సెస్ ఎన్నికల్లో ఓట్లను కొనేందుకు రూలింగ్​పార్టీ ప్రయత్నాలు

  • బీజేపీని గెలిపిస్తే సెస్​ను కాపాడుకుంటాం
  • లాభాల్లో ఉన్న సంస్థను బీఆర్ఎస్​ నేతలు దివాళా తీయించారు
  • సెస్ ఎన్నికల్లో  ఓట్లను కొనేందుకు రూలింగ్​పార్టీ ప్రయత్నాలు
  • సెస్ లో అవినీతికి పాల్పడిన వారిని జైలుకు పంపుతాం
  • బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ ఇంటర్వ్యూ

రాజన్న సిరిసిల్ల, వెలుగు:  సిరిసిల్ల సహకార విద్యుత్ సంఘం(సెస్) ఎన్నికల్లో బీజేపీ బలపర్చిన అభ్యర్థులను గెలిపిస్తే సెస్​ను కంటికి రెప్పలా కాపాడుకుంటామని..  పొరపాటున బీఆర్ఎస్  అభ్యర్థులు  గెలిస్తే సెస్ కు మరణ శాసనమే నని బీజేపీ స్టేట్​ చీఫ్​ బండి సంజయ్​ అన్నారు.  వాళ్లు గెలిస్తే సెస్ ను ట్రాన్స్​కోలో  విలీనం చేస్తారన్నారు.  కాంట్రాక్టులు, కొనుగోళ్ల పేర కోట్లలో  దోచుకున్న  టీఆర్ఎస్ కావాలా?, అవినీతిపరుల ఆటకట్టించే  బీజేపీ కావాలో సెస్​ ఓటర్లు తేల్చుకోవాలన్నారు. సెస్​ ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం ఆయన ‘వెలుగు’ తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఇంటర్వ్యూ విశేషాలు ఆయన మాటల్లోనే.. 
బీఆర్​ఎస్ ​నేతలను ఓటమి భయం వెంటాడుతోంది..
కేసీఆర్ కుటుంబానికి అహంకారం తలకెక్కింది.  తెలంగాణ ప్రజలు  ఇచ్చిన సీఎం పదవినే ఎడమకాలి చెప్పు తో సమానమంటూ కేసీఆర్​ కుటుంబం  అగౌరవపర్చింది.  సెస్ లాంటి చిన్న ఎన్నికల్లో స్టేట్​ ప్రెసిడెంట్​ ప్రచారం చేయడం ఏమిటని టీఆర్​ఎస్​ నాయకులు అనడంలోనే  ఈ ఎన్నికలంటే వాళ్లకెంత చిన్న చూపు ఉందో  అర్థమవుతోంది. వాళ్ల మాటలను బట్టి  వారెంత  అభద్రతతో  ఉన్నారో,   ఓటమి భయం ఎంతగా వెంటాడుతుందో తెలుస్తోంది. 

అప్పులపాలు చేసిన్రు..

గతంలో లాభాల్లో ఉన్న  సెస్  రూ.450 కోట్ల  అప్పుల్లో మునిగిపోవడానికి  కేసీఆర్ కుటుంబమే కారణం.  ఇన్నాళ్లు అధికారంలో ఉన్నది, సెస్ లో పెత్తనం చెలాయించింది  టీఆర్ఎస్​వాళ్లే.  వారివల్లే  సెస్  దివాళా తీసింది.   సెస్ కు ప్రభుత్వ శాఖలే  రూ.160 కోట్ల బకాయిలున్నాయి.  పవర్ లూం కరెంట్ సబ్సిడీ ఫండ్స్​ రూ.40 కోట్లు, ఎస్సీ, ఎస్టీ ల సబ్సిడీలు రూ.3.3 కోట్లు సర్కారు ఇవ్వలేదు.  సకాలంలో బిల్లులు కట్టకపోవడంతో   డిస్కంలు సర్ ఛార్జీ పేరిట  రూ.250 కోట్ల మేరకు  సెస్ పై భారం మోపాయి.  'సెస్'  దివాళా వెనుక టీఆర్​ఎస్​ కుట్ర ఉంది.  కుక్కను చంపాలంటే పిచ్చిదన్న ముద్ర వేసినట్టు సెస్​ను అప్పుల్లో ముంచి నష్టాల పేర ట్రాన్స్​కోలో విలీనం చేయాలని ప్రభుత్వం అనుకుంటోంది.  నేరుగా  కలిపేస్తే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తదని ఇదంతా చేస్తున్నరు.  

బీఆర్ఎస్​ నేతల వల్లే  అవినీతిలో ఇరుక్కుంది..

రైతుల భాగస్వామ్యంతో ఏర్పడ్డ ''సెస్'' ను టీఆర్ఎస్  కాంట్రాక్టర్లపాలు  చేసింది. కాంట్రాక్టర్లకు ఎక్కువ రేట్లు ఇస్తూ కోట్లు దండుకుంటున్నరు. టీఆర్ఎస్ వచ్చిన తర్వాతే  సెస్​ అవినీతిలో ఇరుక్కుంది.   రూ.33 కోట్ల అవినీతి జరిగినట్టు  ప్రభుత్వం నియమించిన రిటైర్డ్ ఛీఫ్ ఇంజనీర్ క్రిష్ణయ్య కమిటీ నివేదిక ఇచ్చినా ఇంతవరకు చర్యలు తీసుకోలేదు. కమీషన్లు ఎక్కడికెళ్లాయన్న సంగతి బయటపడి..   కేసీఆర్ కుటుంబం మెడకు చుట్టుకుంటదనే భయంతోనే చర్యలు తీసుకోవడం లేదు. రూ.33 కోట్ల  స్కాం చేసిన పెద్ద మనిషినే టీఆర్ఎస్ మళ్లీ  ఎన్నికల్లో నిలబెట్టి ప్రచారం చేస్తోంది.  

