కొండగట్టులో భక్తుల రద్దీ

కొండగట్టు,వెలుగు: కొండగట్టు అంజన్న క్షేత్రంలో మంగళవారం భక్తుల రద్దీ నెలకొంది. స్కూల్, కాలేజీలకు సెలవులు ముగుస్తుండడంతో భక్తులు తమ మొక్కులు చెల్లించుకోవడానికి భారీగా తరలివచ్చారు. భక్తుల తరలి రావడంతో ఆలయ పరిసరాలు, క్యూలైన్లు నిండిపోయాయి. ఉచిత దర్శనానికి మూడు గంటలకు పైగా సమయం పట్టింది.

20 వేలకు పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.అన్ని రకాల దర్శనాల టికెట్లకు ఒకటే కౌంటర్​ ఉండడంతో భక్తులు అసహనం వ్యక్తం చేశారు. టికెట్ల కోసమే గంటల కొద్ది వేచి ఉంటే స్వామివారి దర్శనానికి ఎప్పుడు వెళ్లాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమారు రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. వాహన పూజకు భారీ వాహనాలు కొండపైకి రావడంతో భక్తులకు ఇబ్బంది ఏర్పడింది.

ఆలయ టెండర్లలో గోల్ మాల్.. 

కొండగట్టు అంజన్న సన్నిధిలో మంగళవారం నిర్వహించిన టెండర్లు గందరగోళంగా మారాయి. పెద్ద హనుమాన్  జయంతి సందర్భంగా భక్తులు సమర్పించిన ఇరుముడులు, విరమణ చేసిన మాలలు, ఇరుముడి బియ్యానికి అధికారులు టెండర్లు నిర్వహించారు.

కాగా, కాంట్రాక్టర్లు రింగ్​గా ఏర్పడి అధికారుల సమక్షంలోనే డబ్బులు పంపిణీ చేశారు. అయితే మీడియా ప్రతినిధులు ఉండడంతో తప్పని పరిస్థితిలో వేలం పాట కంటిన్యూ చేశారు. రూ.3.66 లక్షలకు టెండరుదారులకు అప్పగించారు.