
కీవ్: ఉక్రెయిన్ పై రష్యా మరోసారి భీకరంగా విరుచుకుపడింది. శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు 150 డ్రోన్లతో అటాక్ చేసింది. ఈ దాడుల్లో నలుగురు చనిపోయారు. పలువురు గాయపడ్డారు. డొనెట్స్క్ ప్రాంతంలోని కోస్టియాంటినివ్కాలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. నలుగురు గాయపడ్డారు. అలాగే, డ్నిప్రోపెట్రోవ్స్క్ ప్రాంతంలోని పాల్వోహ్ రాడ్ సిటీలో ఓ వ్యక్తి మృతి చెందగా.. 14 ఏండ్ల బాలిక గాయపడింది.
కుర్స్క్ రీజియన్ లో మిగతా భూభాగాలను నియంత్రణలోకి తీసుకున్నామని ప్రకటించిన కొద్ది గంటల్లోనే రష్యా ఈ దాడులకు పాల్పడింది. కాగా.. కాల్పుల విరమణకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వోలోదిమిర్ జెలెన్ స్కీ అంతకుముందు సుముఖత వ్యక్తం చేశారు. ఇరు దేశాల అధినేతలు కూడా చర్చలకు ఒప్పుకున్నారు. అంతలోనే పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. యుద్ధం ముగించడానికి పుతిన్ సిద్ధంగా లేరని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అనుమానం వ్యక్తం చేసిన కొద్ది రోజులకే ఉక్రెయిన్ పై రష్యా తాజాగా దాడులు చేసింది.