ఉక్రెయిన్పై రష్యా దాడి.. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలే టార్గెట.. మిసైళ్లు, డ్రోన్లతో ఎటాక్

ఉక్రెయిన్పై రష్యా దాడి.. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలే టార్గెట.. మిసైళ్లు, డ్రోన్లతో ఎటాక్

కీవ్: ఉక్రెయిన్​పై రష్యా డ్రోన్, మిసైళ్లతో విరుచుకుపడింది. ఎనర్జీ ఇన్​ఫ్రాస్ట్రక్చర్ లక్ష్యంగా దాడులు చేసింది. 3 సంవత్సరాల యుద్ధాన్ని ముగించడంపై అమెరికాతో వచ్చే వారం చర్చలు జరుగుతాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్​స్కీ ప్రకటించాడు. ఈ కామెంట్ చేసిన కొన్ని గంటల తర్వాత గురువారం అర్ధరాత్రి దాటాక రష్యా దాడులు చేసింది. 

రష్యా దాడిలో భారీగా ఆస్తి నష్టం సంభవించినట్లు ఉక్రెయిన్ విద్యుత్ శాఖ మంత్రి హెర్మన్ హలుష్చెంకో తెలిపారు. పది మంది వరకు గాయపడ్డారని వివరించారు. వీరిలో పలువురు చిన్నారులు కూడా ఉన్నారని తెలిపారు. ఉక్రెయిన్ విద్యుత్, ఇంధన ఉత్పత్తి కేంద్రాలను దెబ్బతీయడమే రష్యా లక్ష్యంగా పెట్టుకున్నదని విమర్శించారు. ఉక్రెయిన్​ను చీకట్లో నెట్టేసేందుకు ప్రయత్నిస్తున్నదని ఫైర్ అయ్యారు. 

సాధారణ పౌరులే లక్ష్యంగా దాడులకు తెగబడుతున్నదని మండిపడ్డారు. రష్యా తరచూ తమ పవర్ గ్రిడ్​పైనే దాడులకు చేస్తున్నదన్నారు. ఈ దాడులతో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం తగ్గిందని తెలిపారు. తాగునీటి అవసరాలపై ఈ ప్రభావం పడుతున్నదని వివరించారు. తమ ధైర్యాన్ని దెబ్బతీసేందుకు వింటర్ సీజన్​ను రష్యా ఆయుధంగా ఉపయోగిస్తున్నదని ఫైర్ అయ్యారు. ఉక్రెయిన్ మిలటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్, ఆయుధాల తయారీని అడ్డుకోవాలనే కుట్రతో రష్యా పదే పదే తమ పవర్ గ్రిడ్​పై దాడులు చేస్తోందని క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ తెలిపారు.