన్నికల ముందు మరో ముగ్గురు బీజేపీ కార్పొరేటర్లు బీఆర్ఎస్ లో చేరారు. దీంతో మున్సిపాలిటీలో బీఆర్ఎస్ కార్పొరేటర్ల సంఖ్య 46కు చేరింది.
అయితే ఇటీవల అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఇద్దరు కార్పొరేటర్లు, మొన్నటి సిరిసిల్ల సభలో చేరిన 9 మందితో కలిపితే కాంగ్రెస్ బలం 11 అయింది. మరో ఐదుగురు నేడో, రేపో చేరితే అది 16కు చేరనుంది. వీరితోపాటు మంగళవారం బీజేపీలో చేరిన ఇద్దరిని మైనస్ చేస్తే కార్పొరేషన్ లో బీఆర్ఎస్ బలం 28కి పడిపోయే అవకాశముంది. ఆరుగురు ఎంఐంఎం కార్పొరేటర్ల మద్దతుతోపాటు మరో ముగ్గురు బీఆర్ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్ లో చేరితే మేయర్ పీఠం అధికార పార్టీ కైవసం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. కాగా ఎంఐఎం కార్పొరేటర్లు ఎవరికి మద్దతిస్తారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ఎన్నికల ఫలితాల్లోపు జరిగే రాజకీయ పరిణామాలు, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లే లీడర్ల వలసలను బట్టి అవిశ్వాసంలో ఏవైనా మార్పులు జరగొచ్చనే చర్చ సాగుతోంది.
జగిత్యాలలోనూ అధికార పార్టీలోకి వలసలు..
జగిత్యాల, వెలుగు: జగిత్యాల, కోరుట్ల నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీలోకి వలసలు పెరుగుతున్నాయి. జగిత్యాలలో ఎంపీ అభ్యర్థి జీవన్‌రెడ్డి, కోరుట్లలో నియోజకవర్గ ఇన్చార్జి జువ్వాడి నర్సింగరావు ఆధ్వర్యంలో పార్టీ బలోపేతమవుతోంది. బీఆర్ఎస్ లోని ముఖ్య లీడర్ల తో పాటు బీజేపీ లీడర్లు ఇప్పటికే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. తాజాగా జగిత్యాల బీఆర్ఎస్ కు చెందిన ఆరుగురు కౌన్సిలర్లు జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో హస్తం గూటికి చేరారు. కోరుట్ల బల్దియాలోనూ ఇటీవల బీఆర్ఎస్ కౌన్సిలర్లతో పాటు, సింగిల్ విండో చైర్మన్లు అధికార పార్టీలో చేరారు. ఈక్రమంలో పార్లమెంట్ ఎన్నికలు అయ్యాక కోరుట్ల బల్దియాను కాంగ్రెస్ కైవసం చేసుకునే అవకాశం ఉంది.