- భారత ఎన్నికల్లో అమెరికా జోక్యం
- సంచలన ఆరోపణలు చేసిన రష్యా
న్యూఢిల్లీ: లోక్ సభ ఎన్నికల సమయంలో భారత్‌ను అస్థిరపర్చేందుకు అమెరికా ప్రయత్నిస్తోందని రష్యా ఆరోపించింది. ఇందులో భాగంగానే ఇటీవల అమెరికా ఫెడరల్ కమిషన్ రిలీజ్ చేసిన నివేదికలో.. ఇండియా మత స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్నట్లు నిరాధార ఆరోపణలు చేసిందని తెలిపింది. ఈ మేరకు గురువారం రష్యా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మరియా జఖరోవా రష్యా ప్రభుత్వ న్యూస్ నెట్‌వర్క్ ఆర్టీ న్యూస్ తో మాట్లాడారు. "భారతదేశ చరిత్రపై, భారతీయుల మనస్తత్వంపై అమెరికాకు అవగాహన లేదు.
అందుకే ఇండియాలోని మత స్వేచ్ఛపై కొంతకాలంగా నిరాధార ఆరోపణలు చేస్తున్నది. యూఎస్ ఆరోపణల వెనక కుట్ర దాగి ఉంది. ఎన్నికల వేళ భారత్ లోని అంతర్గత రాజకీయ పరిస్థితులను అస్థిరపరచి, ఎన్నికలను క్లిష్టతరం చేయడమే ఈ ఆరోపణల టార్గెట్. ఇది భారత అంతర్గత వ్యవహారాల్లో నేరుగా జోక్యం చేసుకోవడమే అవుతుంది" అని జఖరోవా వివరించారు. ఖలిస్తానీ టెర్రరిస్ట్ గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు జరిగిన కుట్రలో భారత్ ప్రమేయం ఉన్నట్లు అమెరికా చేసిన ఆరోపణలను కూడా జఖరోవా తప్పుపట్టారు. "మా వద్ద ఉన్న సమాచారం ప్రకారం.. పన్నూ హత్య కుట్రలో భారత్ ప్రమేయం గురించి అమెరికా తగిన ఆధారాలను ఇంకా అందించలేదు. సాక్ష్యాలు లేనప్పుడు ఈ అంశంపై ఊహాగానాలు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు" అని జఖరోవా అన్నారు.