అంతా వట్టిదే.. మాకేం తెల్వదు: భారత కంపెనీపై దాడి ఘటనపై రష్యా క్లారిటీ

అంతా వట్టిదే.. మాకేం తెల్వదు: భారత కంపెనీపై దాడి ఘటనపై రష్యా క్లారిటీ

న్యూఢిల్లీ: రష్యా-ఉక్రెయిన్ మధ్య దాదాపు మూడేళ్లుగా యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇరుదేశాలు పరస్పరం బాంబులు, రాకెట్లు, మిస్సైళ్ల దాడుల చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఉక్రెయిన్ రాజధాని కీవ్‎లోని భారతీయ ఔషధ సంస్థ కుసుమ్ హెల్త్‌కేర్ గిడ్డంగిపై రష్యా మిస్సైల్ ఎటాక్ చేసిందని ఉక్రెయిన్ ఆరోపించింది. రష్యా దాడిలో భారతీయ హెల్త్ కేర్ కంపెనీ గోడౌన్ పూర్తిగా నేలమట్టం అయ్యిందని తెలిపింది.

ఇందుకు సంబంధించిన ఫొటోలను కూడా జెలెన్ స్కీ ప్రభుత్వం విడుదల చేసింది. భారత్ మా మిత్రుడే అంటూ ఆ దేశానికి చెందిన కంపెనీలపైనే రష్యా దాడులు చేస్తోందని ఉక్రెయిన్ ఆరోపణలు చేసింది. ఈ ఘటనపై ఇండియా అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. దీంతో ఉక్రెయిన్ ఎంబసీ ఆరోపణలపై రష్యా స్పందించింది. కీవ్‌లోని భారతీయ ఔషధ సంస్థ కుసుమ్ హెల్త్‌కేర్ కంపెనీ గోడౌన్‎ను మిస్సైల్‎తో రష్యా ఢీకొట్టిందని ఉక్రెయిన్ చేసిన ఆరోపణలను ఇండియాలోని రష్యన్ రాయబార కార్యాలయం గురువారం (ఏప్రిల్ 17) తీవ్రంగా ఖండించింది.

►ALSO READ | ‘నాతో బిడ్డను కంటావా’..క్రిప్టో ఇన్ఫ్ల్యూయెన్సర్కు ఎలాన్ మస్క్ ప్రపోజల్! తర్వాత ఏం జరిగిందంటే

రష్యన్ సాయుధ దళాలు 2025, ఏప్రిల్ 12న కీవ్ తూర్పు ప్రాంతంలోని కుసుమ్ హెల్త్‌కేర్ ఫార్మసీ గిడ్డంగిపై దాడి చేయలేదని క్లారిటీ ఇచ్చింది. అలాగే.. ఇండియా కంపెనీపై దాడి చేయాలని కూడా ఎలాంటి ప్రణాళిక వేయలేదని రష్యన్ ఎంబసీ స్పష్టం చేసింది. ఉక్రెయిన్ మిస్సైలే ఆ  కంపెనీపై పడి ఉండవచ్చని రష్యా ఆరోపించింది. భారత కంపెనీపై దాడి ఘటనను మేం కాదంటే మేం కాదని.. ఇరు దేశాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం చర్చనీయాంశం మారింది.