- భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో వారం రోజులుగా జోరుగా వలసలు
- బీఆర్ఎస్లో అలకలకూ స్పెషల్ ప్యాకేజీలు
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో రాజకీయం అంతా ప్యాకేజీల మయంగా మారింది. ప్యాకేజీ కన్ఫర్మ్ కావడమే ఆలస్యం నాయకులు, కార్యకర్తలు ఆ గట్టు నుంచి ఈ గట్టుకు క్షణాల్లో జంప్ అవుతున్నారు. వారం రోజులుగా జిల్లాలో జంపింగ్‌ల సంఖ్య అన్ని పార్టీల్లోనూ జోరందుకుంది.
మరో పది రోజులే..
అసెంబ్లీ ఎన్నికలు మరో పది రోజులే ఉండడంతో జిల్లాలోని ప్రధాన పార్టీల క్యాండిడేట్లు, ఆయా పార్టీల నేతలు జంప్ జిలానీలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఆయా పార్టీల్లో అసంతృప్తితో రగులుతున్న నేతలతో పాటు చోటామోటా నాయకులు ఇదే అదునుగా భావించి ప్యాకేజీలు సెటిల్ చేసుకుంటూ గోడ దూకుతున్నారు. జిల్లాలోని కొత్తగూడెం, ఇల్లెందు, భద్రాచలం, పినపాక, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో ప్యాకేజీల జోరు కొనసాగుతోంది.
బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న కోనేరు సత్యనారాయణకు బీఆర్ఎస్లో చేరితే మంచి భవిష్యత్ ఉంటుందంటూ ఆశ చూపి పార్టీలోకి చేర్చుకున్నారు. చేరి దాదాపు రెండు నెలలు కావస్తున్నా ఆయన పరిస్థితి అడకత్తెరలో పోక చెక్కలా మారిందనే ప్రచారం పార్టీలోనే జరుగుతోంది. పినపాక నియోజకవర్గ ఇన్చార్జిగా బాధ్యతలు ఇచ్చినా ఆయన మాత్రం కొత్తగూడెం నియోజకవర్గంలోనే ఎక్కువగా తిరుగుతున్నారు. ఇందులో ఆంతర్యమేమిటో అర్థం కావడం లేదని పలువురు గుసగుసలాడుకుంటున్నారు.
కొత్తగూడెం నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీలోని ఓ ముఖ్య నేత దాదాపు రూ. 2కోట్లకు బీఆర్ఎస్కు అమ్ముడు పోయారని ఆ రెండు పార్టీల్లోని కార్యకర్తల్లో చర్చించుకుంటున్నారు. రెండు రోజుల కిందట కమ్యూనిస్టు పార్టీకి చెందిన రామవరం, రుద్రంపూర్ ఏరియాలకు చెందిన పలువురు ప్రజా సంఘాల నేతలను మంచి ప్యాకేజీలతో బీఆర్ఎస్ నేతలు లాక్కున్నారనే ప్రచారం సాగుతోంది. అంతకుముందు కమ్యూనిస్టు పార్టీకి చెందిన ఐదుగురు కౌన్సిలర్లలో ఒక్కొక్కరికీ రూ. 20 లక్షల ప్యాకేజీ ఆఫర్‌తో బీఆర్ఎస్ నేతలు చేర్చుకున్నారని సమాచారం.
భద్రాచలంలో సీపీఐకి చెందిన ముఖ్య నేతతో ప్రధాన క్యాడర్, కాంగ్రెస్ నుంచి సీనియర్ నేతలు తాండ్ర రమణ, రమేశ్‌గౌడ్‌తో పాటు పలువురు భారీ ప్యాకేజీలతో బీఆర్ఎస్లో ఇటీవల జాయిన్అయ్యారు. అశ్వారావుపేట నియోజవవర్గం నుంచి ఓ మాజీ ఎమ్మెల్యేతో పాటు జడ్పీటీసీలు ఇద్దరు భారీ ప్యాకేజీలతోనే బీఆర్ఎస్లో చేరారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.
అలకలకూ ఓ ప్యాకేజీ..
బీఆర్ఎస్తో పాటు కాంగ్రెస్ పార్టీలలో అలకలకూ ఓ ప్యాకేజీ నడుస్తున్నట్లు తెలుస్తోంది. కొత్తగూడెం నియోజకవర్గంలో ఇతర పార్టీల నుంచి తమ పార్టీలోకి వచ్చే వారితో పాటు తమ పార్టీలో ఉన్న ఒకరిద్దరు ముఖ్య నేతలు ఇతర పార్టీలోకి వెళ్లకుండా బీఆర్ఎస్ నేతలు ప్యాకేజీలు ఇస్తుండడంతో ఆ పార్టీలోని మరికొందరు ప్రజాప్రతినిధులు తమ సంగతేంటి అంటూ అలకబూనారు. తాము కూడా పార్టీ మారుతామంటూ హైకమాండ్‌కు ఆల్టిమేటం జారీ చేశారు.
దీంతో అధికార పార్టీ నేతలు అలకబూనినవారితో చర్చలు జరిపారు. కొత్తగూడెం మున్సిపాలిటీలోని 24 మంది కౌన్సిలర్లు పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్టు తెలుసుకున్న ఆ పార్టీ ముఖ్య నేతలు ఒక్కొక్కరికీ రూ. 8లక్షల చొప్పున ప్యాకేజీ ఇచ్చి కాపాడుకున్నారనే ప్రచారం ఉంది. ఇదే విధంగా ఓ ముఖ్య నేత పార్టీ మారుతున్నారనే ప్రచారంతో భారీ ప్యాకేజ్ ఇచ్చినట్టుగా ఆ పార్టీ కార్యకర్తలే పేర్కొంటుండడం గమనార్హం.