ఉక్రెయిన్‎పై విరుచుకుపడ్డ రష్యా.. 267 డ్రోన్లతో భీకర దాడులు

ఉక్రెయిన్‎పై విరుచుకుపడ్డ రష్యా.. 267 డ్రోన్లతో భీకర దాడులు

కీవ్: ఉక్రెయిన్‎పై మిలటరీ యాక్షన్ మొదలుపెట్టి సోమవారంతో మూడేండ్లు పూర్తవుతున్న సందర్భంగా రష్యా భీకర దాడులకు పాల్పడింది. శనివారం రాత్రి పుతిన్​సేనలు ఖార్కివ్, పోల్టావా, సుమీ, కీవ్, చెర్నిహివ్, మైకోలైవ్, ఒడెసాతో సహా ఉక్రెయిన్ వ్యాప్తంగా 13 ప్రాంతాల్లో 267 డ్రోన్లతో పెద్ద ఎత్తున దాడులు చేశాయి. ఈ దాడులను చాలా వరకు అడ్డుకున్నట్టు ఉక్రెయిన్ ఎయిర్ ఫోర్స్ కమాండ్ ప్రతినిధి యూరి ఇగ్నాట్ తెలిపారు. 138 డ్రోన్లను విజయవంతంగా కూల్చివేశామని, 119 డ్రోన్లు ఎటువంటి నష్టం కలిగించకుండా జామ్ అయి అదృశ్యమయ్యాయన్నారు. 

మరో పది డ్రోన్ల ఆచూకీ తెలియలేదన్నారు. అలాగే రష్యా మూడు బాలిస్టిక్ క్షిపణులను కూడా ప్రయోగించిందని చెప్పారు. ఐదు ప్రాంతాలలో ఎక్కువగా నష్టం జరిగినట్లు ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. డ్రోన్ దాడులపై ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వోలోదిమిర్ జెలెన్​స్కీ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. రష్యా దాడులను ‘ఎరియల్ టెర్రర్’గా పేర్కొంటూ తీవ్రంగా ఖండించారు. మూడేండ్ల యుద్ధంలో ఇదే అతిపెద్ద దాడి అన్నారు.

గత వారం రోజుల్లో రష్యా దాదాపు 1,150 డ్రోన్లు, 1,400కి పైగా గైడెడ్ ఏరియల్ బాంబులు, వివిధ రకాల మిసైళ్లు 35 ప్రయోగించిందని చెప్పారు. యూరప్ దేశాలు ఐఖ్యతను కొనసాగించాలని.. న్యాయమైన, శాశ్వత శాంతికి అండగా నిలబడాలని పిలుపునిచ్చారు. 24 ఫిబ్రవరి 2022న ‘స్పెషల్​ మిలటరీ యాక్షన్’ పేరుతో రష్యా ఉక్రెయిన్‎పై యుద్ధానికి దిగిన సంగతి తెలిసిందే.