- 22న ఐఎస్‌ఎస్‌కు పయనం..సోయజ్ ఎంఎస్14తో పంపుతున్న రష్యా
మనిషి ఆకారంలో ఉన్న సరికొత్త ఆండ్రాయిడ్ రోబోను మరికొద్ది రోజుల్లో స్పేస్‌లోకి పంపబోతోంది రష్యా. ఆగస్టు 22న సోయజ్ ఎంఎస్ 14 స్పేస్ క్రాఫ్ట్ ద్వారా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కు ఈ రోబో బయలుదేరుతోంది. అక్కడి ఆస్ట్రోనాట్లకు సాయం చేసేందుకు వీలుగా దీన్ని డిజైన్ చేశారు. తాజాగా ఆ రోబో ఫొటోను రష్యా స్పేస్ ఏజెన్సీ విడుదల చేసింది. ఫెడర్ (ఫైనల్ ఎక్స్‌పరిమెంటల్ డెమాన్‌స్ట్రేషన్ రీసెర్చ్) అని దానికి పేరు పెట్టింది. కజకిస్థాన్‌లోని బైకనూర్ కాస్మోడ్రోమ్‌లో ప్రస్తుతం ఈ రోబో బ్యాటరీ పరీక్షలు జరుగుతున్నాయి. ఆస్ట్రోనాట్లు చేయలేని, వాళ్లకు బోరింగ్ అనిపించే పనులను ఈ ‘రోబోనాట్’ చేస్తుంది. ఫెడర్ ఎత్తు 6 అడుగులు. బరువు 105 కిలోలు. సుమారు 20 కిలోల వరకు బరువులు ఎత్తగలదు. పడిపోతే లేవగలదు. పాకగలదు. కారును నడపగలదు. మున్ముందు చంద్రుడు, ఇతర గ్రహాలపై బేస్ ఏర్పాటు చేసుకోవడంలో ఈ రోబో సాయపడగలదని రష్యన్ నిపుణులు అంటున్నారు. స్పేస్‌లో నడిచే సందర్భాల్లో ఆస్ట్రోనాట్లు మున్ముందు ఇలాంటి రోబోల సాయం తీసుకుంటారని చెబుతున్నారు. ఫెడర్‌ను 2016 డిసెంబర్‌లో ప్రకటించారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ‘మూన్ ప్లాన్’లో భాగంగా దీన్ని తెరపైకి తెచ్చారు. సిరియాలో యుద్ధం జరిగినపుడు కష్టతరమైన వాతావరణ పరిస్థితుల్లో రోబోల అవసరం ఎంతో తెలిసొచ్చిందని రష్యా నేతలు గుర్తు చేశారు. అప్పుడే మరో ఐదేళ్లలో ఫెడర్‌ను స్పేస్‌లోకి పంపుతామని చెప్పామని, ఇప్పుడది నిజం కాబోతోందని వివరించారు. మొత్తానికి రోబోలూ స్పేస్ యాత్రకు రెడీ అవుతున్నాయి.