ఉక్రెయిన్​పై రష్యా 28 డ్రోన్లతో దాడి

కీవ్‌‌: రష్యా- శనివారం రాత్రే 28 డ్రోన్‌‌లు, మూడు క్రూయిజ్‌‌ క్షిపణులతో విరుచుకుపడినట్లు ఉక్రెయిన్‌‌ ఆరోపించింది. అందులో 21 డ్రోన్లను ధ్వంసం చేసినట్లు ఆ దేశ ఎయిర్​ఫోర్స్​ అధికారిక టెలిగ్రామ్‌‌ చానెల్‌‌లో పోస్టు చేసింది. రష్యా ప్రధానంగా తూర్పు, దక్షిణ ఉక్రెయిన్‌‌ ప్రాంతాలపై దృష్టి సారిస్తున్నట్లు తెలిపింది.

‘‘శత్రువులు దాడి వ్యూహాన్ని మార్చారు. ఖేర్సన్‌‌, నిప్రోపెట్రోవ్స్క్‌‌ ప్రాంతాలపై ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు’’ అని ఉక్రెయిన్‌‌ ఎయిర్​ఫోర్స్ అధికార ప్రతినిధి తెలిపారు. శత్రు డ్రోన్లను చిన్నపాటి ఆయుధాలతోనే కీవ్‌‌ సేనలు ధ్వంసం చేశాయని ఆయన పేర్కొన్నారు. తాజా దాడుల్లో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని కీవ్‌‌ తెలిపింది. ఉక్రెయిన్‌‌ వ్యాఖ్యలపై రష్యా ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.