ఉక్రెయిన్​పై రష్యా దాడి.. 50 మంది మృతి

ఉక్రెయిన్​పై రష్యా దాడి.. 50 మంది మృతి
  • బాలిస్టిక్  మిసైల్స్​తో రష్యా దాడి..
  • 200 మందికి పైగా తీవ్ర గాయాలు
  • శిథిలాల కింద మరింత మంది ఉండొచ్చన్న జెలెన్ స్కీ
  • ఆయుధాలిచ్చి ఆదుకోవాలని ప్రపంచ దేశాలకు రిక్వెస్ట్

కీవ్: ఉక్రెయిన్​పై రష్యా మంగళవారం మరోసారి విరుచుకుపడింది.. బాలిస్టిక్ మిసైళ్లతో దాడులు చేసింది. ఉక్రెయిన్ నగరం పాల్టోవాపై రెండు మిసైల్స్ ను ప్రయోగించింది. దీంతో 50 మంది దుర్మరణం పాలవగా 200 మందికి పైగా గాయపడ్డారని ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్ స్కీ ఓ వీడియో సందేశం విడుదల చేశారు. ఈ ఉగ్ర దాడులను నిలువరించేందుకు అంతర్జాతీయ సమాజం తమకు సాయం చేయాలని, దీర్ఘ శ్రేణి క్షిపణులను ఇచ్చి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

రష్యా మిసైల్ దాడిలో పాల్టోవాలోని ఓ ఆస్పత్రి, మరో కాలేజ్ బిల్డింగ్ దెబ్బతిన్నాయని తెలిపారు. శిథిలాల తొలగింపు తర్వాత మరణాల సంఖ్య పెరగొచ్చని చెప్పారు. ఈ దాడిలో ఆఫ్తులను కోల్పోయిన వారి కుటుంబాలకు సంతాపం తెలిపారు. కాగా, దాడి జరిగిన తర్వాత స్పందించి పలువురు బాధితుల ప్రాణాలు కాపాడిన స్థానికులకు జెలెన్ స్కీ ధన్యవాదాలు తెలిపారు.

జెలెన్ స్కీ ఏమన్నారంటే..

పాల్టోవాపై రష్యా  రెండు బాలిస్టిక్ మిసైల్స్​ను ప్రయోగించిందని వివరించారు. ఈ దాడిలో ఓ ఆసుపత్రి, మరో విద్యాసంస్థ బిల్డింగ్ దెబ్బతిన్నాయని తెలిపారు. ఘటనా స్థలంలో శిథిలాల తొలగింపు, సహాయక చర్యలు కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. ఆ శిథిలాల కింద జనం పెద్ద సంఖ్యలో చిక్కుకుని ఉంటారని జెలెన్ స్కీ ఆందోళన వ్యక్తం చేశారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. కాగా, ఈ దాడికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదంటూ ఆయన రష్యాను హెచ్చరించారు.

లాంగ్ రేంజ్ మిసైల్స్ ఇచ్చి ఆదుకోవాలంటూ ప్రపంచ దేశాలకు జెలెన్ స్కీ విజ్ఞప్తి చేశారు. ఎప్పుడో ఇవ్వడం కన్నా అవసరమైన సమయంలో ఇస్తే చాలా ప్రాణాలు కాపాడిన వారవుతారని చెప్పారు. ఒక్కో రోజు ఆలస్యమవుతున్న కొద్దీ ఉక్రెయిన్ మరింత మంది 
ప్రాణాలు కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రాణ నష్టానికి కారణం అదే..

రష్యా ప్రయోగించిన మిసైల్స్​ను తమ నిఘా వ్యవస్థ గుర్తించిందని, దీంతో అధికారులు పాల్టోవా వాసులను అప్రమత్తం చేశారని ఉక్రెయిన్ రక్షణ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. అయితే, క్షిపణి దాడి ప్రయోగానికి సంబంధించి ఈ హెచ్చరికలు చేసిన కాసేపటికే బాంబులు వచ్చి మీద పడ్డాయని పేర్కొంది. హడావుడిగా ఇళ్లు ఖాళీ చేస్తున్న జనం ఈ దాడిని తప్పించుకోలేక పోయారని తెలిపింది.