రెచ్చిపోతున్న రష్యా : ఉక్రెయిన్ పై మరోసారి దండయాత్ర : 2 గ్రామాలు స్వాధీనం

రెచ్చిపోతున్న రష్యా : ఉక్రెయిన్ పై మరోసారి దండయాత్ర : 2 గ్రామాలు స్వాధీనం

అమెరికా.. ఉక్రెయిన్ అధ్యక్షులు ట్రంప్, జెలెన్ స్కీ చర్చలు విఫలం అయిన తర్వాత రష్యా తన ప్రతాపం చూపిస్తోంది. ఇదే అదునుగా ఉక్రెయిన్ పై మరోసారి దండయాత్ర చేస్తోంది. రెచ్చిపోయి విరుచుకుపడుతుంది. 12  గంటల సమయంలోనే 154 డ్రోన్ మిస్సైల్స్ ప్రయోగించింది. ఉక్రెయిన్ లోని ఖార్కివ్ ఏరియాను టార్గెట్ చేస్తున్న దాడుల్లో.. ఇళ్లు, దుకాణాలు చాలా వరకు నేల మట్టం అయ్యాయి. 154 డ్రోన్లు రష్యా నుంచి వచ్చాయని ఉక్రెయిన్ ప్రకటించగా.. చాలా మంది గాయపడ్డారని స్పష్టం చేసింది. 

అమెరికా, ఉక్రెయిన్ చర్చల విఫలం తర్వాత.. మూడో ప్రపంచ యుద్ధం అంటూ అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యల తర్వాత రష్యా మరింత దూకుడుగా వ్యవహరిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. 

డ్రోనర్ మిస్సైల్స్ తోపాటు గ్రౌండ్ ఆపరేషన్ సైతం వేగవంతం చేసింది రష్యా. ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంలోని డొనెట్స్ ఏరియాలోని బుర్లాట్క్స్, స్కుడ్నే అనే రెండు గ్రామాలను స్వాధీనం చేసుకుంది. రష్యా దళాలు ఆయా గ్రామాల్లో ప్రవేశించి జెండాలు ఎగరవేసినట్లు రష్యా న్యూస్ ఏజెన్సీ TASS ప్రకటించింది. రష్యా సైన్యం తూర్పు ప్రాంతంలో చాలా రోజులుగా కాల్పుల విరమణ అమలు చేస్తోంది. అమెరికాలో జరిగిన పరిణామాల తర్వాత ఒక్కసారిగా దూకుడుగా వ్యవహరిస్తుందని రష్యా మీడియా వెల్లడించింది. ఇప్పటికే రెండు గ్రామాలను స్వాధీనం చేసుకున్న రష్యా.. ఉక్రెయిన్ లోని తూర్పు డొనెట్స్ ఏరియా మొత్తాన్ని తమ ఆధీనంలోకి తీసుకొనే విధంగా సైన్యం ముందుకు కదులుతున్నట్లు వెల్లడించింది ఆ న్యూస్ ఏజెన్సీ. 

ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంలో కొన్నాళ్లుగా సైలెంట్ గా ఉన్న రష్యా దళాలు.. ఇప్పుడు ఒక్కసారిగా దాడులు చేస్తూ ముందుకు రావటంపై ఉక్రెయిన్ ఆందోళనగా ఉంది. ఇప్పటికే రెండు గ్రామాలను స్వాధీనం చేసుకున్న రష్యా.. ఇదే ఊపులో పట్టు సాధించే దిశగా అడుగులు వేయొచ్చని ఉక్రెయిన్ ఆందోళనగా ఉంది.