ఇందల్వాయి, డిచ్పల్లి, వెలుగు: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తామని రూరల్ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి పేర్కొన్నారు. ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ఆయన ఆదివారం మొదటిసారిగా నియోజకవర్గానికి వచ్చారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు భూపతిరెడ్డికి ఘనస్వాగతం పలికారు.
చంద్రయాన్‌పల్లి వద్ద కాంగ్రెస్ జెండాఎగరేసి అమరవీరుల స్థూపానికి నివాళి అర్పించారు. అనంతరం ఇందల్వాయి టోల్‌ప్లాజా నుంచి మాధవ్‌నగర్ వరకు నిర్వహించిన విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్నారు. డిచ్పల్లి బస్టాండ్ వద్ద మహాలక్ష్మి స్కీమ్‌ను ప్రారంభించి, పథకం గురించి మహిళలకు వివరించారు. అనంతరం అమృత గార్డెన్స్‌లో పార్టీ శ్రేణులతో ఏర్పాటు చేసిన సమావేశంలో భూపతిరెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు సేవకుడిలా పనిచేస్తానని, జవాబుదారీగా ఉంటానన్నారు.
కార్యకర్తలు, లీడర్లు నిత్యం ప్రజల్లో ఉండాలని, వారి సమస్యలు తెలుసుకొని తన దృష్టికి తీసుకురావాలన్నారు. ప్రజలు చైతన్యవంతులని, అధికారం దాహంతో విర్రవిగితే ఎలా బుద్ధి చెప్పాలో వారికి బాగా తెలుసన్నారు. రూరల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చెస్తానని చెప్పారు. తన గెలుపునకు కృషి చేసిన కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. పీసీసీ ప్రధాన కార్యదర్శి నగేశ్‌రెడ్డి, లీడర్లు తాహెర్‌బిన్‌హందాన్, గడీల రాములు, కంచెట్టి గంగాధర్, ఇమ్మడి గోపి, శేఖర్‌గౌడ్, గంగారెడ్డి, తారాచంద్ నాయక్, అమృతాపూర్ గంగాధర్, నవీన్‌గౌడ్, శ్రీనివాస్, సంతోష్ రెడ్డి పాల్గొన్నారు.