- పిల్లల ఎదుగుదలకు పల్లెలే బెటర్
- సిటీల్లో వెనకబడుతున్న చిన్నారులు
- టౌన్ లలో ప్రతికూల పరిస్థితులు
- ఆరోగ్యకరమైన వాతావరణం లేకపోవడమే కారణం
- 1990 నుంచి వేగంగా మారిన పరిస్థితులు
- ఎన్ఐఎన్, ఐసీఎంఆర్ స్టడీలో వెల్లడి
పిల్లల ఎదుగుదలకు పల్లెలే బెటర్ అని.. సిటీల్లో హెల్తీ అట్మాస్పియర్ ఉండడం లేదని, 5 నుంచి 19 ఏండ్ల వారి డెవలప్మెంట్కు ప్రతికూల పరిస్థితులు ఉన్నాయని ఐసీఎంఆర్‌తో కలిసి ఎన్ఐఎన్ నిర్వహించిన స్టడీలో తేలింది.
సికింద్రాబాద్, వెలుగు: పిల్లల ఎదుగుదలకు సిటీల కంటే పల్లెలే బెటర్ అని హైదరాబాద్ లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్(ఎన్ఐఎన్) అధ్యయనంలో వెల్లడైంది. సిటీల్లో పిల్లలకు మంచి చదువులతో పాటు అన్ని సౌలతులు ఉంటాయని, వారు అన్ని రకాలుగా ఎదిగేందుకు అవకాశం ఉంటుందని అందరూ పల్లెల నుంచి పట్నం బాట పడుతున్నారు. కానీ ఇప్పుడు సిటీలు, టౌన్లలోని పిల్లల కంటే పల్లెల్లో ఉంటున్న పిల్లలే వయసుకు తగ్గ ఎత్తు, బరువుతో మంచిగా ఎదుగుతున్నారని తేలింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సిటీల్లో పిల్లలు ఎదిగేందుకు ఆరోగ్యకరమైన వాతావరణం ఉండటం లేదని, ముఖ్యంగా 5 ఏండ్ల నుంచి 19 ఏండ్ల మధ్య ఉన్న పిల్లల పెరుగుదల, అభివృద్ధికి ప్రతికూల పరిస్థితులు ఉన్నాయని ఈ మేరకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్), ఇతర సంస్థలతో కలిసి తార్నాకలోని ఎన్ఐఎన్ నిర్వహించిన అధ్యయనంలో స్పష్టమైంది.
పరిస్థితులు మారినయ్
కొన్ని దశాబ్దాల కిందట గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణాలే పిల్లల ఎదుగుదలకు చాలా అనుకూలంగా ఉండేవి. కానీ 1990 తర్వాత ఈ పరిస్థితులు వేగంగా మారుతూ వచ్చాయని సైంటిస్టులు గుర్తించారు. 1990వ దశకంలో నగరాల్లో నివసించే పిల్లలు గ్రామీణ ప్రాంతాల పిల్లల కంటే ఎత్తుగా, తగినంత బరువు (బాడీ మాస్ ఇండెక్స్–బీఎంఐ)తో ఉండేవారు. కానీ ఆ తర్వాత పట్టణాల్లోని పిల్లల ఎదుగుదలపై ప్రతికూల ప్రభావం పడటం మొదలైందని.. ఎత్తు సరిగ్గా పెరగకపోవడం, బరువు వయసుకు తగ్గట్టుగా లేకపోవడం వంటివి నమోదయ్యాయని స్టడీలో తేలింది.
ALSO READ :మణిపూర్ అల్లర్ల వెనుక బీజేపీ కుట్ర
ఈ స్టడీలో భాగంగా1990 నుంచి 2020 మధ్య పల్లెలు, నగరాల్లోని పిల్లల అభివృద్ధి, వారి ఎదుగుదల పరిస్థితులపై అధ్యయనం చేశారు. పదేండ్ల డేటాను విశ్లేషించిన తర్వాత పట్టణాల్లో పిల్లల ఎదుగుదలకు ఆరోగ్యకర వాతావరణం క్షీణిస్తోందని నిర్ధారణకు వచ్చారు. పిల్లల్లో సరైన ఎదుగుదల లేకపోతే ఆరోగ్య పరంగా, చదువు పరంగా అనేక సమస్యలు వస్తాయని, పిల్లల ఎదుగుదలకు సరైన చర్యలు తీసుకుని ఈ సమస్యలను నివారించేందుకు తమ అధ్యయన ఫలితాలు ఉపయోగపడతాయని సైంటిస్టులు పేర్కొన్నారు.