- రోగాలతో ఆసుపత్రులకు క్యూ కడుతున్న పబ్లిక్
- పాలమూరు జిల్లాలో ఇప్పటికే 11 డెంగీ కేసులు నమోదు
మహబూబ్‌నగర్, వెలుగు: మల్టీపర్పస్ వర్కర్ల సమ్మెతో ఊళల్లో చెత్త కుప్పలు పేరుకుపోతున్నాయి. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో గ్రామాలు కంపు కొడుతున్నాయి. పందులు, కుక్కలు పొర్లాడుతుండడంతో అధ్వానంగా తయారయ్యాయి. దీనికితోడు దోమలు వ్యాప్తిస్తుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సీజనల్ వ్యాధుల కాలం కావడంతో ఎప్పటికప్పుడు చెత్తను తొలగించాలని కోరుతున్నారు.
20 రోజులుగా తిప్పలు..
జిల్లాలోని 475 గ్రామ పంచాయతీల్లో ఇంటింటికీ తిరిగి చెత్త సేకరించాల్సి ఉంది. మల్టీపర్పస్ వర్కర్లు ఈ నెల 6 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకు దిగారు. 20 రోజులుగా చెత్త సేకరణ పూర్తిగా నిలిపి వేశారు. మొదట కొద్ది రోజులు సర్పంచులు, ఉప సర్పంచులు సొంతంగా ట్రాక్టర్లను నడుపుతూ ఇంటింటికీ తిరిగి చెత్త సేకరించారు. 10 రోజులుగా జిల్లాలో వర్షాలు పడుతుండడంతో కొన్ని జీపీల్లో సర్పంచులు చెత్త సేకరణను నిలిపివేశారు. దీంతో బాలానగర్, హన్వాడ, నవాబ్‌పేట, జడ్చర్ల, రాజాపూర్, అడ్డాకుల, చిన్నచింతకుంట, దేవరకద్ర మండలాల్లోని కొన్ని గ్రామాల్లో చెత్త కుప్పలు పేరుకుపోయాయి. వర్షాలకు మోరీలు క్లీన్‌గా కనిపిస్తున్నా.. రోడ్డుపై మాత్రం ఎక్కడికక్కడ ప్లాస్టిక్ కవర్లు, చెత్తతో నిండిపోయాయి.
పెరుగుతున్న వ్యాధులు..
రెండు వారాలుగా జిల్లాలో ముసురు పట్టడంతో సీజనల్ వ్యాధులు ప్రారంభమయ్యాయి. దీంతో కొద్ది రోజులుగా మహబూబ్‌నగర్ జనరల్ హాస్పిటల్‌కు రోగులు క్యూ కడుతున్నారు. జులై ఒకటి నుంచి ఇప్పటి వరకు 17 వేల మంది ఓపీకి వచ్చారు. వైరల్ ఫీవర్ బాధితులు ఎక్కువగా ఉన్నట్లు డాక్టర్లు చెబుతుండగా, ఈ నెలలో ఇప్పటిరకు 11 డెంగీ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ లెక్కలు చెబుతున్నాయి.
ALSO READ:మంత్రి కేటీఆర్‌పై హెచ్ఆర్సీకి ఫిర్యాదు
నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం..
మల్టీపర్పస్ వర్కర్లు సమ్మెలో ఉండడంతో ప్రజలు చెత్తను రోడ్లపై పారేస్తున్నారు. ఆ చెత్త కుళ్లిపోయి వాసన వస్తోంది. దీనికితోడు పందులు, కుక్కలు కుప్పలను చిందరవందర చేస్తున్నాయి. దోమలు, ఈగలు వ్యాపిస్తుండడంతో వర్షాలు తగ్గుముఖం పట్టాక సీజనల్ వ్యాధులు మరింత ఉధృతమయ్యే చాన్స్ ఉన్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. డెంగీ, మలేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులు విజృంభిస్తాయని హెచ్చరిస్తున్నారు.