పార పట్టిన  గ్రామీణ విద్యార్థి

కరోనా ధాటికి అత్యంత ప్రభావితమైన రంగాల్లో మొదటిది విద్యారంగమే. దేశ సమగ్ర అభివృద్ధికి అక్షరాస్యతే కీలకం. మనదేశ అక్షరాస్యత రేటును పరిశీలిస్తే గ్రామీణ ప్రాంతాలకంటే పట్టణాల్లో ఎక్కువగా ఉంది. అవగాహన లేమి, కుటుంబ ఆర్థిక పరిస్థితులు, సదుపాయాలు లేకపోవడం మొదలైన కారణాలతో నిరక్షరాస్యత పెరుగుతోంది. తల్లిదండ్రులకు ఆర్థికంగా చేదోడువాదోడుగా ఉండేందుకు గ్రామీణ యువత చదువులను మధ్యలోనే ఆపేసి పనుల్లో చేరుతున్నారు. డ్రాప్ అవుట్ ల సంఖ్యను తగ్గించేందుకు ప్రభుత్వాలు బడిబాట కార్యక్రమాన్ని తీసుకొచ్చాయి. ఇప్పుడిప్పుడే గ్రామీణ పిల్లలు చదువుకు దగ్గరవుతున్న సమయంలో కరోనా మహమ్మారి, లాక్ డౌన్ వల్ల ఏడాదిన్నరగా స్కూళ్లకు తాళాలు వేయడంతో సమస్య మొదటికొచ్చింది. ఆన్ లైన్ ను ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం తీసుకొచ్చినా స్మార్ట్ ఫోన్లు, ఇంటర్నెట్​ అందరికీ అందుబాటులో లేకపోవడం, తల్లిదండ్రుల ఆదాయం క్షీణించడం, కొంత మందికి ఆన్ లైన్ లో చెప్పే పాఠాలు అర్థం కాకపోవడంతో చాలా మంది విద్యార్థులు పాఠాలు వినడమే మానేశారు. ప్రైవేట్  స్కూళ్ల ఫీజులు చెల్లించే స్థితిలో తలిదండ్రులు లేక‌పోవ‌టంతో మరికొందరు చదువు మానేయాల్సి వచ్చింది. విద్యా సంస్థలు తిరిగి ప్రారంభమయ్యే పరిస్థితులు లేకపోవడంతో తలిదండ్రులు వ్యవసాయ పనుల్లోకి పిల్లలను దించుతున్నారు. ప్రభుత్వం ఆన్ లైన్ లోనే పూర్తి విద్యా సంవత్సరాన్ని కొనసాగించడంతో విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో పడనుంది. ఒక ఉప ఎన్నిక గెలిచేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్న ప్రభుత్వం విద్యా రంగ సమస్య పరిష్కారానికి పూనుకోవడం లేదు. ఎన్నికల మీద ఉన్న కుతూహలం విద్యావ్యవస్థను  పటిష్టం చేయడంపై పెడితే ఆ ఫలాలు దేశాభివృద్ధికి దోహదపడతాయి.                                                                                                                                                                                       - ఎండీ ఖ్వాజా మొయినొద్దీన్, కరీంనగర్