రష్యా యుద్ధనౌకపై ఉక్రెయిన్​దాడి

కీవ్: ఉక్రెయిన్ బలగాలు జరిపిన వైమానిక దాడిలో క్రిమియాలోని తమ నేవీ యుద్ధ నౌక దెబ్బతిన్నట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది. ఫెడోసియా పోర్టు వ‌ద్ద అతి భారీ నౌక నోవోచెర‌కాస్క్​పై ఉక్రెయిన్ విమానం మిస్సైళ్లతో అటాక్ చేసిన‌ట్లు ర‌ష్యా చెప్పింది. అయితే రష్యా నౌక ఎంతమేరకు దెబ్బతిన్నదనే విషయం మంత్రిత్వ శాఖ పేర్కొనలేదు. కాగా ఉక్రేనియన్ చానల్​లో ప్రసారమైన వీడియోల ప్రకారం.. ఓడరేవు ప్రాంతంలో పెద్ద అగ్నిప్రమాదం జరిగింది. నౌక మొత్తం ధ్వంసమైందని ఉక్రెయిన్​ అధికారులు. 

“ఆ పేలుళ్లు ఎంత శక్తివంతమైనవో మేము చూశాం. దెబ్బతిన్న ఆ నౌక మనుగడ సాగించడం చాలా కష్టం” అని ఉక్రెయిన్​ ఎయిర్ ​ఫోర్స్ ​ప్రతినిధి యూరీ ఇహ్నాట్ రేడియో లిబర్టీలో పేర్కొన్నారు. యుద్ధనౌకను డ్యామేజ్ చేసిన త‌ర్వాత ర‌ష్యా ప్రతీకార దాడికి పాల్పడింది. ఉక్రెయిన్‌కు చెందిన రెండు ఫైటర్ జెట్లను నికోలేవ్ సిటీ వ‌ద్ద కూల్చిన‌ట్లు ర‌ష్యా తెలిపింది. అయితే మంగళవారం ఉక్రెయిన్​ఎయిర్​ఫోర్స్​తెలిపిన వివరాల ప్రకారం.. రష్యా 19 డ్రోన్‌లను మైకోలైవ్, ఒడెసా ప్రాంతాలపై ప్రయోగించింది. ఈ దాడిలో ఎలాంటి ప్రాణనష్టం జరగడం లేదని ఉక్రెయిన్ అధ్యక్ష కార్యాలయం పేర్కొంది.