ఆశయాలకు తూట్లు.. 

ఉన్నతాశయంతో సెస్ ను నెలకొల్పి  లాభాల్లో నడిపించిన వాళ్లు  చెన్నమనేని రాజేశ్వరరావు, తంగళ్లపల్లి నర్సింగరావు. రాజేశ్వరరావు కొడుకు టీఆర్​ఎస్​లో ఉన్నా ఆయన చేసిన మంచి పనిని అభినందించాల్సిందే.  కేసీఆర్ పాలనలో సెస్ దుస్థితిని చూసి వాళ్ల ఆత్మలు క్షోభిస్తున్నాయి. తండ్రి నెలకొల్పిన సంస్థను దివాళా తీయించిన నేతలకు ఆయన కొడుకు రమేశ్​ కొమ్ముకాయడాన్ని ప్రజలు గమనించాలి.  

పైసల్తో గెలవాలని చూస్తున్నరు..

కేసీఆర్​ అవినీతి పాలనను జనం అసహ్యించుకుంటున్నారు. అయినా..   డబ్బులతో  మభ్యపెట్టి ఓటేయించుకుని టీఆర్ఎస్ నేతలు చూస్తున్నారు. దుబ్బాక, హుజూరాబాద్, జీహెచ్ఎంసీ, మునుగోడు ఎన్నికల్లో డబ్బులెట్ల నీళ్ళలా  ఖర్చు పెట్టారో అందరికీ తెలుసు. సెస్ ఎన్నికల్లో  గెలిచేందుకు కూడా  ఓటుకు రూ. 5 వేల నుంచి  రూ.10 వేలిస్తున్నరు. మంత్రులను, ఎమ్మెల్యేలను ఇంఛార్జీగా పెట్టి అక్రమాలు చేసైనా సరే గెలవాలని చూస్తున్నరు. సెస్ ఓటర్లు  ఓటనే ఆయుధంతో టీఆర్ఎస్ చెంప చెళ్లుమన్పించడం ఖాయం.

రూ.8 వేల కోట్లు తెచ్చా.. 

నేను కరీంనగర్​ఎంపీగా ఎన్నికై  మూడేళ్లయ్యింది.  ఇందులో ఏడాది  కరోనా కాలమే. అయినా  మూడేళ్లలో  నియోజకవర్గ అభివృద్ధికి ఏకంగా రూ.8 వేల కోట్లు  తీసుకొచ్చాను. కరీంనగర్ లో  5వ విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభలో  వివరాలన్నీ లెక్కలతో  సహా వివరించాం. అయినా టీఆర్​ఎస్​ వాళ్లు కరీంనగర్​కు సంజయ్​ ఏం చేయలేదని సిగ్గు లేకుండా  బద్నాం చేస్తున్నరు.   వేములవాడ, కొండగట్టులకు  కేంద్రం నుంచి నిధులు తెస్తానని,   ప్రసాదం స్కీం కింద ప్రతిపాదనలు పంపాలని కోరినా మూడేళ్లుగా  స్టేట్​ గవర్నమెంట్​ స్పందించలేదు. రాష్ట్రం నుంచి ప్రతిపాదనలు లేకుండా కేంద్రం నేరుగా నిధులు విడుదల చేసే అవకాశం లేదు. ఈ అలయాలు  అభివృద్ధి అయితే  బీజేపీకి పేరొస్తుందనే  ప్రపోజల్స్​ ఇస్తలేదు.  వేములవాడకు ఏటా రూ.100 కోట్ల చొప్పున రూ. 400 కోట్లు కేటాయిస్తానని కేసీఆర్​ చెప్పి ఏడేళ్లయినా  నయా పైసా ఇయ్యలే. కొండగట్టు, ధర్మపురి, బాసర సరస్వతి ఆలయాలకు వంద కోట్లు చొప్పున నిధులిస్తానన్న హామీలు గాలికొదిలేసిండు. ఇచ్చిన మాట తప్పి దేవుళ్లకే శఠగోపం పెట్టిన కేసీఆర్ కు ప్రజలను మోసం చేయడం ఓ లెక్కా. 

అవినీతిపరులను వదిలిపెట్టం..

కరెంట్ లేని పేదలకు కేంద్రం రూ.125 లకే కరెంట్ కనెక్షన్లు ఇస్తోంది. ఒక్క  సెస్ పరిధిలో 5,200 మంది నిరుపేదలకు  కనెక్షన్లు ఇచ్చిన ఘనత  మోదీ సర్కారుది.  బీజేపీ బలపర్చిన అభ్యర్థులను గెలిపిస్తే   కేంద్రం నుంచి పెద్ద ఎత్తున గ్రాంట్లు  తీసుకొచ్చేందుకు కృషి చేస్తాం. అంతేగాదు.. ఎప్పుడు ఎన్నికలు జరిగినా రాష్ట్రంలో వచ్చేది  బీజేపీ ప్రభుత్వమేనని రాసి పెట్టుకోండి. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉంటాం కాబట్టి  సెస్ కు పెద్ద ఎత్తున నిధులు తెస్తాం.  బీజేపీ  గెలిస్తే  సెస్ లో అవినీతికి పాల్పడిన వాళ్లను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. వారిని జైలుకు పంపుతాం. అవినీతి సొమ్మును రికవరీ చేస్తాం.  చెన్నమనేని రాజేశ్వరరావు, నర్సింగరావు ఆశయాలకు అనుగుణంగా సెస్ లో నిజాయితీతో కూడిన నీతివంతమైన పాలనను అందిస్తాం.