- ఒక్క రోజే సుమారు లక్ష మంది రాక
వేములవాడ, వెలుగు : వేములవాడ రాజన్న ఆలయం సోమవారం శివనామస్మరణతో మార్మోగింది. శ్రావణమాసం మూడో సోమవారం కావడంతో రాష్ట్రంతో పాటు ఏపీ, మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్ నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. సోమవారం ఒక్క రోజే సుమారు లక్ష మంది భక్తులు స్వామివారిని దర్శించకున్నట్లు ఆఫీసర్లు తెలిపారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడంతో ఆర్జిత సేవలు రద్దు చేసి, లఘు దర్శనానికి అనుమతించినప్పటికీ రాత్రి వరకు రద్దీ కొనసాగింది.
స్వామి వారి దర్శనానికి 5 గంటలకు పైగా సమయం పట్టిందని భక్తులు తెలిపారు. పలువురు భక్తులు కోడె మొక్కు పూజలు చెల్లించారు. 1575 బ్రేక్ దర్శనాలు జరిగాయని ఆఫీసర్లు తెలిపారు. అంతకుముందు అర్చకులు వేదమంత్రోచ్ఛరణ మధ్య స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు.
ఉద్యోగులకు అంతర్గత బదిలీలు
వేములవాడ ఆలయ ఉద్యోగులను అంతర్గతంగా ట్రాన్స్‌ఫర్ చేస్తూ ఈవో వినోద్‌రెడ్డి ఆర్డర్స్ జారీ చేశారు. మూడు రోజుల కిందట ఆలయంలో ఏసీబీ ఆఫీసర్లు సోదాలు చేశారు. ఆలయంలోని లోపాలపై ఎక్స్‌లోనూ పోస్ట్ చేశారు. దీంతో అలర్ట్ అయిన దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు వెంటనే అంతర్గత బదిలీలు చేపట్టారు.
గోడౌన్ పర్యవేక్షకుడు, కల్యాణకట్టలో ఇద్దరు రికార్డ్ అసిస్టెంట్లు, ఒక వర్కర్, ముగ్గురు సూపరింటెండెంట్లు, 9 మంది సీనియర్, ఇద్దరు జూనియర్, ఐదుగురు రికార్డ్ అసిస్టెంట్లను బదిలీ చేశారు.