- నాటకీయ పరిణామాల నడుమ రాష్ట్రంలో అడుగుపెట్టిన ఏనుగు
- బోనాల ఊరేగింపులోనూ పాల్గొననున్న రూపవతి
రూపవతి.. బుధవారం హైదరాబాద్లో జరిగిన మొహర్రం వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఏనుగు పేరు ఇది. ఇదే ఏనుగు త్వరలో బోనాల వేడుకల్లోనూ పాల్గొననుంది. కర్నాటక నుంచి తెచ్చిన ఈ రూపవతి నాటకీయ పరిణామాల నడుమ రాష్ట్రంలో అడుగుపెట్టింది. మొహర్రం, బోనాల ఉత్సవాల్లో ఊరేగింపు కోసం ఏనుగును పంపించాలని కర్ణాటక ప్రభుత్వాన్ని తెలంగాణ దేవాదాయ మంత్రి కొండా సురేఖ కోరారు.
స్పందించిన కర్ణాటక ప్రభుత్వం అక్కడి దావణగెరెలోని శ్రీజగద్గురు పంచాచార్య మందిర్ ట్రస్ట్ నుంచి ఏనుగును పంపేందుకు ఏర్పాట్లు చేసింది. అయితే 34 ఏండ్ల వయస్సున్న రూపవతి అనారోగ్య సమస్యలతో బాధపడుతోందని, అలాంటి ఏనుగును ఊరేగింపులకు ఎలా పంపుతారని ‘పీపుల్ఫర్ ఎథికల్ ట్రీట్ మెంట్ ఆఫ్ యానిమల్స్(పెటా) కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేసింది. అప్పటికే రూపవతిని ప్రత్యేక వాహనంలో కర్ణాటక నుంచి తెలంగాణ బార్డర్కు తీసుకువచ్చారు.
ఇంతలోనే రూపవతి తరలింపును ఆపాలంటూ కేంద్రం గత శుక్రవారం కర్నాటక ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఏనుగు ఆరోగ్య పరిస్థితిపై ఏర్పాటు చేసిన హైపవర్ కమిటీ క్లియరెన్స్ ఇచ్చేదాకా ఎక్కడికీ తీసుకెళ్లొద్దని తేల్చి చెప్పింది. దీంతో రూపవతి ఆ రోజంతా రెండు రాష్ట్రాల సరిహద్దుల్లోనే ఉండిపోయింది. కాగా, గత శనివారం హైపవర్కమిటీ నిర్వహించిన వైద్య పరీక్షల్లో రూపవతి పాస్కావడంతో మన రాష్ట్రానికి తీసుకెళ్లేందుకు కేంద్రం నుంచి అనుమతి లభించింది.
అలా ఆదివారం తెల్లవారుజామున హైదరాబాద్చేరుకుంది. సిటీలోని నెహ్రూ జూపార్క్ డాక్టర్లు, తెలంగాణ పశుసంవర్థక శాఖకు చెందిన డాక్టర్లు మరోసారి రూపవతికి వైద్య పరీక్షలు చేసి, క్లీన్చిట్ ఇవ్వగా సోమవారం బందోబస్తు మధ్య ఏనుగుతో రిహార్సల్స్ నిర్వహించారు. బుధవారం మొహర్రం ఊరేగింపులో పాల్గొన్న రూపవతి, బోనాల ఊరేగింపులోనూ పాల్గొనేందుకు సంసిద్ధంగా ఉంది.