- రెండూ ఆల్‌టైమ్ రికార్డే.. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ నిర్ణయాలే కారణం
- రూపాయి పతనంతో నిత్యావసరాలపై ఎఫెక్ట్.. లగ్గాలపై బంగారం రేట్ల ప్రభావం
- డాలర్‌తో రూపాయి మారకం విలువ 87.39
- 24 క్యారెట్ల గోల్డ్ రేటు 10 గ్రాములకు 86,240
హైదరాబాద్, వెలుగు: అమెరికా అధ్యక్షుడిగా గెలిచిన డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలతో మన దేశంలోని సామాన్యులందరిపై ప్రభావం పడ్తున్నది. ఇటీవల ట్రంప్ తీసుకున్న పలు నిర్ణయాలతో డాలర్ క్రమంగాబలపడుతున్నది. విదేశీ ఇన్వెస్టర్లు ఇండియా నుంచి వేల కోట్లను యూఎస్‌కు తరలించుకుపోతుండడంతో మన స్టాక్‌మార్కెట్లు కుదేలవుతున్నాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ క్రమంగా పతనమై.. మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువుల రేట్లు పెరుగుతున్నాయి.
ముఖ్యంగా చమురు ధరలు పెరగడం వల్ల నిత్యావసరాల రేట్లు పైకి ఎగబాకుతున్నాయి. ఇలాంటి గందరగోళ పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు గోల్డ్ వైపు చూస్తుండడంతో వాటి రేట్లు సైతం పెరుగుతున్నాయి. అసలే మాఘమాసం కావడంతో తెలుగు రాష్ట్రాల్లో మార్చి 26 దాకా లక్షలాది లగ్గాలు జరగనున్నాయి. దీంతో పెరిగిన బంగారం రేట్లను చూసి ఆడపిల్లల తల్లిదండ్రులు లబోదిబోమంటున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే త్వరలోనే డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.100కు, గోల్డ్రేట్రూ.లక్షకు చేరుతుందని.. దీని వల్ల మనదేశంలోని సామాన్యులపై మరింత భారం తప్పదని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు.
నెలలోనే 8వేలకు పైగా పెరిగిన బంగారం..
బంగారం ధరలు చుక్కలు చూపుతున్నాయి. హైదరాబాద్ లో మంగళవారంతో పోలిస్తే బుధవారం 24 క్యారెట్ల గోల్డ్ రేటు 10గ్రాములపై రూ.1,040 పెరిగి రూ.86,240కి, 22 క్యారెట్ల బంగారం ధర రూ.950 పెరిగి రూ.78,100కి చేరింది. వెండి ధర కిలోపై రూ.వెయ్యి పెరిగి రూ. లక్షా7వేలుగా నమోదైంది. ఎన్నడూ లేని విధంగా రూ.86 వేలు దాటిన బంగారం ధరలను చూసి అందరూ షాక్ కు గురవుతున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో జనవరి 1న 24 క్యారెట్ల బంగారం రూ.78వేలు, 22 క్యారెట్ల బంగారం రూ.71,500 పలికింది.
నెల వ్యవధిలోనే బంగారం ధర రూ.8వేలకు పైగా పెరగడం గమనార్హం. అమెరికాలో ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక యూఎస్ డాలర్ బలపడ్తున్నది. విదేశీ ఇన్వెస్టర్లు ఇండియాలో తమ పెట్టుబడులను ఉపసంహరించుకుంటుండడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల బాటలో పయనిస్తున్నాయి.
ఫలితంగా దేశీయ ఇన్వెస్టర్లు బంగారంపై పెట్టుబడులు పెడ్తుండడం వల్లే గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. మున్ముందు 10 గ్రాముల బంగారం ధర రూ.లక్ష దాటడం ఖాయమని అంచనా వేస్తున్నారు. పెళ్లిళ్ల సమయంలో బంగారం రేట్లు అనూహ్యంగా పెరగడంతో సామాన్యులు తిప్పలు పడ్తున్నారు. నిజానికి జనవరి 30న మాఘమాసం ప్రారంభమైంది. ఫిబ్రవరి 2 నుంచి మార్చి 26 వరకు మంచి ముహూర్తాలు ఉన్నాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది పెళ్లిళ్లు, గృహప్రవేశాలు జరగనున్నాయి. తెలుగిండ్లలో బంగారం లేకుండా పెళ్లిళ్లు జరగవంటే అతిశయోక్తి కాదు. ఆయా కుటుంబాలు తాహతును బట్టి పెళ్లి కూతుర్లకు, ఆడపడుచులకు తులాల కొద్దీ బంగారు ఆభరణాలు కొనడం ఆనవాయితీ. కానీ పెరిగిన గోల్డ్ రేట్లతో వధువుల తల్లిదండ్రులు బెంబేలెత్తుతున్నారు.
