గ్రామీణాభివృద్ధికి అంతంతే.. ఉపాధి హామీకి పెరగని కేటాయింపులు

గ్రామీణాభివృద్ధికి అంతంతే.. ఉపాధి హామీకి పెరగని కేటాయింపులు

న్యూఢిల్లీ: గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖకు 2025–-26 కేంద్ర బడ్జెట్‌‌‌‌‌‌‌‌లో రూ.1.88 లక్షల కోట్లు కేటాయించారు. ఇది మునుపటి బడ్జెట్‌‌‌‌‌‌‌‌లో కేటాయించిన దానికంటే దాదాపు 5.75 శాతం ఎక్కువ. శనివారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన బడ్జెట్ ప్రతిపాదనల ప్రకారం.. ఈ శాఖకు 2024–-25 బడ్జెట్‌‌‌‌‌‌‌‌లో  రూ.1,77,566.19 కోట్లు కేటాయించారు. అయితే, ఆ మంత్రిత్వ శాఖ చేసిన వ్యయం మధ్యంతర సమీక్ష అయిన 2024–-25 సవరించిన అంచనా రూ.1,73,912.11 కోట్లుగా ఉంది. ఇది ప్రారంభ కేటాయింపు కంటే రూ.3,654.08 కోట్లు తక్కువ. 

అలాగే, ఉపాధి హామీ పథకానికి కేటాయింపులు గత సంవత్సరం మాదిరిగానే రూ.86 వేల కోట్లు కేటాయించారు. 2023–-24లో ఈ స్కీమ్​కు రూ. 60 వేల కోట్లు అలొకేట్​చేశారు. ఆ తర్వాత అదనపు నిధులు కేటాయించారు. వాస్తవ వ్యయం రూ.89,153.71 కోట్లుగా ఉంది. అయితే, 2024–-25లో అదనపు కేటాయింపులు జరగలేదు. ప్రతి కుటుంబంలో కనీసం ఒక సభ్యుడికి ఈ పథకం ద్వారా ఆర్థిక సంవత్సరంలో 100 రోజుల ఉపాధిని కల్పిస్తున్నట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ తెలిపారు. ఈ స్కీమ్​మహిళలకు కనీసం మూడింట ఒక వంతు ఉపాధిని అందిస్తోందని చెప్పారు. 

వలసలను తగ్గించడానికి, గ్రామీణ ప్రాంతాల్లో తగినంత ఉపాధి అవకాశాలను సృష్టించడం ఈ స్కీమ్​లక్ష్యమని తెలిపారు. గ్రామీణ మహిళలు, యువ రైతులు, గ్రామీణ యువత, సన్న చిన్న కారు రైతులు, భూమిలేని కుటుంబాలకు ఇది ఉపయోగకరంగా ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. అలాగే, గ్రామీణాభివృద్ధి మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కేంద్ర బడ్జెట్‌‌‌‌‌‌‌‌ను ప్రశంసించారు. ‘‘ఇది 140 కోట్ల మంది భారతీయుల బడ్జెట్. 

ఇది ఆత్మనిర్భర్ భారత్‌‌‌‌‌‌‌‌ను సృష్టించడానికి ఉద్దేశించిన బడ్జెట్. సమాజంలోని ప్రతి వర్గాన్ని జాగ్రత్తగా చూసుకున్నాము. పేదరికం లేని భారతదేశం కోసం, పేదరికం లేని గ్రామాలను సృష్టించడంపై ప్రభుత్వం దృష్టిపెట్టింది’’ అని చౌహాన్ పేర్కొన్నారు.