దాటాలంటే దడ దడే..రోడ్లపై డేంజరస్​గా రంబుల్ స్ట్రిప్స్

దాటాలంటే దడ దడే..రోడ్లపై డేంజరస్​గా రంబుల్ స్ట్రిప్స్
  • ఫ్లై ఓవర్లపై, మెయిన్​రోడ్లపై ఇంచు ఎత్తులో ఏర్పాటు  
  • సెకన్ల పాటు కదిలిపోతున్న వెన్నుపూస 
  • మెడ, నడుము నొప్పులు.. వాహనాలు ఖరాబ్​ 
  • గర్భిణులు,  దివ్యాంగులకు ఇబ్బందులు
  • తొలగించాలని ‘ఎక్స్’​లో మంత్రులు, బల్దియాకు విజ్ఞప్తులు

హైదరాబాద్ సిటీ, వెలుగు: సిటీలోని ఫ్లై ఓవర్లు, మెయిన్​ రోడ్లపై ఏర్పాటు చేసిన రంబుల్ స్ట్రిప్స్ ప్రమాదకరంగా తయారయ్యాయి. స్పీడ్ బ్రేకర్ల మాదిరిగా ఉండడంతో టూ వీలర్ తో పాటు ఫోర్ వీలర్లలో ప్రయాణించేవారు కూడా ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు ఇంచు, ఆ పై ఎత్తు ఉండడంతో బండిని ఎంత స్లో చేసినా రంబుల్​స్ట్రిప్స్​ దాటేప్పుడు బాడీ మొత్తం షేక్​ అయిపోతోంది. ముఖ్యంగా గర్భిణులు, దివ్యాంగులు ఎక్కువ సమస్యలు ఎదుర్కొంటున్నారు.

కొన్ని స్కూటర్లు, బైక్​లు స్కిడ్ అవుతున్నాయి. బండ్లు, కార్ల సస్పెన్షన్లు ఖరాబై వాటి రిపేర్లకు రూ. వేలు ఖర్చు పెట్టాల్సి వస్తున్నది. రెండేండ్ల కింద భారీగా ఫిర్యాదులు రావడంతో రంబుల్ స్ట్రిప్స్ తొలగించాలని బల్దియా నిర్ణయం తీసుకున్నా రెండు, మూడుచోట్ల తొలగించి తర్వాత సైలెన్స్​అయిపోయింది. కనీసం ఎక్కువ ఎత్తున్నచోట తగ్గించేందుకు కూడా ముందుకు రావడం లేదు. ఆ సమస్య అలా కంటిన్యూ అవుతుండడంతో మళ్లీ జనాలు అధికారులకు, మంత్రులకు ఫిర్యాదులు చేస్తున్నారు.

సోషల్​మీడియా ఫ్లాట్​ఫాం ఎక్స్​లో తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. కొన్ని సెకన్ల పాటు వెన్నుపూస కదిలిపోతోందని, నడుం నొప్పులతో దవాఖానల పాలవుతున్నామని, సమస్యకి పరిష్కారం చూపాలంటూ మంత్రులు, బల్దియాకు మొర పెట్టుకుంటున్నారు.  రంబుల్ స్ట్రిప్స్ తొలగించేలా బల్దియా అధికారులకు స్పష్టమైన ఆదేశాలివ్వాలని కోరుతున్నారు. 

రూల్స్​కు విరుద్ధంగా.... 

రంబుల్​ స్ట్రిప్స్​ను  స్లీపర్ లైన్లు లేదా అలర్ట్ స్ట్రిప్స్ అంటారు.  ఉదయం లేదా రాత్రి వేళల్లో నిద్ర మత్తులో, పరధ్యానంగా ఉన్నప్పుడు ఆ లైన్స్​మనల్ని అప్రమత్తం చేస్తాయి. వేగం కూడా తగ్గుతుంది. ఉద్దేశం మంచిదే అయినా ఇంచు ఎత్తులో, ఎక్కువ మందంతో ఏర్పాటు చేయడం వల్ల రంబుల్​స్ట్రిప్స్​దాటినప్పుడల్లా ‘దడ’ పుడుతోంది. ఇండియన్ రోడ్ కాంగ్రెస్(ఐఆర్సీ) రూల్స్​ప్రకారం రంబుల్ స్ట్రిప్స్ మందం 5 మిల్లీ మీటర్లు ఉండాలి. స్ట్రిప్స్ ను రెండు లేయర్లుగా 5 మిల్లీ మీటర్ల మందం, 5 మిల్లీమీటర్ల ఎత్తులో, 200 మిల్లీ మీటర్ల వెడల్పులో నిర్మించాలి.

