
- అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో రూ.17 కోట్ల కలెక్షన్
- అత్యల్పంగా నాగర్ కర్నూలు జిల్లాలో రూ.2 కోట్లు వసూలు
హైదరాబాద్, వెలుగు: గ్రామ పంచాయతీలకు ప్రధాన ఆదాయ వనరైన ఇంటి పన్నులను 100% వసూలు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే పన్ను వసూళ్లపై పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల డైరెక్టర్ సృజన అన్ని జిల్లాల డీపీవో, డీఎల్పీవోలకు దిశానిర్దేశం చేశారు. వంద శాతం పన్ను వసూలు చేయాలని ఆదేశించారు. దీంతో పంచాయతీ కార్యదర్శులు పన్నుల వసూల ప్రక్రియను వేగవంతం చేశారు.
అయితే, గత నెలలో ఇంటింటి సర్వే, కులగణన, గ్రామసభలు నిర్వహించడంతో పన్ను వసూలు కాస్త మందగించింది. మార్చి 31 డెడ్ లైన్ కావడంతో అధికారులు వేగంగా పనిచేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 12,626 పంచాయతీలు ఉండగా.. 2024–25 ఆర్థిక సంవత్సరంలో రూ.351.04 కోట్లు టార్గెట్ విధించారు. ఇందులో ఇప్పటి వరకు రూ.193.48 కోట్లు (60.92 శాతం) వసూలు చేశారు. ఇంకా రూ.157.56 కోట్లు రావాల్సి ఉన్నాయి. అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో రూ.17.10 కోట్లు వసూలు కాగా, అత్యల్పంగా నాగర్ కర్నూల్ జిల్లాలో రూ.2 కోట్లు వసూలయ్యాయి.
22 జిల్లాల్లో 60 శాతంపైగా వసూలు..
రాష్ట్రవ్యాప్తంగా అధికారులు 22 జిల్లాల్లో 60 శాతంపైగా పన్ను వసూలు చేశారు. నారాయణపేట, జోగుళాంబ గద్వాల, సిద్దిపేట, జనగామ జిల్లాల్లో 80 శాతం, వనపర్తి, హన్మకొండ, జగిత్యాల, మహబూబ్ నగర్, పెద్దపల్లి, నిర్మల్ జిల్లాల్లో 70 శాతం, మహబూబాబాద్, కొమ్రంభీం ఆసిఫాబాద్, యాదాద్రి భువనగిరి, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, ఆదిలాబాద్, మెదక్, ములుగు, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో 60 శాతం పన్నులు వసూలయ్యాయి.
అత్యల్పంగా సూర్యాపేట, నల్గొండ, నిజామాబాద్ జిల్లాలో 35 శాతంలోపు వసూలయ్యాయి. ఈ జిల్లాల్లో పన్ను వసూలు ప్రక్రియ మందగమనంలో ఉంది. ఇందులో సూర్యాపేట జిల్లాలో 457 పంచాయతీలు ఉండగా.. రూ.12.81 కోట్లు టార్గెట్ విధించారు. అందులో రూ.4 కోట్లు మాత్రమే వసూలైంది. నల్గొండ జిల్లాలో 844 పంచాయతీలు ఉండగా.. 24.94 కోట్లు టార్గెట్ పెట్టారు. రూ.7.98 కోట్లు మాత్రమే వసూలయ్యాయి. అత్యధిక పంచాయతీలు ఉన్న జిల్లా నల్గొండలో 31 శాతం మాత్రమే వసూలు చేశారు. నిజామాబాద్ లో 530 పంచాయతీలు ఉండగా... 27.43 కోట్లు టార్గెట్ విధించారు. అందులో రూ.9.27 కోట్లు వసూలు చేశారు.
శిథిలావస్థలో ఉన్న గృహాలకు పన్నులు వసూలు..
గ్రామాల్లో శిథిలావస్థలో ఉన్న గృహాలు, నివాసయోగ్యం లేని ఇండ్లు, కొన్నేండ్లుగా ఖాళీగా ఉంటున్న ఇండ్లుకు కూడా పన్నులు విధిస్తున్నారు. దీనివల్ల పన్ను బకాయిలు పేరుకుపోతున్నాయే తప్ప.. వాటిని చెల్లించేందుకు ఎవరూ ముందుకు రావట్లేదు. గతంలో 2020లో నాన్ అగ్రి ప్రాపర్టీ బుక్(ఎన్పీబీ) సర్వే చేశారు. ఇంటింటికెళ్లి ఫొటో తీసి ఈ– పంచాయతీ ఫోర్టల్లో ఆన్లైన్ చేశారు. దీంతో ఆ ప్రాపర్టీ బుక్లో నమోదైంది. దీంతో అప్పటి నుంచి పన్నులు వేస్తున్నారు.
అయితే, దీన్ని రికార్డుల నుంచి తొలగించాలంటే గ్రామంలో ఎన్ని ఇండ్లు ఉన్నాయో గుర్తించి రికార్డుల నుంచి తొలగించాలని గ్రామ సభలో తీర్మానం చేయాలి. ఆపై డీపీవో కు పంపిస్తే అక్కడి నుంచి పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయానికి పంపిస్తారు. అక్కడ కమిషనర్ నిర్ణయం మేరకు ఇలాంటి గృహాలను రికార్డుల నుంచి తొలగిస్తారు. ఇలా చేయకపోవడంతో శిథిలావస్థలో ఉన్న గృహాలకు ట్యాక్స్ విధించడంతో గ్రామాల్లో 100 శాతం పన్నుల వసూలు లక్ష్యం నెరవేరడం లేదు.
వంద శాతం లక్ష్యం చేరుకుంటాం
ఈ ఏడాది లక్ష్యంలో పన్ను వసూలు సగం దాటింది. పన్నులను రాబట్టడంలో అధికారులు, సిబ్బంది కీలక పాత్ర పోషించడం వల్లే ఇది సాధ్యమైంది. పన్ను వసూళ్లలో ఏ పంచాయతీ వెనుకబడిందో గుర్తించి ముందుకు తీసుకెళ్లేలా చర్యలు తీసుకుంటున్నాం. మార్చిలోపు లక్ష్యాన్ని చేరుకునేలా కార్యాచరణను అమలు చేస్తున్నాం. వంద శాతం పన్ను వసూలు చేస్తాం.
పీఆర్ అండ్ ఆర్డీ డైరెక్టర్ సృజన