
కొమురవెళ్లి, వెలుగు : కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయనికి ఆషాఢమాసంలో భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. స్వామివారికి కేశఖండన, అభిషేకం, నిత్యకల్యాణం, గంగారేగు చెట్టుకు ముడుపులు, తిరుగుడు కోడె, పట్నాలు, బోనాలు, అర్చనలు తదితర మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం మల్లన్న గుట్టపై ఉన్న రేణుక ఎల్లమ్మను
దర్శించుకున్నారు.
మల్లన్న సన్నిధిలో ప్రముఖులు
నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, మంత్రి హరీశ్ రావు ఓఎస్డీ బాలరాజ్ కుటుంబ సభ్యులు వేర్వేరుగా స్వామి వారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ అధికారులు, అర్చకులు ఘన స్వాగతం పలికారు. స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
వెండి పాత్రలు విరాళం
హైదరాబాద్ గాంధీ నగర్ కు చెందిన దాత డాక్టర్ బొద్దుల రామన్ దేవిక దంపతులు మల్లికార్జునస్వామికి నిత్యాన్నదాన పథకానికి రూ.1 లక్ష 116, విరాళంతో పాటు సుమారు మూడు కిలోల వెండి పూజ పాత్రలను ఆలయానికి అందజేశారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ బాలాజీ, చైర్మన్ భిక్షపతి, ధర్మకర్తలు, ఏఈవో లు వైరాగ్యం అంజయ్య, గంగ శ్రీనివాస్, సూపరింటెండెంట్లు నీల శేఖర్, శ్రీనివాస్ శర్మ, ప్రధాన అర్చకులు మహాదేవుని మల్లికార్జున్, అర్చకులు, ఒగ్గుపూజరులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.