
చెన్నై: నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అంశంపై కేంద్రం, స్టాలిన్ సర్కార్ మధ్య వివాదం రోజు రోజుకు ముదురుతున్నది. తాజాగా తమిళనాడు బడ్జెట్ 2025–26 పత్రాల్లో రూపీ(₹) సింబల్‌ను స్టాలిన్ సర్కార్ తొలగించింది. ఆ స్థానంలో తమిళనాడులో 'రూ' అనే అర్థం వచ్చే అక్షరాన్ని చేర్చింది. గతంలో తమిళనాడు బడ్జెట్ పత్రాల్లో '₹'లోగోనే ఉండేది. కానీ, ప్రస్తుతం హిందీ వివాదం నేపథ్యంలో సీఎం స్టాలిన్ గురువారం 'ఎక్స్' వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. అందరికీ అన్నీ అనే క్యాప్షన్‌తో.. ఇందుకు సంబంధించిన వీడియోను షేర్ చేశారు. అయితే, తమిళ భాషను ప్రోత్సహించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు డీఎంకే సమర్థించుకుంది.
ఈ మార్పుపై ఇప్పటివరకు తమిళనాడు ప్రభుత్వం నుంచి మాత్రం ఎటువంటి అధికారిక ఉత్తర్వులు రాలేదు. కాగా, రూపాయి సింబల్‌ను 2010లో అప్పటి యూపీఏ ప్రభుత్వం తెచ్చిందని, అప్పుడెందుకు దానిని డీఎంకే వ్యతిరేకించలేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్, తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై ప్రశ్నించారు. ఆ సింబల్ రూపొందించిన వ్యక్తి డీఎంకే మాజీ ఎమ్మెల్యే కొడుకేనని, ఇప్పుడు దానిని పక్కనపెట్టడం వల్ల జాతీయ గుర్తును తిరస్కరించడమే కాకుండా, తమిళ యువకుడి క్రియేటివిటీని కూడా స్టాలిన్ సర్కారు అవమానించిందని ఫైర్ అయ్యారు.