రష్యాలో చర్చిలపై ఉగ్రదాడి.. 15 మంది పోలీసులు మృతి

రష్యాలో భారీ ఉగ్రదాడి జరిగింది. రష్యాలోని దక్షిణ రిపబ్లిక్ ఆఫ్ డాగేస్తాన్‌లో 2024, జూన్ 23వ తేదీ ఆదివారం చర్చిలు, భద్రతా పోస్టులపై జరిగిన ఉగ్రదాడిలో 15 మంది పోలీసులు, పలువురు పౌరులు, మతగురువు మృతి చెందినట్లు ఆ దేశ గవర్నర్ సెర్గీ మెలికోవ్ వెల్లడించారు. పెంటెకోస్ట్ ఆర్థడాక్స్ పండుగ సందర్భంగా ముష్కరులు డెర్బెంట్, మఖచ్కల నగరాలను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడులకు పాల్పడినట్లు జూన్ 24వ తేదీ సోమవారం తెల్లవారుజామున గవర్నర్ వీడియో ప్రకటనలో తెలిపారు.

డాగేస్తాన్‌లో రెండు ఆర్థోడాక్స్ చర్చిలు, ఒక ప్రార్థనా మందిరం, ఒక పోలీసు చెక్ పోస్ట్‌పై  ముష్కరులు కాల్పులు జరిపినట్లు అధికారులు తెలిపారు. కాస్పియన్ సముద్రంలో ఉన్న డెర్బెంట్ నగరంలోని ఒక ప్రార్థనా మందిరం, చర్చిపై ముష్కరుల బృందం కాల్పులు జరిపినట్లు అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ఘటనలో చర్చి, ప్రార్థనా మందిరం రెండూ అగ్నికి ఆహుతయ్యాయి. 

ఇక, డాగేస్తాన్ రాజధాని మఖచ్కలలోని చర్చి, ట్రాఫిక్ పోలీసు పోస్ట్‌పై ఏకకాలంలో ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడినట్లు అధికారులు చెప్పారు. ఈ దాడుల్లో 15మంది పోలీసులతోపాటు చాలా మంది పౌరులు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.  ముస్లింలు అధికంగా ఉన్న ప్రాంతంలో జరిగిన దాడులను రష్యా జాతీయ ఉగ్రవాద వ్యతిరేక కమిటీ తీవ్రవాద చర్యలుగా ప్రకటించింది. సోమ, మంగళ, బుధవారాలను సంతాప దినాలుగా ప్రకటించారు.

ఉగ్రదాడి చేసిన వారిలో ఆరుగురు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. మరికొందరి ఉగ్రవాదుల కోసం పోలీసులు గాలిస్తున్నారని చెప్పారు.