పతనమవుతున్న రూపాయి.. నిత్యావసరాలపై ఎఫెక్ట్
డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ రోజురోజుకూ పతనమవుతున్నది. ఇటీవలి కాలంలో వేగంగా పడిపోతున్న రూపాయి మారకం విలువ ఫిబ్రవరి 5న (బుధవారం) 87.38 ఆల్ టైమ్ కనిష్టానికి చేరింది. గతేడాది నవంబర్6న అమెరికా ఎన్నికల్లో ట్రంప్విజయం సాధించడంతో డాలర్ బలపడ్తూ వస్తున్నది. ఇది రూపాయి విలువపై ప్రభావం చూపుతున్నది. నవంబర్ 5న డాలర్‌తో పోలిస్తే రూ.84.16 గా ఉన్న రూపాయి విలువ క్రమంగా తగ్గుతూ డిసెంబర్19న 85 మార్క్ చేరింది.
ట్రంప్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించాక దూకుడుగా తీసుకుంటున్న పలు నిర్ణయాలతో కేవలం నెలన్నర వ్యవధిలో డాలర్విలువ 2 రూపాయల మేర పెరిగింది. ఇటీవల ట్రంప్.. కెనడా, మెక్సికో దేశాల వస్తువులపై 25 శాతం, చైనా వస్తువులపై 10 శాతం దిగుమతి సుంకం విధించారు. దీంతో అంతర్జాతీయంగా సంక్షోభ పరిస్థితులు నెలకొని డాలర్ బలపడుతుండగా, డాలర్‌పైనే ఎక్కువగా ఆధారపడి ఉన్న ఆసియా కరెన్సీలు పతనం అవుతున్నట్లు ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు.
మరీ ముఖ్యంగా అమెరికా ఆర్థిక వ్యవస్థ రాణిస్తుండడం, అక్కడ బాండ్లపై మంచి రిటర్న్స్వస్తుండటంతో మన దగ్గర విదేశీ పెట్టుబడులు వెనక్కి వెళ్తున్నాయి. మన స్టాక్ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్లు జనవరి నుంచి ఇప్పటివరకు రూ.68,441 కోట్లకు పైగా వెనక్కి పట్టుకుపోయారు. దీని వల్ల స్టాక్ మార్కెట్లు కుదేలవుతూ లక్షల కోట్ల మేర ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోతోంది.
డాలర్లకు డిమాండ్ పెరిగి, రూపాయి బలహీనపడుతోంది. ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు పెరిగిపోతున్నాయి. దీంతో దిగుమతులు ఖరీదవుతున్నాయి. మరోపక్క ద్రవ్యోల్బణం పెరగడంతో కార్పొరేట్ సంస్థల ఆదాయాలు, లాభాలు తగ్గుతున్నాయి. ఆర్థిక కార్యకలాపాలు మందగించి, ఉద్యోగాల్లో కోత, సరకుల సరఫరా తగ్గడం వంటి సవాళ్లు ఎదురవుతున్నాయి. అటు విదేశాల్లో చదువుతున్న విద్యార్థులకు ఫీజులు, ఖర్చుల మొత్తం పెరిగి తల్లిదండ్రులు తల పట్టుకుంటున్నారు. ద్రవ్యోల్బణం పెరగడం, ప్రజల కొనుగోలు శక్తి క్షీణించడంతో మున్ముందు నిత్యావసరాల ధరలు మరింత పెరుగుతాయనే భయాందోళన వ్యక్తమవుతోంది.
డాలర్‌తో రూపాయి మారకం విలువ
డిసెంబర్19: 85.10
జనవరి 10: 86.19
ఫిబ్రవరి 4: 87.11
ఈ నెల 5న బంగారం రేట్లు ఇలా(10 గ్రాములకు)
24 క్యారెట్లు - రూ.86,240
22 క్యారెట్లు రూ.79,050
గత పది రోజుల్లో బంగారం రేట్లు(10 గ్రాములకు రూ.ల్లో)
తేదీ 22 క్యారెట్లు 24 క్యారెట్లు
ఫిబ్రవరి 5 79,050 86,240
ఫిబ్రవరి 4 78,100 85,200
ఫిబ్రవరి 3 77,050 84,050
ఫిబ్రవరి 2 77,450 84,490
ఫిబ్రవరి 1 77,450 84,490
జనవరి 31 77,300 84,330
జనవరి 30 76,100 83,020
జనవరి 29 75,950 82,850
జనవరి 28 75,100 81,930
జనవరి 27 75,400 82,250