ఇరాన్ పై ఆంక్షలు ఎత్తేయాలి

ఇరాన్ పై ఆంక్షలు ఎత్తేయాలి
  • అమెరికాకు చైనా, రష్యా, ఇరాన్ పిలుపు 
  • అణు ఒప్పందంపై చర్చలు తిరిగి ప్రారంభించాలి
  • బీజింగ్ లో మూడు దేశాల డిప్యూటీ ఫారిన్ మినిస్టర్ల భేటీ 

బీజింగ్/ వాషింగ్టన్: ఇరాన్ పై అమెరికా చట్ట వ్యతిరేకంగా ఆంక్షలు విధించిందని, వాటిని వెంటనే ఎత్తివేయాలని చైనా, రష్యా, ఇరాన్ డిమాండ్ చేశాయి. ఇరాన్ తో అణు ఒప్పందంపై తిరిగి చర్చలు ప్రారంభించాలని పిలుపునిచ్చాయి. శుక్రవారం ఉదయం బీజింగ్ లో చైనా, రష్యా, ఇరాన్ డిప్యూటీ ఫారిన్ మినిస్టర్లు మా ఝాక్సూ, ర్యాబ్కోవ్ సెర్గీ అలెక్సీవిచ్, కజెమ్ ఘరీబాబాదీ ఈ మేరకు భేటీ అయ్యారు. 

అణు ఒప్పందంపై చర్చలకు రావాలంటూ ఇటీవల ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీకి లేఖ రాశానని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో ఈ అంశంపై మూడు దేశాల మంత్రులు సమావేశమై చర్చలు జరిపారు. అనంతరం వారు  మీడియా సమావేశంలో సంయుక్త ప్రకటన చేశారు. 

‘‘ఇరాన్​పై ఏకపక్షంగా, చట్ట వ్యతిరేకంగా విధించిన అన్ని ఆంక్షలనూ ఎత్తివేయాలి. ప్రస్తుత పరిస్థితిని మెరుగుపర్చుకునేందుకు ఉన్న అడ్డంకులను తొలగించుకోవాలి. ఒత్తిడి, బెదిరింపులతో కూడిన వాతావరణంలో చర్చలు జరపడం సాధ్యం కాదు” అని ఈ సందర్భంగా అమెరికాకు మా ఝాక్సూ స్పష్టం చేశారు. తమ దేశానికి అడ్డంకులు సృష్టించేందుకు కొన్ని దేశాలు అనవసర సంక్షోభాలు తలెత్తేలా చేస్తున్నాయని ఇరాన్ మంత్రి కజెమ్ విమర్శించారు. 

ఇరాన్ వద్ద 8 వేల కిలోల యురేనియం..     

ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రాంను చేపట్టడానికి సంబంధించిన న్యూక్లియర్ డీల్​కు భద్రతా మండలి 2015లోనే ఆమోదం తెలిపింది. 2018లో ఈ డీల్ నుంచి అమెరికా బయటకి వచ్చింది. అణ్వాయుధాల తయారీ కోసం ఇరాన్ యురేనియంను పోగు చేసుకుంటోందంటూ పెద్ద ఎత్తున ఆంక్షలు విధించింది. 

2015 నాటి డీల్ ప్రకారం.. 3.67% లోపు ప్యూరిటీతో కూడిన 300 కిలోలలోపు యురేనియంను మాత్రమే సమకూర్చుకునేందుకు ఇరాన్​కు అనుమతి ఉంది. కానీ ఇరాన్ ఈ డీల్​కు విరుద్ధంగా 8,294.4 కిలోల యురేనియంను సమకూర్చుకున్నదని ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ (ఐఏఈఏ) నివేదిక వెల్లడించింది. 

కానీ తాము మాత్రం శాంతియుత కార్యకలాపాల కోసమే న్యూక్లియర్ ప్రోగ్రాం చేపట్టామని ఇరాన్ వాదిస్తోంది. అయితే, ఇరాన్ తో అణు ఒప్పందంపై చర్చలు ఫలించాలంటే ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్ తోపాటు వీటో పవర్ ఉన్న రష్యా, చైనా సపోర్ట్ చేయడం అనివార్యం కానుంది.

ఉక్రెయిన్ సైనికులను చంపొద్దు: ట్రంప్​ 

ఉక్రెయిన్  సైనికుల ప్రాణాలు కాపాడాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్  పుతిన్​కు అమెరికా ప్రెసిడెంట్  డొనాల్డ్  ట్రంప్  విజ్ఞప్తి చేశారు. పుతిన్​తో తాను జరిపిన చర్చలు ఫలవంతంగా ముగిశాయని తెలిపారు. రష్యా, ఉక్రెయిన్  మధ్య 2022 నుంచి జరుగుతున్న భయంకరమైన యుద్ధానికి ముగింపు పలకడానికి ఇదే సరైన సమయమని పుతిన్​కు తాను సూచించానని ట్రంప్  పేర్కొన్నారు.