న్యూఢిల్లీ: రూపాయి విలువ శుక్ర వారం దారుణంగా పడిపోయింది. ఏకంగా 7 నెలల కనిష్ట స్థాయి 85.8075కి చేరింది. ఈ ఏడాది జూన్ తరువాత రూపాయి ఇంతలా పతనం కావడం ఇదే మొదటిసారి. అయితే ఆర్బీఐ జోక్యం చేసుకొని బ్యాంకుల ద్వారా డాలర్లను అమ్మకానికి పెట్టడంతో కొంత కోలుకుంది. గత అక్టోబరులోనూ ఆర్బీఐ 9.3 బిలియన్ డాలర్లు అమ్మింది. ఈ నెలలో ఇప్పటి వరకు రూపాయి 1.3 శాతం నష్టపోయింది.
డాలర్ విపరీతంగా బలపడుతుండటంతో రూపాయి వరుసగా ఎనిమిది వారాలుగా బలహీనపడుతూనే ఉంది. దీనికితోడు జీడీపీ వృద్ధి నెమ్మదించడం, వాణిజ్య లోటు పెరగడం రూపాయికి ఇబ్బందులను పెంచుతున్నది. యూఎస్ ఫెడ్ నిర్ణ యాలు, అమెరికా కొత్త అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నిర్ణయాలతో డాలర్ రోజురోజూ బలపడుతున్నది. ఆరు మేజర్ కరెన్సీలను డాలర్‌తో పోల్చి చూసే డాలర్ ఇండెక్స్ గురువారం 108.15 స్థాయికి చేరింది. డాలర్ పెరుగుతూనే ఉండటంతో దిగుమతి దారులు పెద్ద ఎత్తున డాలర్లను కొని నిల్వ చేసుకుంటున్నారు. త్వరలోనే డాలర్లో రూపాయి మారకం విలువ 86 స్థాయికి చేరుకోవచ్చని ఆర్థిక నిపుణులు అంటున్నారు.