మూడు క్షిపణులతో ఉక్రెయిన్‌పై రష్యా దాడి.. 17 మంది మృతి

రష్యా, ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఉత్తర ఉక్రెయిన్ లోని చెర్నిహిల్ నగరంపై బుధవారం రష్యా మూడు క్షిపణులను ప్రయోగించింది. ఈ దాడిలో 17 మంది వరకు మరణించారు. ముగ్గురు చిన్నారులతో  సహా 60 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. రష్యా ఉక్రెయిన్ పౌరులనే టార్గెట్ గా దాడులు చేస్తోందని చెర్నిహిల్ మేయర్ ఒలెక్సాండర్ లోమాకో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దాడులు జరగక ముందు ఉక్రెయిన్ మిత్ర దేశాలను ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీ వైమానిక రక్షణ సహాయాన్ని అందించాలని కోరారు.


ఇస్కాండర్ క్రూయిజ్ క్షిపణులతో రష్యా ఈ దాడి చేసింది. ఉక్రెయిన్  రాజధాని కైవ్ సిటీ నుంచి చెర్నిహిల్150 కి.మీ, రష్యా సరిహద్దు నుంచి దాదాపు 80 కి.మీ దూరంలో ఉంటుంది. ఉక్రెయిన్ స్థానిక సమయం ప్రకారం ఉదయం 9 గంటలకు స్కూల్స్, హాస్పిటల్, ఇళ్లు ఉండే ప్రాంతంలో మూడు క్షిపణులతో దాడి చేసింది. ఈ ప్రమాదంలో ఒక హోటల్ ధ్వంసమైందని అధికారులు తెలిపారు. నివాస భవనాలు, ఆసుపత్రి, విద్యా సౌకర్యం, డజన్ల కొద్దీ ప్రైవేట్ కార్లు దెబ్బతిన్నాయి.