అయితే, సిటీలో కొన్ని చోట్ల10 నుంచి15 మిల్లీ మీటర్లు, అంతకంటే ఎక్కువ మందంతో ఏర్పాటు చేశారు. ఒక్కో స్ట్రిప్ మధ్య తగిన గ్యాప్ తో ఆరు స్ట్రిప్ లు ఉండాలి కానీ, అసలు గ్యాప్ కూడా లేకుండా అడ్డదిడ్డంగా నిర్మిస్తున్నారు. దీంతో వాహనదారులకు స్పాండిలైటిస్, వెన్ను నొప్పి వంటి సమస్యలు వస్తున్నాయి. బల్జ్​ఉన్నవాళ్లనైతే డాక్టర్లు ఈ రోడ్ల మీద టూవీలర్లను నడుపుతూ వెళ్లవద్దని, ఫోర్​వీలర్​వాడాలని సూచిస్తున్నారు. అయితే, రంబుల్​స్ట్రిప్స్​వల్ల కార్లలో వెళ్లినా సమస్య ఇంకా ఎక్కువవుతోంది.  ముఖ్యంగా ప్రెగ్నెంట్​లేడీస్​కు ఇబ్బంది  కలిగే అవకాశం ఉంటుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. 

ఎందుకు ఏర్పాటు చేశారంటే..

ఐదేండ్ల కింద బయో డైవర్సిటీ ఫ్లై ఓవర్​పై వేగంగా దూసుకువచ్చిన ఓ కారు అదుపు తప్పి కింద పడడంతో ఓ మహిళ చనిపోయింది. రాయదుర్గం నుంచి హైటెక్ సిటీ వెళ్లే ఫ్లై ఓవర్​ఓపెన్ చేసిన కొన్నాళ్లకే ఈ ప్రమాదం జరగడంతో ప్రమాదాలను తగ్గించేందుకు బల్దియా మెయిన్​రోడ్లు, ఫ్లై ఓవర్లపై రంబుల్ స్ట్రిప్స్ వేయడం మొదలుపెట్టింది. అయితే, ఇవి అనారోగ్య సమస్యలకు కారణమవుతున్నాయి.

సిటీలో డేంజర్ స్పాట్స్ ఇవే...

ప్రస్తుతం అంబర్ పేట్, హైటెక్ సిటీ ఐకియా, గచ్చిబౌలి హైటెక్ సిటీ ఫ్లైఓవర్, హైటెక్ సిటీ నుంచి జేఎన్టీయూ వెళ్లే రూట్ ఫ్లైఓవర్లపై, ఎల్బీనగర్, లంగర్ హౌస్ ఫ్లైఓవర్ ముందు, నాగోల్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, నేరెడ్ మెట్ తదితర ప్రాంతాల్లో  రంబుల్ స్ట్రిప్స్ ప్రమాదకరంగా ఉన్నాయి. ఇక్కడ వాహనాన్ని స్లో చేసినా దడ దడ తప్పడం లేదు.

కొన్ని ఫ్లై ఓవర్లపై ఏర్పాటు చేసిన రంబుల్ స్ట్రిప్స్ పై నుంచి కార్లు దాటి ముందుకు పోగానే కాస్త  సైడ్​కు వెళ్తున్నాయి. రోడ్డు యాక్సిడెంట్స్​జరిగే అవకాశమున్న మూల మలుపులు, జంక్షన్లు, యూ టర్న్స్​దగ్గర మాత్రమే రంబుల్​స్ట్రిప్స్​వేయాల్సి ఉన్నా ఎక్కడ పడితే అక్కడ ఇష్టమున్నట్టు వేశారు.