రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ద మేఘాలు కమ్ముకుని దాదాపు వెయ్యి రోజులు దాటింది. అయితే యుద్ధం మొదలయ్యాక తొలిసారి ఉక్రెయిన్పై రష్యా ఖండాంతర క్షిపణిని (ICBM) ప్రయోగించింది. ఇంత పవర్పుల్ మిసైల్ను రష్యా ప్రయోగించడంతో ఉక్రెయిన్ ఉలిక్కిపడింది. రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం మొదలై 33 నెలలకు పైగానే అయింది. ఈ ఖండాంతర క్షిపణిని దక్షిణ ఆస్ట్రాఖాన్ ప్రాంతం నుంచి ప్రయోగించినట్లు కీవ్స్ ఎయిర్ ఫోర్స్ పేర్కొంది.
ఈ ఖండాంతర క్షిపణి రేంజ్ దాదాపు 5,500 కిలోమీటర్లు. అయితే రష్యా ప్రయోగించిన ఈ ఖండాంతర క్షిపణి వల్ల ఉక్రెయిన్ ఎంత మేర నష్టపోయిందనే విషయం తెలియాల్సి ఉంది. ఉక్రెయిన్లో ఏ ప్రాంతాన్ని టార్గెట్ చేసుకుని ఈ మిసైల్స్ను రష్యా ప్రయోగించిందనే విషయాన్ని కూడా ఉక్రెయిన్ ఇప్పటికైతే వెల్లడించలేదు. ఉక్రెయిన్పై ఖండాంతర క్షిపణి ప్రయోగంపై రష్యా ఇప్పటివరకూ స్పందించలేదు.
ALSO READ | పాక్‌లో ఆత్మాహుతి దాడి.. 12 మంది జవాన్లు మృతి
ఉక్రెయిన్ రాజధాని నగరం కీవ్కు చెందిన Ukrainska Pravda మీడియా సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం.. 5,800 కిలోమీటర్ల రేంజ్ సామర్థ్యం ఉన్న ఆర్ఎస్-26 రూబెజ్ అనే ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ను ఉక్రెయిన్పై రష్యా ప్రయోగించింది. ఈ ఆర్ఎస్-26 మిసైల్ పరీక్షలు 2012లో విజయవంతంగా పూర్తయ్యాయి. 12 మీటర్ల పొడవు, 36 టన్నుల బరువు కలిగిన ఈ ఖండాంతర క్షిపణి 800 కిలోల న్యూక్లియర్ బాంబును మోసుకెళ్లగలదు.
తాజాగా రష్యా ప్రయోగించిన ఈ ఖండాంతర క్షిపణి ఉక్రెయిన్ లోనే నాలుగో అతి పెద్ద నగరమైన డ్నిప్రో నగర వినాశనమే టార్గెట్గా దూసుకెళ్లింది. డ్నిప్రో నగరంలోని ప్రముఖ కంపెనీలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ను నాశనం చేసి ఉక్రెయిన్ ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేయాలనే ఉద్దేశంతో రష్యా ఈ ఖండాంతర క్షిపణిని ప్రయోగించిందని తెలిసింది.